ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్​గా కోహ్లీ.. మూడో బౌలర్​గా రబాడ

author img

By

Published : May 14, 2022, 10:06 AM IST

IPL Kohli 6500 runs

ఐపీఎల్​ 2022లో భాగంగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో కోహ్లీ, కగిసో రబాడ ఓ రికార్డు సాధించారు. ఆ వివరాలు..

IPL Kohli 6500 runs: ఆర్సీబీ మాజీ సారథి కోహ్లీ భారత టీ20 లీగ్‌లో అరుదైన ఘనత సాధించాడు. గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్పీత్‌బ్రార్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే సింగిల్‌ తీసిన అతడు.. ఈ టీ20 లీగ్‌లో 6500 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. దీంతో ఈ రికార్డు నెలకొల్పిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో ఫామ్‌ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న అతడు ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 20 పరుగులు చేసిన కోహ్లీ 3.2 ఓవర్‌కు రబాడ బౌలింగ్‌లో రాహుల్‌ చాహర్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో అతడి నుంచి మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.

ఇక విరాట్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 13 మ్యాచ్‌లు ఆడగా 19.67 సగటుతో 236 పరుగులే చేశాడు. ఈ లీగ్‌ మొత్తంలో చూస్తే 220 మ్యాచ్‌ల్లో 16.22 సగటుతో 6,519 పరుగులు చేసి అందరికన్నా ముందున్నాడు. అందులో ఐదు సెంచరీలు, 43 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. తర్వాత శిఖర్‌ ధావన్‌ 204 మ్యాచ్‌ల్లో 35.15 సగటుతో 6,186 పరుగులు చేశాడు. వీరిద్దరే ప్రస్తుతం 6 వేల పరుగులకుపైగా కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో డేవిడ్‌ వార్నర్‌ (5,876), రోహిత్‌ శర్మ (5,829), సురేశ్‌ రైనా (5,528) నిలిచారు.

Rabada 200 wickets: ఇక ఈ మ్యాచ్​ ద్వారా పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ కగిసో రబాడ.. టీ20 క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. హర్షల్‌ పటేల్‌ను ఔట్‌ చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్‌లో 200వ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్‌ సాధించిన మూడో బౌలర్‌గా రబాడ నిలిచాడు. రబాడ 146 మ్యాచ్‌ల్లో 200 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.రబాడ కన్నా ముందు రషీద్‌ ఖాన్‌ 134 మ్యాచ్‌ల్లోనే 200 వికెట్ల మార్క్‌ను అందుకొని అగ్ర స్థానంలో ఉండగా.. పాక్‌ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌(139 మ్యాచులు) ఉమర్‌ గుల్‌(147 మ్యాచ్‌లు), లసిత్‌ మలింగ(149 మ్యాచ్‌లు) రెండు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవం చేసుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ అదరగొట్టింది. ఓపెనర్‌గా బెయిర్‌ స్టో (66), లివింగ్‌స్టోన్‌(42) చెలరేగడం వల్ల పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. పంజాబ్‌ బౌలర్ల ధాటికి 155 పరుగులకే పరమితమైంది. మ్యాక్స్‌వెల్‌ (35) టాప్​ స్కోరర్​. రాజత్‌ పాటిదార్‌ (26), విరాట్ కోహ్లీ (20) ఫర్వాలేదనిపించారు. డుప్లెసిస్‌ 10, లామ్రోర్ 6, దినేశ్‌ కార్తిక్ 11, షాహ్‌బాజ్‌ 9, హర్షల్‌ పటేల్ 11* పరుగులు చేశారు. ఈ విజయంతో పంజాబ్‌ కింగ్స్‌ 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు.. ఆరు ఓటములతో దిల్లీ క్యాపిటల్స్‌తో సమానంగా ఉంది. మరోవైపు ఆర్‌సీబీ మాత్రం 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు.. ఆరు పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: ఇంకొక్క అడుగు వేస్తే.. స్వర్ణం మనదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.