Mary kom: అతడిని చూసేందుకు క్యూలో నిలబడేదాన్ని

author img

By

Published : Jun 10, 2021, 6:27 PM IST

Mary kom

ఆసియా గేమ్స్​ స్వర్ణ పతక విజేత, భారత మాజీ బాక్సర్​ డింకో సింగ్(Dingko Singh) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.

భారత బాక్సింగ్‌ ఛాంపియన్‌, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత డింకో సింగ్‌(Dingko Singh) గురువారం కన్నుమూశారు. కొంత కాలంగా లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈరోజు ఇంఫాల్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. భారత్‌లో బాక్సింగ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన డింకో సింగ్‌ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆరుసార్లు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన మేరీకోమ్‌(marykom) లాంటి దిగ్గజానికి కూడా ఆయనే స్ఫూర్తి నింపడం విశేషం. ఆయన మృతి పట్ల మేరీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

"డింకో ఒక రాక్‌స్టార్‌, ఒక దిగ్గజం. మణిపూర్‌లో అతను బరిలోకి దిగి ప్రత్యర్థులను చిత్తుచేసే సమయంలో నేను క్యూలో నిలబడి చూసేదాన్ని. అతనే నా స్ఫూర్తి ప్రదాత. నా హీరో. అతని మరణం తీరనిలోటు. చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. జీవితం అస్సలు ఊహించలేనిది."

-మేరీకోమ్‌

"మనమో బాక్సింగ్‌ దిగ్గజాన్ని కోల్పోయాం"

- వికాస్ కృష్ణ (ఒలింపిక్స్‌ పోటీదారుడు)

"భారత బాక్సింగ్‌లో డింకోసింగ్‌ లేనిలోటు పూడ్చలేనిది. కొన్ని తరాల బాక్సర్లకు ఆయనో స్ఫూర్తిప్రదాత. భవిష్యత్‌ తరాలకు అతని చరిత్ర ఇలాగే కొనసాగుతుంది. ఇలాంటి కష్టసమయంలో బాక్సింగ్ బృందం మొత్తం డింకో కుటుంబసభ్యులకు అండగా నిలుస్తుంది."

-అజయ్‌ సింగ్‌ (భారత బాక్సింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు)

"డింకోసింగ్‌ మరణం పట్ల తీవ్రంగా కలతచెందాను. భారత్‌ తీర్చిదిద్దిన మేటి బాక్సర్లలో ఆయనొకరు. 1998 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో అతను సాధించిన స్వర్ణ పతకం భారత్‌లో కొత్త ఊపిరిపోసింది."

-కిరణ్‌ రిజిజు (కేంద్ర క్రీడల శాఖా మంత్రి)

"బాక్సింగ్‌ రింగ్‌లో అతనో ప్రత్యేకమైన వ్యక్తి. ఎంతో నైపుణ్యం ఉన్న బాక్సర్‌. కానీ ఉన్నత శిఖరాలకు చేరకపోవడం దురదృష్టకరం."

-జి. సంధు (జాతీయ మాజీ కోచ్‌)

"ఆయన జీవన ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు భావితరాలకు ఒక పాఠంలా నిలిచిపోతాయి."

- విజేందర్‌ సింగ్‌ (బాక్సింగ్‌లో భారత తొలి ఒలింపిక్స్‌ పతక విజేత)

ఇదీ చూడండి: ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.