సవాళ్లను ఎదిరించి.. విజేతలుగా నిలిచి..

author img

By

Published : Nov 22, 2022, 2:40 PM IST

Medals in national level athletics competitions

వీరంతా కర్షక పుత్రులు.. తమ క్రీడా జీవితంలో ఎదురైన అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు.. ప్రతికూలాలను అనుకూలంగా చేసుకున్నారు.. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్న తపన, తాపత్రయం, పట్టుదల వారిని విజేతలుగా నిలిపింది.. ఇటీవల అసోంలోని గువాహటిలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో అత్యుత్తమంగా రాణించారు.. శిక్షణ ఇచ్చిన గురువులు, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పతకాలు సాధించారు.. వర్ధమాన క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ యువ క్రీడా కిరణాల విజయగాథలను వివరిస్తూ ‘ఈటీవీ భారత్’ ప్రత్యేక కథనం.

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ క్రీడావిభాగం

గాయాలైనా పట్టుదలతో.. మరో రెండు నెలల్లో జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు ఉంటాయని మైదానంలో సాధన చేసే క్రమంలో.. ఆయనకు వెన్ను, చీలమండ నొప్పులు తీవ్రమయ్యాయి. 45 రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో వారు చెప్పిన వ్యాయామాలు చేసి ఫిట్నెస్‌ సాధించారు. కాలువల వద్ద, ఇసుకలో, పొలంలో లాంగ్‌జంప్‌లో సాధన చేశారు. పట్టుదలతో పోటీల్లో దిగి అండర్‌-18 ఏళ్ల విభాగం ట్రిపుల్‌ జంప్‌ అంశంలో పసిడి గెలిచారు. అతనే కొత్తూరి ప్రణయ్‌. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లికి చెందిన లింగయ్య-సమ్మక్క దంపతుల కుమారుడు. ఆటల్లో అభిరుచి ఉన్నా తల్లిదండ్రులు నిరాకరించారు. పీఈటీ సంతోష్‌ వారిని నచ్చజెప్పి అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. అనతి కాలంలోనే రాటుదేలి రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధించడంతో తల్లిదండ్రులు మైదానానికి వెళ్లాలని ప్రోత్సహించారు. అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబర్చడంతో హైదరాబాద్‌లో సాంఘిక సంక్షేమ అకాడమీకి ఎంపికయ్యారు. అక్కడ ద్రోణాచార్య పురస్కార గ్రహీత, శిక్షకుడు రమేష్‌ వద్ద శిక్షణ పొందుతున్నారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటున్నారు.

జాతీయస్థాయిలో 10 పతకాలు

ప్రతికూలతలను అనుకూలంగా చేసుకొని.. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో రెండు పసిడి పతకాలు సాధించిన ఆయనకు ఒక్కసారిగా అనివార్య కారణాలతో హాస్టల్‌ మూసివేయడంతో ఇంటికి పరిమితమయ్యారు. సాధన ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి. చేతిలో డబ్బులు లేవు. జాతీయస్థాయి పోటీలు దగ్గర పడుతున్నాయి. గతంలో శిక్షణ ఇచ్చిన గురువులకు ఫోన్లు చేసి మరీ సాధన చేశారు. ఎన్ని ప్రతికూలాలు ఎదురైనా వాటిని అనుకూలంగా చేసుకున్నారు. గువాహటిలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని అండర్‌-16 ఏళ్ల విభాగం ఆరు క్రీడల సమూహం హెక్సాథ్లన్‌(100, 1000మీ.ల పరుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్ పుట్ త్రో, జావెలిన్‌ త్రో) క్రీడాంశంలో కాంస్యం సాధించారు. ఆయన పేరే దుర్గం రాజ్‌కుమార్‌. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బొమ్మెన గ్రామానికి చెందిన లింగయ్య-శంకరమ్మ దంపతుల కుమారుడు. జైపూర్‌లో గురుకులంలో చదువుతున్నారు. అథ్లెటిక్స్‌ రంగంలో అత్యుత్తమంగా రాణించడంతో హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమ అకాడమీకి ఎంపికయ్యారు. దేశం తరపున అథ్లెటిక్స్‌లో పాల్గొనడమే ధ్యేయంగా సాధన చేస్తున్నానంటున్నారు.

