Theppotsavam in Bhadradri: భద్రాద్రిలో నేడు స్వామివారి తెప్పోత్సవం.. భక్తులకు అనుమతి నిరాకరణ

author img

By

Published : Jan 12, 2022, 12:12 PM IST

Bhadradri temple

Theppotsavam in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. కరోనా ఆంక్షల కారణంగా గోదావరిలో తెప్పోత్సవం నిలిపివేస్తున్నట్లు చెప్పిన అధికారులు.. నేడు బేడా మండపం సమీపంలో నిర్వహించనున్నారు.

Theppotsavam in Bhadradri: దక్షిణ భారతదేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో శ్రీసీతారామచంద్రస్వామి వారి తెప్పోత్సవం నేడు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం నిరాడంబరంగా రామయ్యకు బేడా మండపం సమీపంలో తెప్పోత్సవ క్రతువు చేపడతామని తెలిపారు. వైకుంఠ ఏకాదశికి ముందురోజు తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ పూజారులు పేర్కొన్నారు. కరోనా ఆంక్షల కారణంగా గోదావరిలో తెప్పోత్సవం నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.

Bhadradri temple: భద్రాద్రిలోని బేడా మండపం సమీపంలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 2 గంటల పాటు తెప్పోత్సవం క్రతువు ఉంటుందని.. కోవెల ప్రాంగణంలోనే ఇనుప రేకు పాత్రలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఇనుప రేకు పాత్రల్లో హంస బొమ్మను ఉంచి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. పాత్రల్లో గోదావరి నీళ్లను నింపి హంస బొమ్మను అమర్చి క్రతువు చేపట్టనున్నారు.

భద్రాద్రిలో రేపటి నుంచి ఉత్తర ద్వార దర్శన పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రేపు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం యథావిధిగా ప్రతి ఏడాది జరిగే చోటే జరుగుతుందని ఆలయ ఈవో శివాజీ తెలిపారు. తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. భక్తులంతా రెండు ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించాలని కోరారు.

ఉత్తర ద్వార దర్శనం అనంతరం స్వామివారి తిరువీధి సేవ గుండా ఆలయం లోపలికి వెళ్లిన తర్వాత భక్తులకు దర్శనాలు కల్పిస్తామని అన్నారు. ప్రతి ఏడాది కోలాట నృత్యాలు, భక్తుల కోలాహలం మధ్య నిర్వహిస్తూ వస్తున్న ఈ వేడుకలు కరోనా కారణంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి 23 వరకు రాపత్తు ఉత్సవాలు, అనంతరం విలాస ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల 14 నుంచి నిత్య కల్యాణాలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా ఆంక్షల కారణంగా రాపత్తు ఉత్సవాలు కూడా ఆలయంలోపల నిర్వహిస్తున్నారు. కేవలం అర్చకులు, వేదపండితులు సమక్షంలోనే ఆ రెండు రోజులు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.