'త్వరలోనే టెస్టుల్లోకి.. విరాట్‌ సూపర్​ ఫిట్​​.. అతడితో ఆట అదుర్స్​!'

author img

By

Published : Nov 21, 2022, 11:35 AM IST

Surya Kumar Yadav

మిస్టర్​ 360 ఆటగాడు సూర్యకుమార్​ యాదవ్​ తన విభిన్నమైన షాట్లతో న్యూజిలాండ్​పై అదరగొట్టేశాడు. శతకం సాధించి భారత్​ భారీ స్కోర్​ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా టెస్టు క్రికెట్‌ అరంగేట్రంపై సూర్య స్పందించాడు. దాంతోపాటు తన ఆట తీరు గురించి వివరించాడు. అవి అతడి మాటల్లోనే..

Surya Kumar Yadav: మిస్టర్‌ 360 త్వరలో భారత టెస్టు జట్టులో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం న్యూజిలాండ్‌పై 'గాడ్‌మోడ్‌'లో ఆడిన 111 పరుగుల ఇన్నింగ్స్‌ అనంతరం అతడు అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రంపై స్పందించాడు. ''కెరీర్‌ ఆరంభించిందే ఎర్రబంతి క్రికెట్‌ (టెస్టులు)తో. నా ముంబయి జట్టు కోసం ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాను. టెస్టు క్రికెట్‌పై నాకు మంచి అవగాహన ఉంది. ఆ ఫార్మాట్‌ ఆడటాన్ని నేను ఎంజాయ్‌ చేస్తాను. త్వరలోనే టీమ్‌ ఇండియా టెస్టు క్రికెట్‌ క్యాప్‌ను అందుకొంటానని ఆశిస్తున్నాను'' అని సూర్యకుమార్‌ తన మనసులోని మాట చెప్పాడు.

గతాన్ని గుర్తుంచుకొంటాను..
బాగా ఆడిన సమయంలో కూడా టీమ్‌ ఇండియా నుంచి పిలుపు రాకపోవడంతో నిరాశకు గురైన సందర్భాలను తాను మర్చిపోనని సూర్యకుమార్‌ వెల్లడించాడు. '' నా గతాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునే ముందుకెళ్తాను. నేను ఒక్కడినే ఉన్నా.. నా భార్యతో ప్రయాణిస్తున్నా.. రెండు మూడేళ్ల క్రితం పరిస్థితి ఏంటి.. ప్రస్తుత పరిస్థతి ఏమిటని చర్చించుకుంటాం. అప్పటికీ ఇప్పటికీ ఏం మారిందో మాట్లాడుకుంటాం. అప్పట్లో కొంత నిరాశ ఉండేది. కానీ, దానిలో కూడా ఏదో ఒక ఆశాకిరణం వెతికే వాళ్లం. మరింత మెరుగైన క్రికెటర్‌గా ఎలా మారగలను అని ఆలోచించేవాణ్ని. ఆ తర్వాత కొంత భిన్నంగా ప్రయత్నించాను. సరైన ఆహారం, నాణ్యమైన సాధన, మంచి నిద్ర వంటివి వాటిల్లో ఉన్నాయి. ఆ ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాను. బాగా ఆడినా.. ఆడకపోయినా.. నేను మ్యాచ్‌ పూర్తయ్యాక.. హైలైట్స్‌ చూస్తాను. ఆ సమయంలో కొన్ని సార్లు నా షాట్లను చూసి నేనే ఆశ్చర్యపోతాను''