జాతీయస్థాయిలో ఒక కాంస్యం

పొలంలో సాధన.. ప్రతి పోటీల్లో పతకాలు సాధిస్తున్న ఆమెకు కరోనా ఒక్కసారిగా శూన్యంలోకి నెట్టేసింది. క్రీడా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రతికూలాంశాలకు ధైర్యంగా ఎదుర్కొన్నారు. తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్లారు. అక్కడే సాధన చేశారు. కరోనా ఉద్ధృతి తగ్గాక ఒక్కొక్కటిగా క్రీడా ప్రాంగణాలు తెరచుకోవడంతో మైదానంలో తీవ్రంగా శ్రమించారు. ఫిట్నెస్‌ సాధించి మళ్లీ బరిలోకి దిగారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాల పంట పండించారు. ఆమే నమయి రుచిత. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌కు చెందిన ముత్యం-నర్సమ్మ దంపతుల కుమార్తె. క్రీడల్లో అభిరుచి ఉండటంతో హకీంపేట క్రీడా పాఠశాలకు ఎంపికయ్యారు. అక్కడ 5 నుంచి 9 తరగతి వరకు చదువుకున్నారు. కోచ్‌ బోస్‌ పర్యవేక్షణలో మంచి అథ్లెట్ గా పేరొందారు. బెంగుళూరులోని సాయ్‌(భారత క్రీడా సంస్థ) అకాడమీకి ఎంపికయ్యారు. అథ్లెటిక్స్‌ శిక్షకుడు రాబర్ట్‌ బాబీజాజ్‌ వద్ద శిక్షణ పొందుతున్నారు. తాజాగా గువాహటిలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అండర్‌-20 ఏళ్ల విభాగం 100మీ.ల హర్డిల్స్‌ పరుగు పోటీల్లో పసిడి పతకం సాధించారు. ప్రభుత్వం, స్పాన్సర్లు సహకరిస్తే అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతానంటున్నారు.

జాతీయస్థాయిలో 6 పతకాలు

భుజానికి శస్త్రచికిత్స అయినా పతకం సాధించి... మరో ఆరు నెలల్లో జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలు ప్రారంభమవుతాయి. దీంతో ఆయన పరుగు సాధన కోసం మైదానంలో దిగారు. పరుగెత్తేటప్పుడు ఆయన కుడి భుజానికి గాయమైంది. వారం వ్యవధిలో పదిసార్లు భుజం స్థానభ్రంశం(షోల్డర్‌ డిస్‌లోకెట్) అయింది. వైద్యుల సూచనతో శస్త్రచికిత్స చేసుకున్నారు. ఆరు నెలలు పూర్తి విశ్రాంతి అవసరమన్నారు. దీంతో ఆయన శిక్షకుడు రవీందర్‌ పర్యవేక్షణలో ఫిట్నెస్‌ సాధించేందుకు భుజం దృఢత్వానికి సంబంధించిన వ్యాయామాలు చేశారు. భుజానికి ఐసింగ్‌, హీటింగ్‌ చేసుకున్నారు. కేవలం మూడు నెలల్లోనే భుజం నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందారు. గువాహటిలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో అండర్‌-16 ఏళ్ల విభాగం మెడ్లే రిలే(100, 200, 300, 400మీ.ల పరుగు)లో పాల్గొన్నారు. కాంస్యం సాధించారు. ఆయనే ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాల పూర్వ విద్యార్థి ముదావత్‌ గణేష్‌. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన సేవ-బుజ్జి దంపతుల కుమారుడు. ప్రస్తుతం ఈయన ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రిషియన్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. అంతర్జాతీయ పోటీల్లో ఆడటమే లక్ష్యమని చెబుతున్నారు.

జాతీయస్థాయిలో ఒక కాంస్యం

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.