Campus placements: ప్రాంగణ నియామకాల జోరు.. విద్యాసంస్థలకు కంపెనీల క్యూ

author img

By

Published : May 13, 2022, 6:07 AM IST

Campus placements

Campus placements: ప్రాంగణ నియామకాల్లో సరికొత్త జోరు కనిపిస్తోంది. విద్యార్థులను నేరుగా కళాశాలల నుంచి నియమించుకునేందుకు కంపెనీలు వరుస కడుతున్నాయి. రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ప్రాంగణ నియామకాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో పరిస్థితిలో మార్పు వచ్చింది.

Campus placements: కరోనా కారణంగా ఆర్థికంగా కాస్త డీలా పడిన కంపెనీలకు ఇప్పుడిప్పుడే కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. సీనియర్ల కంటే ఫ్రెషర్లను ఎంచుకుంటే మూడు నుంచి నాలుగేళ్లపాటు బాగా పనిచేస్తారని భావిస్తున్నాయి. అందుకే వివిధ కోర్సుల్లోని చివరి ఏడాది విద్యార్థులకు గాలం వేస్తున్నాయి. దీనికితోడు అంకుర సంస్థల కార్యకలాపాలు బాగా పెరిగాయి. పెట్టుబడులు అధికంగా వస్తుండటంతో విస్తరణపై దృష్టి పెట్టి ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇటీవల నగరంలోని ప్రైవేటు కళాశాలలో జరిగిన క్యాంపస్‌ నియామకాల్లో రెండు అంకుర సంస్థలు రూ.20-21లక్షల వార్షిక వేతనాలతో ముగ్గురు విద్యార్థులను తీసుకున్నాయి. గతేడాదితో పోలిస్తే వార్షిక ప్యాకేజీల్లో 30-40శాతం పెరుగుదల కనిపిస్తోంది. విద్యార్థులను ఎంచుకోవడంతో పాటు చివరి ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పిస్తున్నాయని, ఆ సమయంలో స్టైఫండ్‌లు ఇస్తున్నాయని ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ వివరించారు. ‘‘2020లో బిట్స్‌ క్యాంపస్‌ను 194 కంపెనీల ప్రతినిధులు సంప్రదించగా.. ఈసారి ఆ సంఖ్య 320దాటే అవకాశం ఉంది’’ అని వర్సిటీ ప్రాంగణ నియామకాల అధికారి బాలసుబ్రహ్మణ్యం వివరించారు.

బిట్స్‌ పిలానీ-హైదరాబాద్‌ క్యాంపస్‌లో గత విద్యా సంవత్సరంలో 915మందికి కొలువులు దక్కాయి. ఈసారి ఇప్పటికే 1020 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత సంవత్సరం సగటు వార్షిక వేతనం రూ.15లక్షలు ఉండగా.. ఈ దఫా రూ.17.71 లక్షలకు పెరిగింది. ట్రిపుల్‌ ఐటీలో ఏటా వంద శాతం నియామకాలు జరుగుతున్నాయి. వార్షిక ప్యాకేజీ గతంలో రూ.30లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.35-40లక్షలకు పెరిగిందని అక్కడి ప్రొఫెసర్లు తెలిపారు.


ఎమర్జింగ్‌ టెక్నాలజీ ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ప్రాథమిక అంశాలపై నైపుణ్యాలు, సృజనాత్మకత ఉంటే చాలు విద్యార్థులకు ఒకటీ రెండు బ్యాక్‌లాగ్స్‌ ఉన్నా ఎంపిక చేసుకుంటున్నాయి. కానీ చివరి సెమిస్టర్‌ నాటికి బ్యాక్‌లాగ్స్‌ పూర్తి కావాలనే షరతు విధిస్తున్నాయి.

- రామ్మోహన్‌, మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల నియామకాల అధికారి

కంపెనీలకు ప్రాజెక్టులు వస్తుండటంతో నియామకాలు పెరుగుతున్నాయి. ఈ ధోరణి 2025వరకు కొనసాగుతుంది. తర్వాత కాస్త నెమ్మదించవచ్చు.

- జయరాం, తెలంగాణ శిక్షణ, ప్రాంగణ నియామకాల అధికారుల సంఘం అధ్యక్షుడు


ఒకేసారి మూడు కంపెనీల్లో ఎంపికయ్యా. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ, పరీక్షలతో డాటా అనాలసిస్‌, సబ్జెక్టు పరిజ్ఞానం, కోడింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌ వంటి అంశాలపై కంపెనీలు ఎక్కువగా దృష్టి పెట్టాయి. ప్రతి విద్యార్థి తప్పకుండా ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి.

- బి.నిఖిల్‌ చంద్రపాల్‌, ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఫైనలియర్‌ విద్యార్థి


* 2020-21 సంవత్సరానికి హెచ్‌సీయూలో 396 మందిని ప్రాంగణ నియామకాల్లో కంపెనీలు ఎంచుకోగా.. ఈ ఏడాది ఇప్పటికే 486 మందికి కొలువులు దక్కాయి. గతేడాది అత్యధిక వేతనం రూ.17లక్షలుండగా, ఈసారి రూ.23 లక్షలు. ఓయూలో సీఎస్‌ఈ చివరి ఏడాది చదువుతున్న టి.సిద్ధార్థను రూ.25లక్షల వార్షిక వేతనంతో ఓ కార్పొరేట్‌ కంపెనీ ప్రాంగణ నియామకాల్లో ఎంచుకుంది.

ఇవీ చూడండి: Dalit Bandhu Cash Misuse: ప్రైవేటు ఖాతాల్లోకి దళితబంధు నిధులు.. దాదాపు 15 రోజులకు..!

కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.