పేదరికంపై 'క్రీడా'యుధం.. కష్టానికి ప్రతిఫలం!

author img

By

Published : Aug 10, 2021, 6:01 PM IST

athletes

సమాజంలో పేదరికం, అసమానతలు తొలగించేందుకు క్రీడలు ఓ ఆయుధంగా నిలుస్తాయని నాడు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్​ మండేలా చేసిన వ్యాఖ్యలు.. టోక్యో ఒలింపిక్స్​ వేదికగా భారత క్రీడాకారులు మరోమారు నిజం చేసి చూపించారు. కఠిక పేదరికంలోనూ పట్టువదలకుండా, కష్టాన్నే నమ్ముకుని ముందుకు సాగిన క్రీడాకారులు.. ఒలింపిక్స్​లో సత్తా చాటి భారత కీర్తిని మరోస్థాయికి తీసుకెళ్లారు.

"ప్రపంచాన్ని మార్చే సామర్థ్యం క్రీడలకు ఉంది. స్ఫూర్తినిచ్చే శక్తి క్రీడలకు ఉంది. ప్రజలను ఒక్కటి చేసే సత్తా క్రీడలకు ఉంది. నిరాశతో కొట్టుమిట్టాడుతున్న జీవితాల్లో వెలుగు నింపే సత్తా క్రీడలకు ఉంది. అసమానతలు తొలగించేందుకు క్రీడలు ఉపయోగపడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పేదరికాన్ని జయించేందుకు, అభివృద్ధి సాధించేందుకు క్రీడలు ఓ ఆయుధంగా పనికొస్తాయి"

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, దాతృత్వవేత్త నెల్సన్​ మండేలా గతంలో చేసిన వ్యాఖ్యలు ఇవి. తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్​తో ఈ వ్యాఖ్యలు మరోమారు నిజమని రుజువైంది. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, నమ్మకంతో అహర్నిశలు శ్రమించి క్రీడల్లో సత్తా చాటి ఎందరో అథ్లెట్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవే క్రీడలు ఇప్పుడు వారి జీవితాలను మార్చేశాయి. పేదరికం నుంచి బయటపడొచ్చనే విశ్వాసాన్ని వారిలో నింపాయి.

'క్రీడా'శక్తి..

చదువు తప్ప మరేం చేసినా జీవితంలో ఓటమి తప్పదని ఎందరో తల్లిదండ్రులు పిల్లలను హెచ్చరిస్తుంటారు. చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే చాలు జీవితంలో స్థిరపడిపోయినట్టే అనుకుంటారు. ఈ క్రమంలో పిల్లలు ఆటలవైపు చూస్తే చాలు కన్నెర్ర చేస్తారు. చివాట్లు పెడుతుంటారు. ఇలా ఎందరో చిన్నారుల కలలను తల్లిదండ్రులు ప్రారంభ దశలోనే చిదిమేస్తారు.

ఇక పేదలైతే క్రీడలకే కాదు.. చదువుకు కూడా ఆమడ దూరంలో ఉంటారు. కూలీ పనితో జీవితం సాగిస్తూ, "రెండు పూటలా వేళ్లు నోట్లోకి వెళితే చాలు దేవుడా" అనుకుంటారు. కానీ అందరి జీవితాలను మార్చే సత్తా ఆటలకు ఉంది. 'కష్టపడితే.. విజయం వరిస్తుంది' అని నిరూపించారు అనేకమంది అథ్లెట్లు. వీరిలో ప్రస్తుత భారత మహిళల హాకీ జట్టు ఒకటి!

athletes
మహిళల హాకీ జట్టు

టోక్యో ఒలింపిక్స్​లో అద్భుత ప్రదర్శనతో దేశ ప్రజల చూపును తమవైపు తిప్పుకున్నారు మహిళల హాకీ జట్టు సభ్యులు. కనీసం కాంస్యం కూడా తీసుకురాలేకపోయినప్పటికీ, ఈ ఒలింపిక్స్​లో మహిళలు చేసిన ప్రదర్శన విలువేంటో అందరికీ తెలుసు. హాకీకి దేశంలో పూర్వవైభవం వస్తుందనే నమ్మకం కలిగించారు. దీంతో ఇప్పుడు వీరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కానీ వీరి జీవితాల గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. వీరిలో చాలా మంది ఇంతకాలం పేదరికంతో అలమటించిన వారే! కొందరు దాదాపు గుడిసెల్లాంటి ఇళ్లల్లో ఉండేవారు. టీవీలు కాదు కదా.. కనీసం విద్యుత్​ కనెక్షన్లు కూడా సరిగ్గా లేవు.

