Cab Rides: ఎక్కడికంటే అక్కడికి రాలేం.. క్యాబ్‌డ్రైవర్ల అనాసక్తి

author img

By

Published : Nov 23, 2021, 5:16 AM IST

Cab Rides

హైదరాబాద్​లో రోజూ 20-25 వేల క్యాబ్ రైడ్లు (Cab Rides) రద్దవుతున్నట్లు అంచనా. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌ నగరాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులున్నాయి.

క్యాబ్‌ (Cab Rides) బుక్‌ చేసుకుంటే చాలు ఎక్కడికైనా ఇట్టే వెళ్లిపోవచ్చనే భరోసా ఉండేది మొన్నటి వరకు. ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. యాప్‌ ద్వారా బుక్‌ చేస్తే... కాసేపటికే ‘సర్‌ ఎక్కడికి వెళ్లాలి?’ అంటూ డ్రైవర్‌ నుంచి ఫోన్‌ కాల్‌. వెళ్లాల్సిన ప్రాంతం చెప్పాక క్యాబ్‌ వస్తుందో, క్యాన్సిల్‌ అవుతుందో తెలియదు. హైదరాబాద్‌లోనే నిత్యం 20-25 వేల రైడ్లు రద్దవుతున్నట్లు అంచనా. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌ నగరాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులున్నాయి.

ట్రిప్పుల రద్దు...

హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో 10 వేల వరకు క్యాబ్‌లున్నాయి. రోజూ లక్షన్నర వరకు బుకింగ్‌లు వస్తాయని క్యాబ్‌ డ్రైవర్ల (Cab Rides) యజమానుల సంఘం అంచనా. అయితే ఖర్చులు భారీగా పెరగడం, వచ్చే ఆదాయం గతంలో మాదిరే ఉండడం, ఎయిర్‌పోర్టులో గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం వంటి కారణాలతో ట్రిప్పులు రద్దు చేయాల్సి వస్తోందని క్యాబ్‌ డ్రైవర్లు చెబుతున్నారు. ఎక్కడికెళ్లాలో ప్రయాణికుడిని అడగడం నిబంధనలకు విరుద్ధం. కానీ చాలామంది క్యాబ్‌ డ్రైవర్లు ఫోన్‌ చేస్తున్నారు. గిట్టుబాటు అవుతుందనుకుంటే సరి. లేదంటే ట్రిప్‌ క్యాన్సిల్‌ చేస్తున్నారు.

ఇలా చేయడానికి మారిన పరిస్థితులే కారణమని..క్యాబ్‌ (Cab Rides) యజమానుల సంఘాలు చెబుతున్నాయి. యాప్‌ ద్వారా బుకింగ్‌ల సేవలందించే సంస్థలే లాభపడుతున్నాయని అంటున్నాయి. క్యాబ్‌ డ్రైవర్లు ట్రిప్‌ క్యాన్సిల్‌ చేయడం వల్ల ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతోంది. డ్రైవర్లు ప్రయాణికుడి రాక ఆలస్యం.. సరిగాలేని ప్రవర్తన..తప్పుడు లోకేషన్‌..వంటి కారణాల్ని చూపిస్తుండటంతో ఒక్కో క్యాన్సిలేషన్‌కు రూ.50 వరకు భారం ప్రయాణికులపై పడుతోంది.

అలాంటి ట్రిప్పులు క్యాన్సిల్‌ చేస్తున్నాం...

సల్మాన్‌

ఎయిర్‌పోర్టుకు వెళితే మాకొచ్చేది దూరాన్నిబట్టి రూ.230-రూ.440 మాత్రమే. అందులో సగానికిపైగా డీజిల్‌ఖర్చుకే. ఎయిర్‌పోర్టులో 4-5 గంటలు ఆగాలి. లేదంటే ఔటర్‌, ఆరాంఘర్‌ వరకు ఖాళీగా రావాలి. అందుకే ఎయిర్‌పోర్టు రైడ్ల(Cab Rides)ను వదులుకుంటున్నాం. నగరంలోనూ ప్రయాణికుడి పికప్‌ ఏరియా 4, 5 కిమీ దూరం ఉన్నప్పుడూ కొందరు డ్రైవర్లు రద్దు చేస్తున్నారు. డీజిల్‌ ఖర్చుల పెరుగుదల, బుకింగ్‌ ఆదాయంలో యాప్‌ కంపెనీలకే లబ్ధి ఉండటంతో గిట్టుబాటు కావట్లేదు.

- సల్మాన్‌, క్యాబ్‌ డ్రైవర్‌, హైదరాబాద్‌

గిట్టుబాటు కాని పరిస్థితుల్లోనే...

ఉల్కుందార్‌ శివ

గతంతో పోలిస్తే ట్రిప్‌ల క్యాన్సిలేషన్‌ బాగా పెరిగిన మాట వాస్తవమే. గిట్టుబాటు కాని పరిస్థితుల్లోనే ఇలా చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఒక్కో కారుకు సీరియల్‌ నంబరు ఇస్తారు. 300 వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటోంది. వంతు రావడానికి 4 గంటల సమయం. అంతసేపు ఉండలేక, ఖాళీగా రాలేక ఎయిర్‌పోర్టు బుకింగ్‌లను చాలామంది క్యాన్సిల్‌ చేస్తున్నారు.

- ఉల్కుందార్‌ శివ, తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్లు, యజమానుల సంఘం అధ్యక్షుడు

* రాక్‌టౌన్‌ కాలనీకి చెందిన విజయ్‌ బంధువుల ఇంటికి క్యాబ్‌లో వెళ్లాలనుకున్నాడు. 15 నిమిషాలు ప్రయత్నిస్తే గానీ దొరకలేదు. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్‌ నుంచి ఫోన్‌. ఆ తర్వాత రైడ్‌ రద్దయినట్లు సమాచారం.

* ఐటీ ఉద్యోగి ఆనంద్‌ ఎయిర్‌పోర్టు వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకుంటే 20 నిమిషాల తర్వాత ఫోన్‌ కాల్‌. వెళ్లాల్సినచోటు చెప్పాక ట్రిప్‌ క్యాన్సిల్‌. తర్వాత మరో బుకింగ్‌కూ అదే పరిస్థితి. హడావిడిగా రోడ్డుపైకి వచ్చి కనిపించిన కారుకు అడిగినంత సమర్పించుకుని ఆఖరి నిమిషంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: MLC elections in telangana 2021: ఆరుగురు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.