'పోడు భూముల్లో హరితహారం వద్దు.. గిరిజనుల పొట్టకొట్టొద్దు'

author img

By

Published : May 29, 2022, 12:32 PM IST

బండి సంజయ్‌

Bandi sanjay Letter To Cm: పోడు భూముల్లో హరితహారం కార్యక్రమం నిలిపివేసి ఆ భూములకు పట్టాలివ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. గిరిజనులను నయవంచనకు గురిచేస్తున్నా పోడు భూముల్లో హరితహారం చేపట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేలాదిమంది పోడు రైతులకు న్యాయం చేయాలని బండి డిమాండ్ చేస్తూ.. కేసీఆర్​కు లేఖ రాశారు.

Bandi sanjay Letter To Cm: హరితహారం పేరుతో పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను ఉపాధి లేకుండా చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం.. పోడుభూముల్లో హరితహారం కార్యక్రమం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల వేలాది మంది గిరిజనులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము హరితహారం కార్యక్రమానికి వ్యతిరేకం కాదని కేవలం పోడు భూముల్లో మాత్రమే నిలిపివేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమం చేపడితే భాజపాకు ఎలాంటి అభ్యంతరం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు బండి సంజయ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసారు.

పోడు భూముల సమస్యపై సీఎంగా 2019లో అసెంబ్లీలో చేసిన ప్రకటన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో 24 జిల్లాల్లో 10 లక్షలకు పైగా పోడు భూముల పట్టాల సమస్య ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006 సంవత్సరంలో పోడుభూములకు పట్టాల కోసం 1,83,252 దరఖాస్తులు రాగా 1,01,177 మందికి హక్కు పత్రాలు అందాయి. అప్పటినుండి కొనసాగుతున్న పోడుభూముల సమస్యపై ప్రభుత్వం తాత్సారం చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఆరోపించారు. కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవిపై, అటవీ ఫలాలపై, పోడుభూములపై గిరిజనులకు పూర్తి హక్కులున్నాయని చట్టపరంగానే వారికున్న హక్కులను తెరాస ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరమని అగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలకోసం ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగా మరోవైపు ఆ భూముల్లో హరితహారానికి ఫారెస్ట్‌ అధికారులు సన్నాహం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యల వలన గిరిజన ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని సంజయ్‌ హెచ్చరించారు.

గతంలో ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి చర్యల వల్ల గిరిజనులకు, ఫారెస్టు అధికారుల మధ్య ఘర్షణలు తలెత్తాయని... అనేక జిల్లాల్లో అమాయకులపై అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం జైలుకు పంపిందని ఆరోపించారు. ఆదివాసులు, గిరిజనులు అడవికి హక్కుదారులని... ఈ విషయం గ్రహించి.. దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్క గిరిజనుడు, ఆదివాసీకి పట్టా మంజూరు చేయాలని సూచించారు. పోడుభూముల సమస్యపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై బనాయించిన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని పార్టీ తెలంగాణ శాఖ తరపున బండి సంజయ్ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అత్యధికం... ములుగులో అత్యల్పం...

ఆమెకు ఒకేసారి 16 గోల్డ్ మెడల్స్.. ప్రభుత్వానికి స్పెషల్ రిక్వెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.