మిడ్​ఫీల్డర్​ సలీమా టెటె ఇందుకు ఉదాహరణ. ఝార్ఖండ్​లోని ఓ కుగ్రామంలో పుట్టిన సలీమాకు.. సరైన హాకీ స్టిక్స్​ లేక చెక్క కర్రలతో హాకీ ప్రాక్టీస్​ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆమె గ్రామంలో ఒక్కటే టీవీ ఉండేది. అది కూడా సరిగ్గా పనిచేసేది కాదు. ఈ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం హేమంత్​ సొరేన్​.. సలీమా నివాసంలో స్మార్ట్​ టీవీ ఏర్పాటు చేయించారని వార్తలు వచ్చాయి.

athletes
సలీమా టేటే
athletes
సలీమా నివాసం

ఇలా ఎందరో క్రీడాకారిణులు కనీస వసతులకు చాలా దూరంలో జీవిస్తున్నారు. కానీ వారి మనోధైర్యం ముందు పేదరికం నిలవలేదు. ఆటపై వారికున్న అంకితభావం ముందు ఆ పేదరికం కూడా తలవంచక తప్పలేదు. టోక్యో ప్రదర్శన అనంతరం హాకీ మహిళల జట్టుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నజరానా ప్రకటించాయి. ఇవి రూ. లక్షల్లో ఉంటున్నాయి. ఇవేకాకుండా.. మరికొందరు ముందుకొచ్చి బహుమతులు కూడా ఇస్తున్నారు.

మణిపూస చాను

అటు టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పతకాన్ని అందించిన వెయిట్​లిఫ్టర్​, మణిపుర్​ వాసి మీరాబాయి చానుది కూడా ఇదే కథ. సరైన వసతులు లేక శిక్షణా కేంద్రాలకు వెళ్లాలంటే లారీ డ్రైవర్ల సహాయం తీసుకోవాల్సి వచ్చేది. అదే మీరాబాయి చాను.. ఇప్పుడు ఒలింపిక్స్​లో మువ్వన్నెల జెండాకు కీర్తి తెచ్చిపెట్టింది. ఆ లారీ డ్రైవర్లను సత్కరించే స్థాయికి ఎదిగింది.

భారత బాక్సింగ్​ దిగ్గజం మేరీకోమ్​ కథ కూడా ఇంతే. వసతుల లేని స్థాయి నుంచి ఖరీదైన కార్లలో ప్రయాణించే స్థాయికి అంచెలంచెలుగా మేరీకోమ్​ ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం.

చదువు ఒక్కటే కాదు.. ఆటలు కూడా పాఠాలు నేర్పిస్తాయి. వాస్తవానికి వ్యవస్థల్లో లేని విధంగా, జీవితాలను దగ్గరగా ఈ పాఠాలు ఉంటాయి. జీవితానికి కావాల్సిన నైపుణ్యాలను అందిస్తాయి. నెల్సన్​ మండేలా నమ్మింది, ప్రోత్సహించింది కూడా ఇదే.

పేదరికం నుంచి బయటపడేందుకు ప్రజలు ఎన్నో చెడు మార్గాలను ఎంచుకుంటున్న రోజులు ఇవి. కానీ క్రీడలపై మక్కువ పెంచుకుంటే.. వారికి అసలు అలాంటి ఆలోచనలే రావు. ఆటలతో ప్రేమలో పడితే.. తెలియకుండానే సమయం గడిచిపోతుంది. అదే కష్టంతో ముందుకు సాగితే జీవితం మారిపోతుంది. ఇది పేదలకే కాదు.. మొత్తం దేశానికే ప్రయోజనం చేకూరుస్తుంది. మట్టిలో మాణిక్యాలు ఉద్భవించి.. దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిచెబుతారు.

ఇదీ చూడండి:- పతకాలు కావాలంటే పద్ధతి మారాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.