AIG Chairman Dr Nageswarareddy: 'మార్చి చివరి నాటికి ఎండమిక్​గా కరోనా రూపాంతరం'

author img

By

Published : Jan 15, 2022, 5:23 AM IST

AIG Chairman

AIG Chairman Dr Nageswarareddy: ఊపిరితిత్తులపై ఒమిక్రాన్‌ వేరియంట్ చాలా తక్కువ ప్రభావం చూపుతోందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు తెలిపారు. వేరియంట్ లక్షణాలు ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతున్నాయని వైద్యులు స్పష్టం చేశారు.

AIG Chairman Dr Nageswarareddy: ఒమిక్రాన్‌ రకం ఊపిరితిత్తులపై చాలా తక్కువ ప్రభావం చూపుతోందని, లక్షణాలు ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతున్నాయని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు స్పష్టం చేశారు. చాలామందిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయని పేర్కొన్నారు. 95 శాతం మంది 3-4 రోజులకే కోలుకుంటున్నారని, వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో భారీ స్థాయిలో జరిగిన ఉత్పరివర్తనాల వల్ల వ్యాప్తి అధికంగా ఉంటోందన్నారు. మూడో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒమిక్రాన్‌ లక్షణాలు.. చికిత్సలు తదితర విషయాలపై శుక్రవారం ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యం వెబినార్‌ నిర్వహించింది.

తక్కువ స్థాయి మరణాలు...

మూడో దశలో ఆసుపత్రిలో చేరికలు, మరణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయన్నారు. ఒమిక్రాన్‌ ఎంత వేగంగా వ్యాపిస్తోందో.. అంతే వేగంగా తగ్గిపోతోందని ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి అన్నారు. మార్చి నెల అంతానికి ఎండమిక్‌ స్థాయికి చేరి, సాధారణ దగ్గు, జలుబు లక్షణాలకే పరిమితం కావొచ్చన్నారు. అయినా, నిర్లక్ష్యం వహించక అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బూస్టర్‌ డోసుతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి స్పైక్‌ ప్రొటీన్‌ను నియంత్రిస్తుందన్నారు. వైరస్‌ సోకినా స్వల్ప లక్షణాలే కన్పిస్తాయన్నారు.

ఆ లక్షణాలు ఉంటే డెల్టా రకమే..

ఒమిక్రాన్‌లో సాధారణ జలుబు, పొడి దగ్గు, ముక్కు కారటం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కన్పిస్తున్నాయని డాక్టర్‌ శశికళ తెలిపారు. టీకా గ్రహీతల్లో టి-సెల్స్‌లోని వ్యాధి నిరోధకత కరోనా స్పైక్‌ ప్రోటీన్‌ను గుర్తించి అడ్డుకుంటోందన్నారు. తద్వారా చాలామంది రక్షణ పొందుతున్నారన్నారు. కొందరిలో 5 రోజులు దాటినా జ్వరం తగ్గకపోవడం, వాసన, రుచి పోవడం, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే మాత్రం అది డెల్టా వేరియంట్‌గానే భావించాలని డాక్టర్‌ కేతన్‌ తెలిపారు.

మనిషి నుంచి కరోనా వైరస్‌ ఎలుకలు, ఒంటె, మేక తదితర జంతువులకు చేరి ఉత్పరివర్తనం చెంది తిరిగి మనుషులకు సోకడం వల్ల ఒమిక్రాన్‌లో ఎక్కువ మ్యుటేషన్లు ఉంటున్నాయని పాథాలజీ వైద్యులు డాక్టర్‌ అనురాధ శేఖరన్‌ వివరించారు. పల్మనాలజిస్టు డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా మాట్లాడుతూ తాజాగా అందుబాటులోకి వచ్చిన పలు యాంటీ వైరల్‌ ఔషధాలు అధిక రిస్క్‌ ఉన్న రోగుల్లో ఉత్తమ ఫలితాలే ఇస్తున్నాయన్నారు. రెండు డోసుల టీకాతోపాటు బూస్టర్‌ డోసు తీసుకొని ఉంటే.. యాంటీబాడీల పరీక్ష తర్వాతే కాక్‌టెయిల్‌ వినియోగంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పలువురు ఇతర వైద్యులూ మాట్లాడారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.