భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. షెడ్యూల్ ఇలా..!!

author img

By

Published : Jun 23, 2022, 9:24 PM IST

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. షెడ్యూల్ ఇలా..!!

హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాజపా సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఈ సమావేశం దోహదపడుతుందని నేతలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి బుధవారం స్టీరింగ్‌ కమిటీలో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జులై 2, 3 తేదీల్లో సమావేశాలు జరగనుండగా.. రెండ్రోజుల ముందే పలువురు నేతలు హైదరాబాద్‌ వచ్చి నియోజకవర్గాల్లో పర్యటించి.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి సమీక్షించి నివేదిక అందించనున్నారు.

తెలంగాణలో పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న కమలదళం... ఇందుకు హైదరాబాద్‌లో జులై తొలివారంలో జరిగే భేటీని ఒక అవకాశంగా మార్చుకోవాలని చూస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జాతీయ నేతలు పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం కేంద్ర కార్యాలయంలో సమావేశాల నిర్వహణ స్టీరింగ్‌ కమిటి సమీక్షలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జులై 2, 3 తేదీల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హజరైయ్యేందుకు కేంద్ర మంత్రులు, పలువురు జాతీయ నేతలు ముందుగానే హైదరాబాద్‌ చేరుకుంటారు. ఈనెల 30 ఉదయానికే సుమారు 190 మంది కార్యవర్గ సభ్యులు భాగ్యనగరానికి రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరంతా... పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది. అనంతరం కార్యవర్గ సమావేశాల ప్రారంభానికి ముందే తెలంగాణలో పార్టీ పరిస్థితి, ఏ నియోజకవర్గంలో ఎలా ఉందో ఒక నివేదిక అందించనున్నట్లు కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రులు, జాతీయ నేతల క్షేత్రస్థాయి పర్యటన వల్ల.. పార్టీకి నూతనోత్తేజం వస్తుందని, బలోపేతం అవడానికి ఇదొ మార్గమని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే సందర్భంలో.. బూత్‌ స్థాయి నేతలు, కార్యకర్తలతో మమేకం కానున్నారు.

జులై 1న పార్టీ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా... హైదరాబాద్‌ చేరుకుని నేరుగా కార్యవర్గ సమావేశాలు జరిగే నోవాటెల్‌ హోటల్‌కు వెళ్తారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి.. నోవాటెల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర పార్టీ భావిస్తోంది. ఇందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలను సమీకరించనున్నారు. జులై 1న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీ.. రెండు ఉదయం నుంచి జాతీయ పదాధికారుల సమావేశం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశం మొదలవుతుంది. ప్రధాని, హోంమంత్రి సహా... మరికొందరు సీనియర్‌ మంత్రులు రెండో తేదీ మధ్యాహ్నానికి హైదరాబాద్‌ చేరుకుంటారని పేర్కొన్నారు. ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

ఇవీ చదవండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణకు న్యూయార్క్ విమానాశ్రయంలో ఘనస్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.