Peddavagu Project: పెద్దవాగుతో తెలంగాణలో ముంపు.. ఆంధ్రాలో సాగు.. ఆ ప్రాజెక్టు స్వరూపమేంటి?

author img

By

Published : Oct 12, 2021, 6:55 AM IST

Peddavagu Project

14వ తేదీ నుంచి గెజిట్‌ అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రయోగాత్మక అమలులో భాగంగా మొదట పెద్దవాగు ప్రాజెక్టు (Peddavagu project )ను బోర్డు స్వీకరించనున్నట్లు జీఆర్​ఎంబీ సమావేశంలో తేల్చారు. ఇక్కడ ఎదురయ్యే అనుభవాలను ఇతర ప్రాజెక్టుల్లో అన్వయం చేస్తామని బోర్డు తెలిపింది.

ఆనకట్ట.. నీటి ముంపు అంతా తెలంగాణ భూభాగంలో.. కాలువలు, అత్యధిక ఆయకట్టు ఆంధ్రప్రదేశ్‌లో. నీటి నిల్వ సామర్థ్యం 0.50 టీఎంసీలు. పెద్దవాగు ప్రాజెక్టు (Peddavagu project ) వివరాలివి. ఇన్నాళ్లూ రెండు రాష్ట్రాలపరిధిలో ఉన్న ఈ మధ్యతరహా ప్రాజెక్టు (Peddavagu project ) జలాశయం, ఆయకట్టు ఇకపై గోదావరి బోర్డు పర్యవేక్షణలోకి వెళ్లనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లిలో ఈ ప్రాజెక్టు (Peddavagu project ) ఉంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్భవించే పెద్దవాగు తెలంగాణలోకి ప్రవేశించి తిరిగి అదే జిల్లాలోని గోదావరిలో కలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల శాఖ 1979లో ఈ ప్రాజెక్టు (Peddavagu project )ను నిర్మించింది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఈ ప్రాజెక్టు, ఆయకట్టు ప్రాంతమంతా తెలంగాణ భూభాగంలోకి వచ్చింది. అనంతరం ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంతో ఆయకట్టు వరకు మాత్రమే ఏపీలోకి వెళ్లింది. దీంతో రెండు రాష్ట్రాల పరిధిలోని ఉమ్మడి ప్రాజెక్టు (Peddavagu project )గా మారింది. అశ్వారావుపేట మండలంలో జలాశయం కట్ట, వెనుక జలాలు ఉన్నాయి. మూడు క్రస్టు గేట్లు, రెండు తూముల ద్వారా నీటి విడుదల నిర్వహిస్తున్నారు. కట్ట కింద 2700 ఎకరాల ఆయకట్టు తెలంగాణ పరిధిలో ఉండగా, ఏపీకి చెందిన వేలేరుపాడు మండలానికి కుడి కాలువ, కుక్కునూరు మండలానికి ఎడమ కాలువ కింద నీళ్లు పారుతాయి. కాలువ పరిధిలో 13,300 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిర్వహణకు రెండు రాష్ట్రాలు బోర్డుకు ఏటా నిధులు కేటాయించనున్నాయి.

రెండు రాష్ట్రాల నుంచి నలుగురు ఇంజినీర్లు

ప్రాజెక్టు నిర్వహణకు నలుగురు ఇంజినీర్లు (ఒక్కో రాష్ట్రం నుంచి ఒక డీఈ, ఒక ఏఈ) ఉన్నారు. వీరి కింద వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, లష్కర్ల పోస్టులు ఉన్నాయి. ఈ సమాచారాన్ని రాష్ట్రాలు బోర్డుకు అందజేశాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న ఇంజినీర్లు బోర్డు పరిధిలో కొనసాగేందుకు ముందుకొస్తారా లేదా అనేది స్పష్టత లేదు. ఒకటి రెండు రోజుల్లో ఇది తేలనుంది. బోర్డుల పరిధిలో పనిచేసే ఇంజినీర్లు, సిబ్బంది సర్వీసు, పదోన్నతులు, బదిలీలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉందని నీటిపారుదల వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చూడండి: గుండి వాసులకు కష్టాలు మెండు.. వరద వచ్చిందంటే అంతే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.