రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.26 కోట్లు, జాబితాలో మూడో వంతు ఓటర్లు ఆ వయస్సు వారే

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.26 కోట్లు, జాబితాలో మూడో వంతు ఓటర్లు ఆ వయస్సు వారే
Age Wise Voter List in Telangana : రాష్ట్రం మొత్తం ఓటర్లలో రెండు దశాబ్దాలకు చెందిన ఓటర్లే.. దాదాపు సగభాగం ఉన్నారు. 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య.. ఏకంగా కోటిన్నరకు పైగా ఉంది. ఇక 20 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వారే ఓటర్ల జాబితాలో.. మూడొంతులకు పైగా ఉన్నారు. మొదటి సారి ఓటుహక్కు పొందిన యువఓటర్లు దాదాపు పది లక్షల వరకు ఉన్నారు.
Age Wise Voters List in Telangana : శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీ(TS Elections) దగ్గర పడుతోంది. ఈ నెల 30వ తేదీన ఓటర్లు తమ తీర్పును.. ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ మారు ఎన్నికల్లో మూడు కోట్లా 26 లక్షలా 2799 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అందులో పురుషులు కోటీ 62 లక్షలా 98 వేలా 418 మంది, మహిళలు కోటీ 63 లక్షలా 1705 మంది ఉన్నారు. ఇతరులు 2676 మంది ఉన్నారు.
Telangana Assembly Elections 2023 : మొదటి సారి ఓటుహక్కు వినియోగించుకోనున్న వారి సంఖ్య దాదాపు పది లక్షల వరకు ఉంది. ఓటర్ల జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 9,99,667. మొదటి సారి యువ ఓటర్లు ఎక్కువ మంది తమ ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ఇక 20 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 64 లక్షలా 36 వేలా 335గా ఉంది. రాష్ట్రంలోని ఓటర్లలో 30 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది.
మొత్తం మూడు కోట్లా 26 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా.. అందులో 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారే 92 లక్షలా 93 వేలా 393 మంది ఉన్నారు. 40 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 66 లక్షలా 96 వేలా 89గా ఉంది. ఈ రెండు వయస్సుల వారిని కలిపితే వారి సంఖ్య కోటిన్నర దాటుతుంది. మొత్తం మూడు కోట్లా 26 లక్షలకు పైగా ఓటర్లలో.. 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల సంఖ్య కోటీ 59 లక్షలా 89 482గా ఉంది.
అంటే మొత్తం ఓటర్లలో దాదాపు సగం మంది 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే ఉన్నారు. వారికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు వారిని కూడా కలిపితే ఆ సంఖ్య ఏకంగా రెండు కోట్ల 24 లక్షల 25 వేల 817గా ఉంది. అంటే మూడో వంతు ఓటర్లు 20 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారు. ఇక 50 నుంచి 59 ఏళ్ల మధ్య 45 లక్షల 66 వేల 306 మంది.. 60 నుంచి 69 ఏళ్ల మధ్య వయస్సు వారు 27 లక్షల 72 వేల 128 మంది ఉన్నారు.
70 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 13 లక్షల 98 వేల 511 గా ఉంది. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య నాలుగు లక్షల 40 వేల 371. రాష్ట్రంలో మొదటిసారి పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఏకంగా 76 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.
మొత్తం ఓటర్లు | 3,26,02,799 |
పురుషులు | 1,62,98,418 |
మహిళలు | 1,63,01,705 |
ఇతరులు | 2,676 |
వయస్సు | ఓటర్ల సంఖ్య |
18 నుంచి 19 | 9,99,667 |
20 నుంచి 29 | 64,36,335 |
30 నుంచి 39 | 92,93,393 |
40 నుంచి 49 | 66,96,089 |
50 నుంచి 59 | 45,66,306 |
60 నుంచి 69 | 27,72,128 |
70 నుంచి 79 | 13,98,511 |
80 ఏళ్లు పైన | 4,40,371 |
30 నుంచి 49 | 1,59,89,482 |
20 నుంచి 49 | 2,24,25,817 |
Highest of EVMs Use in LB Nagar : శాసనసభ ఎన్నికల్లో గరిష్ఠంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. అక్కడ 48 మంది అభ్యర్థులు పోటీలో ఉండడమే ఇందుకు కారణం. ఈవీఎంలో వినియోగించే బ్యాలెట్ యూనిట్లో గరిష్ఠంగా 16 చొప్పున అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు నోటా కూడా ఉన్నందున... ఎల్బీనగర్ లో మొత్తం నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 15, అంతకంటే తక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల సంఖ్య 54 గా ఉంది.
ఆ నియోజకవర్గాల్లో నోటా కలిపితే 16 పేర్లు బ్యాలెట్లో ఉంటాయి. అందువల్ల ఈ 54 నియోజకవర్గాల్లో ఒకే బ్యాలెట్ యూనిట్ అవసరం అవుతుంది. 16 నుంచి 31 మంది లోపు అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాలు 55 ఉన్నాయి. ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు చొప్పున బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తారు. ఇక 32 నుంచి 47 లోపు మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల సంఖ్య తొమ్మిది. ఆ నియోజకవర్గాల్లోని ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయి.
