'సామాజిక న్యాయం అంటే.. కొడుకు, బిడ్డ, మేనల్లుడికి పదవులివ్వడమా ?'

author img

By

Published : Jan 21, 2023, 10:52 AM IST

Laxman

Laxman fires on CM KCR: బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ మరోసారి తనదైన శైలిలో సీఎం కేసీఆర్​పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అధికారం సాధించి డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం అంటే.. తండ్రి, కొడుకు, బిడ్డ, మేనల్లుడికి పదవులా అని ప్రశ్నించారు.

Laxman fires on CM KCR: గుజరాత్‌ తరహా అభివృద్ధి తెలంగాణకు కావాలని.. ఆ రాష్ట్ర ఎన్నికల్లో అనుసరించినట్లుగానే అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటామని బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అధికారం సాధించి డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్​ఎస్ తోకపార్టీగా మిగులుతుంది : ప్రధాని మోదీ రాసిన ‘పరీక్ష యోధులు’ (‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ రచనకు తెలుగు అనువాదం) పుస్తకాన్ని శుక్రవారం బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మల్లారెడ్డి, ఎన్వీ సుభాష్‌, సంగప్పలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్‌ తన పార్టీని బీఆర్​ఎస్​గా మార్చినా కేజ్రీవాల్‌, అఖిలేశ్‌యాదవ్‌లను రప్పించుకున్నా అది ప్రజల ఆదరణ పొందదని, జాతీయ రాజకీయాల్లో తోకపార్టీగా మిగులుతుందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ, నిరంకుశపాలనపై 16, 17 తేదీల్లో దిల్లీలో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించామన్నారు. రాష్ట్రంలో అధికారం సాధించడమే తమ లక్ష్యమని.. బండి సంజయ్‌ తన పాదయాత్రతో ప్రజల్ని చైతన్యవంతులను చేశారని లక్ష్మణ్‌ వివరించారు.

కేటీఆర్‌ చదువుకున్న అజ్ఞాని : గుజరాత్‌ మోడల్‌పై కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. గుజరాత్‌లో బీజేపీ వికసించిందన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం అంటే.. తండ్రి, కొడుకు, బిడ్డ, మేనల్లుడికి పదవులా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ చదువుకున్న అజ్ఞాని అంటూ లక్ష్మణ్‌ విమర్శలు గుప్పించారు. సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తారా ? అన్న ప్రశ్నకు బదులిస్తూ జాతీయకార్యవర్గ సమావేశంలో సంజయ్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించడాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.