ఒలింపిక్‌ విజేతలతో ర్యాపిడ్‌ ఫైర్‌.. ఎవరేం చెప్పారంటే?

author img

By

Published : Aug 14, 2021, 8:40 AM IST

Tokyo Olympics

హాకీలోకి రాకపోయి ఉంటే ట్రక్​ డ్రైవర్​ అయ్యేవాడట భారత హాకీ జట్టు సారథి మన్​ప్రీత్ సింగ్. దేశానికి ఒలింపిక్స్​ పతకం సాధించి పెట్టిన ఈ స్టార్​.. అలా ఎందుకన్నాడో ఓ లుక్కేయండి. అలాగే పసిడి విజేత నీరజ్ చోప్డా ఇష్టంగా తినే ఆహారం ఏంటో కూడా చూసేయండి.

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌త్రో విభాగంలో స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్డా, బాక్సింగ్‌లో కాంస్యం సాధించిన లవ్లీనా బొర్గొహెన్‌, కాంస్యాన్ని అందించిన భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌.. ఈ ముగ్గురూ తమ ఆటలతో దేశానికి కీర్తి తీసుకురావడమే కాదు.. అందరిలోనూ స్ఫూర్తి నింపారు కూడా. ఇప్పటి వరకూ వారు ఆటలు కాకుండా శుక్రవారం క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మరో ఆటను వారికి నిర్వహించారు. అదే ర్యాపిడ్ ఫైర్‌ రౌండ్‌. దీంట్లో ఛాయిస్‌ ఏమీ ఉండదు. కేవలం ఒక్కమాటలోనే జవాబు చెప్పాల్సి ఉంటుంది. మరి ఆ ఆటను వీరు ఎలా ఆడారో.. ఎలాంటి ఫన్నీ సమాధానాలు ఇచ్చారో చూడండి..

Tokyo Olympics
మన్‌ప్రీత్‌ సింగ్‌
  • ప్రశ్న: మీరు ఇష్టంగా తినే ఆహారం ఏమిటి?

మన్‌ప్రీత్‌: బటర్‌ చికెన్‌ కచ్చితంగా (నవ్వుతూ)

లవ్లీనా: పంది మాంసం (పోర్క్‌) అంటే చాలా ఇష్టం.

నీరజ్‌: పండ్లు ఎక్కువగా తీసుకుంటా ఎందుకంటే అవి ఎలాంటి హానీ కల్గించవు.

  • మిమల్ని బాగా భయపెట్టే విషయం?

మన్‌ప్రీత్‌: అమ్మతో అబద్ధం చెప్పాలంటే చాలా భయం. ఇంతపెద్ద అయినా సరే ఎక్కడ కొడుతుందో అని (నవ్వుతూ)

Tokyo Olympics
లవ్లీనా బొర్గొహెన్‌

లవ్లీనా: ఎత్తైన ప్రదేశాలంటే భయం. అయినా సరే అక్కడికి వెళ్లి కిందకి చూడాలనుకుంటా.

నీరజ్‌: ఏమో తెలీదండి. మైండ్‌లో అలాంటి ఆలోచలేమీ రావట్లేదు.

  • ఒలింపిక్స్‌లో పతకం సాధించారని తెలియగానే ఎవరు మీకు మొదట ఫోన్‌ చేశారు?

మన్‌ప్రీత్‌: కాంస్య పతకం గెలిచామని తెలిసిన క్షణం ఒక్కసారిగా మైండ్‌ బ్లాంక్ అయ్యింది. అమ్మ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. అప్పుడు ఆమె నుంచి ఒక్కమాటా లేదు. ఆనందంతో ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో నేను పతకం సాధించాలనేది మా నాన్నగారి కల. నేను విజయం సాధించే సరికి ఆయన ఈ ప్రపంచంలో లేరు.

లవ్లీనా: ఇంటి నుంచి నాకు మొదటి కాల్‌ వచ్చింది. అమ్మానాన్న మాట్లాడారు.

Tokyo Olympics
నీరజ్‌ చోప్డా

నీరజ్‌: అందరికన్నా ముందు జయవీర్‌ చౌదరి, నా సీనియర్‌ ఫోన్‌ చేశారు.

  • క్రీడాకారులు కాకుంటే ఏమయ్యేవారు?

లవ్లీనా: దీనికి నా దగ్గర ఎలాంటి జవాబూ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలలు కనడానికి స్థాయిలేదు అనుకునేదాన్ని. ఎప్పుడైతే బాక్సింగ్‌ నా ప్రపంచం అయ్యిందో ఇందులోనే కలల కన్నా. దాన్నే నెరవేర్చుకోవాలనుకున్నా.

మన్‌ప్రీత్‌: (నవ్వుతూ) డ్రైవర్‌ అయ్యేవాడిని. దుబాయ్‌, కెనడాకు వెళ్లినా టాక్సీ నడిపి బతకొచ్చు కదా!

ఇదీ చూడండి: మెస్సీ కోసం ఒక్కరాత్రి ఖర్చు రూ.14 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.