IND VS NZ: ఆఖరి టీ20కు టీమ్​ఇండియా సిద్ధం.. తుది జట్టులో ​ఛాన్స్​ ఎవరికో?

author img

By

Published : Nov 21, 2022, 10:30 PM IST

Teamindia vs Newzlealand Third T20 match preview

టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఆడుతోన్న తొలి సిరీస్‌పై భారత్‌ కన్నేసింది. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో భారత్‌ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం చివరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఇందులో విజయం సాధిస్తే సిరీస్ 2-0 తేడాతో టీమ్‌ఇండియా కైవసం చేసుకొంటుంది. ఒకవేళ ఓడినా 1-1తో సమంగా నిలుస్తుంది. ఈ క్రమంలో భారత్ తన తుది జట్టులో ఎవరిని తీసుకొంటుందనే ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ ఉంది.

న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఆఖరి పోరుకు సిద్ధమైంది. మంగళవారం నేపియర్‌ వేదికగా ఇరుజట్ల మధ్య చివరి టీ20 జరగనుంది. తొలి టీ20 వర్షార్పణంకాగా రెండో టీ20లో 65 పరుగుల తేడాతో భారత జట్టు జయభేరి మోగించింది. మూడో మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ సొంతం చేసుకోవాలని భారత జట్టు కృతనిశ్చయంతో ఉంది.

మూడో టీ20 కోసం జట్టులో భారీగా మార్పులేమీ ఉండవని ఇప్పటికే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పష్టం చేశాడు. ఉమ్రాన్‌ మాలిక్‌, సంజూ శాంసన్‌, శుభమన్‌ గిల్‌ వంటి ఆటగాళ్లు తుది జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. రెండో టీ20లో ఇషాన్‌ కిషన్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ ఆరంభించిన రిషబ్‌ పంత్‌ మరోసారి విఫలమయ్యాడు. ఐతే సూర్యకుమార్‌ యాదవ్‌ అద్వితీయ, విధ్వంసరకర ఇన్నింగ్స్‌ కారణంగా భారత జట్టు ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచగలిగింది. ముఖ్యంగా పవర్‌ ప్లే ఓవర్లలో వేగంగా పరుగులు సాధించడంలో టీమిండియా విఫలమవుతోంది. రెండో టీ20లో ఇషాన్‌ కిషన్‌ ఫర్వాలేదనిపించగా...పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, హార్దిక్‌ పాండ్యా స్థాయికి తగ్గట్లుగా సత్తా చాటాలని టీమిండియా కోరుకుంటోంది. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే టీమిండియా కట్టడి చేయగలిగింది.

మరోవైపు భారత్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరం కానున్నాడు. వైద్యుడితో ముందుగా తీసుకున్న అపాయింట్‌మెంట్‌ వల్ల కేన్‌ మూడో టీ20లో ఆడలేకపోతున్నాడు. ఈ మ్యాచ్‌కు ఆ జట్టు పేసర్‌ టిమ్‌ సౌథీ సారథిగా వ్యవహరించనున్నాడు. ఆక్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మార్క్‌ చాప్‌మన్‌ కివీస్‌ జట్టులో తిరిగి చేరనున్నాడు. శుక్రవారం టీమ్‌ఇండియాతో ప్రారంభం కాబోయే మూడు వన్డేల సిరీస్‌కు కేన్‌ తిరిగి నాయకత్వ బాధ్యతలు చేపడతాడని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు స్పష్టతనిచ్చింది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌పైనే కివీస్‌ జట్టు ఎక్కువగా ఆధారపడనుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ను కట్టడి చేయడంపైనే కివీస్‌ బౌలర్లు ప్రధానంగా దృష్టిసారించారు.

ఇదీ చూడండి: దేశవాళీ లిస్ట్​ ఏ క్రికెట్​ వీళ్లు బ్యాట్​ పడితే పరుగులే పరుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.