శాసనసభ ఎన్నికలే లక్ష్యం.. భారీ బడ్జెట్​కు సర్కార్ సిద్ధం

author img

By

Published : Jan 22, 2023, 6:54 AM IST

Updated : Jan 22, 2023, 7:09 AM IST

Telangana budget meetings

Telangana budget meetings: శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ సిద్ధం కానుంది. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు పెద్దపీట వేస్తూ హామీల అమలు, ఓటు బ్యాంకు ధ్యేయంగా పద్దు ఖరారు చేయనున్నారు. బడ్జెట్‌ సమావేశాల తేదీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పద్దు రూపకల్పనకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోణంలో మరోసారి భారీ బడ్జెట్‌కు సర్కార్‌ సిద్ధమవుతోంది.

శాసనసభ ఎన్నికలే లక్ష్యం.. భారీ బడ్జెట్​కు సర్కార్ సిద్ధం

TS Budget Meetings: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల ముహూర్తం వెల్లడైంది. వచ్చే నెల 3వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల ప్రారంభం రోజే 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ దఫాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ ఇదే. దీంతో ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్కార్‌ సిద్ధమైంది.

ఎన్నికల కోణంలో మరోసారి భారీ పద్దునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం కొనసాగుతోంది. మొదటి 9 నెలల ఆదాయం, రాబడులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వచ్చేందుకు అవకాశం ఉన్న మొత్తం, తదితరాలను బేరీజు వేసుకొని రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ కసరత్తు చేయనున్నారు.

State Budget Meetings From 3rd of Next Month: 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాతో రూ. 2 లక్షల 52 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. లక్షా 26 వేల కోట్ల సొంత రాబడులు అంచనా వేయగా, డిసెంబర్ చివరి నాటికి అంచనాలకు అనుగుణంగానే ఖజానాకు సమకూరాయి. 90 వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయం వచ్చింది. మిగిలిన 3 నెలల్లోనూ ఇదే తరహాలో రాబడులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రవాణా పన్ను తదితరాల ద్వారా ఆశించిన ఆదాయం ఖజానాకు చేరుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధిరేటు బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 15 శాతానికి పైగా వృద్ధి ఉండవచ్చని భావిస్తున్నారు. పన్నేతర రాబడి కూడా 10 వేల కోట్ల మార్కును దాటింది. భూముల వేలం తదితరాలు కొనసాగుతున్న తరుణంలో పన్నేతర రాబడి ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

Telangana Budget is Prepared: కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో మాత్రం ఈ ఏడాది బాగా కోతపడింది. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులు మాత్రమే వస్తున్నాయి. గ్రాంట్లను భారీగా అంచనా వేసినప్పటికీ రాష్ట్రానికి వస్తున్నది మాత్రం చాలా తక్కువే. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ల మొత్తం దాదాపు 60 వేల కోట్లు అంచనా వేయగా డిసెంబర్ నెల వరకు వచ్చింది కేవలం 15 వేల కోట్ల లోపు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాలకు సంబంధించి కూడా కేంద్రం ఆంక్షలు విధించింది.

ఎఫ్​ఆర్బీఎమ్​కు లోబడి ఈ ఏడాది 52 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించినప్పటికీ కేంద్రం ఆ మొత్తానికి అనుమతి ఇవ్వలేదు. కేవలం 37 వేల కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులకు కూడా ఆటంకం కలిగింది. డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం లక్షా 40 వేల కోట్లకు పైగా వ్యయం చేసినట్లు సమాచారం.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ సిద్ధం: చివరి త్రైమాసికంలో వ్యయం ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ సిద్ధం చేయనున్నారు. 2023-24 బడ్జెట్‌ కోసం అన్ని శాఖలు రూ. 3 లక్షల 40 వేల కోట్ల వరకు ప్రతిపాదించినట్లు సమాచారం. శాఖల వారీగా జరిపిన కసరత్తులో ఆ మొత్తాన్ని కుదించినట్లు తెలిసింది.

ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు నెరవేర్చాల్సిన హామీలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, ఆకాంక్షల అమలు తదితరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ సిద్ధం చేయనుంది. సంక్షేమం, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు సహజంగానే కేటాయింపులు పెరగనున్నాయి. ఆయా శాఖల ప్రతిపాదనలు, ఆర్థికశాఖ కసరత్తును ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు.

ఆయా శాఖల అవసరాలు, కావాల్సిన నిధులు సంబంధిత అంశాలపై ఆర్థికమంత్రి హరీశ్​రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రస్తుత ఏడాది ఆదాయ, వ్యయాలను బేరీజు వేస్తూ వచ్చే ఏడాది రాబడులు, అవసరాలను పరిగణలోకి తీసుకున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

ప్రతిపాదనల తయారీలో పార్టీలు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు, అనుసరించాల్సిన విధానంపై కొన్ని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా కసరత్తు చేసి మళ్లీ సీఎంకు నివేదించనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వాటిని పరిశీలించి బడ్జెట్‌ పద్దును ఖరారు చేస్తారు. కేంద్ర బడ్జెట్‌ వచ్చే నెల 1వ తేదీన రానుంది. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా పెద్దగా వస్తాయన్న అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం లేదు.

ఎన్నికల కోణంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బడ్జెట్‌ సిద్ధం చేయనున్నారు. ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 3 లక్షల కోట్ల మార్కును సమీపించవచ్చని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 22, 2023, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.