BJP OBC Meeting in Hyderabad : 'కేసీఆర్.. బీసీలకు గొర్లు, బర్లు తప్ప ఏం ఇచ్చారు?'

author img

By

Published : May 18, 2023, 5:11 PM IST

Bandisanjay

BJP OBC Meeting in Hyderabad : తెలంగాణలో భజరంగదళ్​ను నిషేదించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో 50 శాతం మంది బీసీలుంటే.. ముగ్గురికే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. హైదరాబాద్‌ నాగోల్‌లోని శుభం గార్డెన్స్‌లో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బీజేపీ ఓబీసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

దళితబంధు వలె.. బీసీబంధు ప్రకటించాలి

BJP OBC Meeting in Hyderabad : రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. బీసీలకు కేసీఆర్.. గొర్లు, బర్లు తప్ప ఏం ఇచ్చారని ప్రశ్నించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీలకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా లక్ష్మణ్‌ హామీ ఇచ్చారు.

రాష్ట్ర బడ్జెట్​లో బీసీలకు కేటాయించింది కేవలం రూ.5 వేల కోట్లేనని.. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్​ బాపూజీ, గూడ అంజయ్యను అవమానించిన వ్యక్తి కేసీఆర్ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులే ఇచ్చి.. రాజకీయంగా అణగదొక్కారని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీసీలందరూ ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని బండి పిలుపునిచ్చారు. రూ.16 వందల కోట్లతో సచివాలయం మాత్రం పూర్తి చేశారని.. బీసీ ఆత్మ గౌరవ భవనాన్ని కేసీఆర్ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని బండి ప్రశ్నించారు.

ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని దుయ్యబట్టారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన ఘనత నరేంద్ర మోదీదే అని పేర్కొన్నారు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చెందడం లేదో చెప్పాలని.. మజ్లీస్ నేతలను పాతబస్తీలోని ముస్లింలు ప్రశ్నించాలన్నారు.

ఈ క్రమంలోనే భజరంగ్​దళ్​ను నిషేదించాలని దేశంలోని ఏ ముస్లిం కోరుకోవడం లేదని.. తెలంగాణ రాష్ట్రంలో భజరంగ్​దళ్ ఎక్కడా విధ్వంసం సృష్టించలేదని.. అలాంటిది తెలంగాణలో భజరంగ్​దళ్‌ను నిషేధించాాలని కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుమార్తె లిక్కర్ దందా చేసి రూ.వందల కోట్లు సంపాదించిందన్నారు. కేసీఆర్‌ బీసీ సబ్ ప్లాన్, అభివృద్ధికి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళిత బంధులో 30 శాతం కమీషన్ రూపంలో నాయకులకు పోతోందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని.. నిజానికి అంతకంటే పెద్ద మొత్తంలో పక్కదారి పడుతున్నట్లు సంజయ్ తెలిపారు. బీసీ బంధు ప్రకటించేందుకు ఉన్న ఇబ్బంది ఏమిటో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని.. తెలంగాణలో రాక్షస రాజ్యం పోయి.. రామరాజ్యం రావాలని బండి సంజయ్‌ ఆకాంక్షించారు.

"రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారు. దళిత బంధులో 30 శాతం కమీషన్ రూపంలో నాయకులకు పోతోందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఇంకా పెద్దమొత్తంలో పక్కదారి పడుతోంది. దళితబంధు మాదిరిగా.. బీసీ బంధు ప్రకటించాలి." - బండి సంజయ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.