Delhi Liquor Scam: వేడెక్కిన ఈడీ విచారణ.. ఇక నుంచి దిల్లీ కేంద్రంగా..

author img

By

Published : Sep 22, 2022, 7:32 AM IST

Delhi Liquor Scam

Delhi Liquor Scam: దిల్లీ మద్యం ముడుపుల కేసులో ఈడీ విచారణ వేడెక్కుతోంది. తనిఖీల్లో బయటపడిన వివరాల ఆధారంగా.. అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఫార్మా సంస్థకు చెందిన ప్రముఖుడితో పాటు.. రెండు సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు చెందిన సంచాలకులు, వెన్నమనేని శ్రీనివాస్‌రావును విచారించారు. సోదాల్లో రాష్ట్రానికి చెందిన ముఖ్యుల వ్యాపార లావాదేవీల వివరాలు బయటపడినట్టు తెలుస్తోంది. స్థానికంగా సోదాలు పూర్తి కావడంతో మిగతా విచారణ దిల్లీ కేంద్రంగా కొనసాగనుంది. అవసరమైన వారిని దిల్లీకి పిలిపించి విచారించాలని ఈడీ నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి.

దిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో దర్యాప్తునకు రహస్య కార్యాలయం ఏర్పాటు

Delhi Liquor Scam: దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో దర్యాప్తు జరిపేందుకు ఈడీ అధికారులు ఓ రహస్య కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. విచారణలో భాగంగా అవసరమైన వారిని రహస్య కార్యాలయానికి పిలిపించి ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యాలయానికి ప్రముఖ ఫార్మా సంస్థకు చెందిన ప్రముఖుడిని పిలిపించి రెండ్రోజులుగా విచారిస్తున్నట్టు సమాచారం. ఆయనతో పాటు రెండు సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు చెందిన భాగస్వాములను అధికారులు విచారిస్తున్నారు.

గత సోమవారం రామాంతపూర్‌, మాదాపూర్‌లోని రెండు సాఫ్ట్‌వేర్‌ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. రామాంతపూర్‌ కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రముఖ ప్రజాప్రతినిధి పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రజాప్రతినిధికి సంస్థ భాగస్వాములతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. ఆయా సంస్థల లావాదేవీలకు.. లాభాలకు పొంతన లేదని.. ఉద్యోగుల సంఖ్య కూడా అంతంత మాత్రంగానే ఉందని అధికారులు గుర్తించారు.

సంస్థలు పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహించినట్లు చూపించారని వెల్లడైంది. ఆయా సంస్థలను నిధుల మళ్లింపు కోసమే వాడుకున్నట్టు దర్యాప్తు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా సంస్థల్లోని నలుగురు డైరెక్టర్లను ఈడీ రెండ్రోజుల నుంచి ప్రశ్నిస్తోంది. మద్యం కాంట్రాక్టులు దక్కించుకోవడానికి దిల్లీ వెళ్లడానికి ఫార్మా సంస్థ ప్రముఖుడు విమానం ఏర్పాటు చేసినట్లు.. ఆ విమానంలో అనేక సార్లు ప్రయాణించినట్లు విచారణలో వెల్లడైంది.

ఏపీ ప్రభుత్వ పెద్దలతో సంబంధమున్న సదరు ప్రముఖుడిని గతంలోనూ ఈడీ అధికారులు విచారించారు. రాబిన్‌ డిస్టలరీస్‌, రాబిన్‌ డిస్టిబ్యూషన్స్‌లోకి నిధులెక్కడి నుంచి వచ్చాయని విచారణ ప్రారంభించగా.. వాటిలో సంబంధమున్న పలు సంస్థల పేర్లు బయటపడుతున్నాయి. కేవలం వ్యాపార లావాదేవీల కోసం డొల్ల సంస్థలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

నిధుల మళ్లింపు వ్యవహారం చట్ట విరుద్ధం..: మూతపడిన మరికొన్నింటిని కొనుగోలు చేసి ఎలాంటి వ్యాపారం చేయకుండానే లాభాలు వచ్చినట్లు చూపించి.. ఇతర సంస్థల్లోకి వాటిని మళ్లించినట్లు విచారణలో బయటపడిందని తెలుస్తోంది. ఈ కేసులో సంస్థలన్నింటికీ సంబంధం లేకపోయినా నిధుల మళ్లింపు వ్యవహారం చట్ట విరుద్ధమేనని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ ఆయా సంస్థలపైన చర్యలు చేపట్టనుందని సమాచారం.

దర్యాప్తు సంస్థ విచారణలో మరికొందరు ప్రముఖుల గుట్టు బయటపడినట్లు తెలుస్తోంది. గోరంట్ల అసోసియేట్స్‌లో సోదాలు జరిపినప్పుడు ఈడీకి కొందరు ప్రజాప్రతినిధుల ఆర్ధిక లావాదేవీల వివరాలు దొరికాయి. ఆయా ప్రజాప్రతినిధులకు ఈ సంస్ధ ఆడిటింగ్‌ నిర్వహిస్తోంది. వెన్నమనేని శ్రీనివాస్‌రావు విషయంలోనూ పలు వివరాలు బయటపడ్డాయి. ఇక్కడ తనిఖీలు నిర్వహించే వరకు మద్యం కేసుతో వెన్నమనేని శ్రీనివాస్‌కు సంబంధం ఉన్న సంగతి బయటకు రాలేదు. ఈ కేసు విచారణలో ఆయనే ప్రస్తుతం కీలకంగా మారారు. ఈడీ విచారణ ఇక నుంచి దిల్లీ కేంద్రంగా కొనసాగనుండగా పలువురిని దిల్లీకి పిలిపించి అక్కడే విచారించనున్నారు.
ఇవీ చదవండి: Delhi Liquor Scam: తెరపైకి మరో పేరు.. రెండ్రోజులుగా వారిపై ఈడీ ప్రశ్నల వర్షం

'భాజపాను గద్దె దించుతాం.. వారికి తలవంచే ప్రసక్తే లేదు'.. లాలూ ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.