అతిగా ఆలోచించను..
''మ్యాచ్‌ను మించి నేను ఆలోచించను. ఒక వేళ ఆటకు అవసరమైనదాని కంటే.. బౌలర్ల కంటే ఎక్కువగా ఆలోచిస్తే.. ప్లానింగ్‌ తప్పుదారి పడుతుంది. అందుకే వాస్తవిక పరిస్థితుల్లోనే ఉంటాను. అతిగా ఆలోచించను. బాగా ఆడిన సమయంలో అనుసరించిన రోజువారీ విధానాలను, సాధనను ఎప్పుడూ కొనసాగించాలని నేను అనుకుంటాను. 99శాతం అదే చేయడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణకు నేను జిమ్‌ చేస్తాను. సరైన సమయానికి భోజనం ముగిస్తాను. 15-20 నిమిషాలు కునుకు తీస్తాను. ఇవి చిన్న చిన్న విషయాలే. కానీ, మ్యాచ్‌ ఉన్న రోజుల్లో కూడా నేను ఇవే చేయడానికి యత్నిస్తాను. మైదానంలోకి వచ్చేటప్పటికి ఉత్సాహంగా ఉంటాను''

ఆఫ్‌డేస్‌లో కుటుంబంతోనే..
''నేను మ్యాచ్‌లు లేని రోజుల్లో చాలా సమయం కుటుంబంతోనే గడుపుతాను. ఆ సమయంలో వారు ఎప్పుడూ ఆట గురించి నాతో మాట్లాడరు. అది నన్ను సాధారణంగా ఉండేలా చేస్తుంది. అది చాలా ముఖ్యం. దీంతో చాలా సమయం సౌకర్యవంతమైన పరిస్థితుల్లో ఉండగలుగుతాను'' అని సూర్యకుమార్‌ వివరించాడు.

విరాట్‌ ట్విట్టర్లో 'వీడియో గేమ్‌' ఇన్నింగ్స్‌ కామెంట్‌పై..
''ఇటీవల కాలంలో మేమిద్దరం కలిసి కొన్ని గేమ్స్‌ ఆడాం. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. నేను కోహ్లీతో కలిసి బ్యాటింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తాను. ఎందుకంటే అతడు సూపర్‌ ఫిట్‌. కానీ, మేము కలిసి ఉన్న రోజుల్లో గేమ్‌ గురించి ఎక్కువగా మాట్లాడుకోం. ఎందుకంటే..? మేము పరస్పరం ఒకరి ఆటతీరును మరొకరు గౌరవించుకొంటాం. కలిసి ఆడే సమయంలో.. నేను విరాట్‌కు ఒక్కటే చెబుతాను.. 'నువ్వు ఒక వైపు ఆడు.. నేను మరో వైపు ఆడతాను'.. విరాట్‌ కూడా ఎక్కువగా ఏమీ చెప్పడు. నీదైన శైలిలో బ్యాట్‌ను ఝుళిపించి ఎంజాయ్‌ చెయ్యి అంటాడు''

కీవ్‌ బౌలర్లను దంచి కొట్టడంపై..
''మైదానంలో ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్ల ఆధారంగా స్ట్రోక్స్‌ను ఆడాను. మీరు ఎక్కడ ఆడుతున్నారు అన్నదానితో సంబంధం లేకుండా ఫార్మాట్‌ ప్రకారం ఆడాలి. మీ మెదడులో ఆటకు సంబంధించి ఓ ప్రణాళిక ఉండాలి. పిచ్‌ ఎలా ఉంది. మైదానం కొలతలు ఏమిటీ, బంతి ఎలా కదులుతోంది.. వంటివి మీ మెదడులో ఉండాలి. మిగిలిన పని మొత్తం వీటి ఆధారంగా ప్రాక్టిస్‌ సెషన్‌లో, మీరు మీ రూమ్‌లో ఉన్నప్పుడు చేయాలి. ఆట మొదలయ్యే సమయానికి అతిగా ఆలోచించకుండా ఉండాలి. స్పష్టమైన ప్లాన్‌తో, సానుకూల దృక్పథంతో, మంచి ఉద్దేశంతో మైదానంలో అడుగుపెట్టి మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేయాలి'' అని ఈ మిస్టర్‌ 360 పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.