Exclusive: '15 నెలలుగా పడ్డ కష్టానికి ఫలితమే ఈ కాంస్యం'

author img

By

Published : Aug 11, 2021, 5:30 AM IST

manpreeth singh

ఒలింపిక్స్​లో పతకం సాధించడంపై పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్​ప్రీత్ సింగ్ ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడాడు. గత 15 నెలల కష్టానికి ప్రతిఫలం ఇది అని అన్నాడు.

బెంగళూరులోని శిక్షణ శిబిరంలో గత 15 నెలలుగా తాము చాలా కష్టపడ్డామని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్​ప్రీత్​ సింగ్ చెప్పాడు. ఈ సమయంలో కుటుంబ సభ్యులను కూడా కలుసుకోలేదని తెలిపాడు. జట్టుగా తామంత పడ్డ కష్టానికి ప్రతిఫలం ఒలింపిక్స్​లో కాంస్య పతకమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో పలు విషయాలను పంచుకున్నాడు.

ఈటీవీ భారత్​తో మన్​ప్రీత్​ సింగ్

సుదీర్ఘ కాలం తర్వాత ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టుకు పతకం వచ్చిందని మన్​ప్రీత్​ తెలిపాడు. టోక్యో నుంచి స్వదేశానికి వచ్చినప్పుడు దిల్లీలో తమకు ఘన స్వాగతం లభించిందని.. ఇది తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు.

సెమీస్​లో ఓటమి అనంతరం తమకు ప్రధాని మోదీ ఫోన్​ చేశారని మన్​ప్రీత్​ గుర్తుచేసుకున్నాడు. "జట్టులోని ఆటగాళ్లందరితో పీఎం మాట్లాడారు. దేశం మొత్తం తమతో ఉందని ధైర్యం చెప్పారు. తదుపరి మ్యాచ్​ గురించి ఆందోళన చెందొద్దని.. కాంస్య పతక పోరు కోసం సరిగా సన్నద్ధం కావాలని సూచించారు. మ్యాచ్​లో గెలుపొందాక మరోసారి ప్రధాని ఫోన్​ చేశారు. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తోందని అన్నారు" అని మన్​ప్రీత్​ పేర్కొన్నాడు.

జర్మనీతో జరిగిన కాంస్య పతక మ్యాచ్​లో తమ శక్తి మేరకు రాణించామని మన్​ప్రీత్​ వెల్లడించాడు. 60 నిమిషాల ఆటను జట్టు మొత్తం ప్రాణం పెట్టి ఆడిందని తెలిపాడు. 'ఎందుకంటే ఇది పతక పోరు. ఒలింపిక్స్​లో చరిత్ర సృష్టిస్తామని తెలుసు. ఈసారి భారత్​ అత్యధికంగా ఏడు పతకాలు గెలుచుకుంది. దీంతో అభిమానులు ఇతర ఆటలకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు' అని హాకీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.

భవిష్యత్​లో హాకీలో రాణించాలనుకునే వారికి మీరిచ్చే సందేశమేంటని అడగ్గా.. 'హాకీలో రాణించాలంటే ఎల్లప్పుడూ కష్టపడాలి. ప్రత్యేకంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఎందుకంటే ఒక లక్ష్యం కోసం పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరూ విజయవంతమవుతారని' మన్​ప్రీత్ తెలిపాడు.

కాంస్య పతక పోరులో జర్మనీపై 5-4తో గెలుపొందిన భారత్​.. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఒలింపిక్స్​ హకీలో పతకం సాధించింది.

ఇదీ చదవండి: MS Dhoni: చెపాక్‌ చేరిన సీఎస్కే సింహం.. ప్రాక్టీస్​ కోసమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.