BJP Jan Sampark Abhiyan in TS : అధికారమే లక్ష్యంగా వ్యూహం.. జనం చెంతకు బీజేపీ
Published: May 24, 2023, 7:14 AM


BJP Jan Sampark Abhiyan in TS : అధికారమే లక్ష్యంగా వ్యూహం.. జనం చెంతకు బీజేపీ
Published: May 24, 2023, 7:14 AM
BJP Jan Sampark Abhiyan in Telangana : కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై పడకుండా బీజేపీ అప్రమత్తమైంది. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టి... ఈనెల 30వ తేదీతో తొమ్మిదేళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా 'జన్ సంపర్క్ అభియాన్' పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోనూ జన్ సంపర్క్ అభియాన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు.
BJP Jan Sampark Abhiyan in Telangana : రాష్ట్రంలో అధికారం సాధించాలని భావిస్తున్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల ఫలితాలు... తీవ్ర సంకట పరిస్థితిని తెచ్చిపెట్టాయి. కన్నడ సీమలో కాంగ్రెస్ గెలుపు ప్రభావంతో... రాష్ట్ర బీజేపీలోకి చేరికలు నిలిచిపోయాయి. పార్టీలో అసంతృప్త నేతలు.... చేజారిపోకుండా చూసేందుకు సతమతమవుతున్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సహా మరికొంత మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం... సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఆ ప్రచారంతో అప్రమత్తమైన బీజేపీ : ఈ ప్రచారాన్ని ఆయా నేతలు ఖండించినప్పటికీ... రాష్ట్ర నాయకత్వం మాత్రం అప్రమత్తమైంది. కాషాయ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు చర్యలు చేపట్టింది. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న జన్ సంపర్క్ అభియాన్‌ను అస్త్రంగా మలచుకోవాలని భావిస్తోంది. శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతోపాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు.. కార్యాచరణ రూపొందించుకుంది.
మొత్తం 51.. తెలంగాణలో 4.. : ఈనెల 30 నుంచి జూన్ 30 వరకు నెల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 51 భారీ బహిరంగ సభల్లో... 4 సభలు తెలంగాణలో నిర్వహించేందుకు ప్రణాళికలు రచించారు. జూన్ 1 నుంచి 21 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ సభలకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని... ప్రతి మండలంలో పది చోట్ల యోగా కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 22న శక్తి కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. జూన్ 23న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా పది లక్షల మంది బూత్ కమిటీ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా సమావేశంకానున్నారు. జూన్ 25న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం రోజు మేధావులు, విద్యావంతులతో సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
గడప గడపకూ ప్రచారం.. : రాష్ట్రంలో నిర్వహించే జన సంపర్క్ సభలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ కమల దళపతి జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా... ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు రాష్ట్ర నాయకత్వం తెలిపింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ సభలు నిర్వహించాలని భావిస్తోంది. తొమ్మిదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తిరిగి కమలదండు విస్తృతంగా ప్రచారం చేయనుంది.
ఇవీ చదవండి :
