India VS Australia: ఇద్దరిది ఒకే సమస్య​.. సిరీస్​ దక్కేదెవరికో?

author img

By

Published : Sep 24, 2022, 5:36 PM IST

Updated : Sep 24, 2022, 5:46 PM IST

Teamindia VS Australia Third T20 match preview

మూడో టీ20 కోసం భారత్‌-ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధమయ్యాయి. మూడు టీ20ల మ్యాచ్​లో ఇప్పటికే చెరొకటి గెలిచి సమంగా ఉన్న ఇరుజట్లు.. చివరిమ్యాచ్‌ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్​ ఆదివారం(సెప్టెంబరు 25) రాత్రి ఉప్పల్‌ వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దాం..

టీ20 సిరీస్‌లలో భాగంగా తొలిమ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన టీమ్​ఇండియా.. తర్వాత జరిగిన పోరులో ప్రతీకారం తీర్చుకుంది. ఇక చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. బ్యాటర్లు పరుగులు సాధించినా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

తొలిమ్యాచ్‌లో టీమ్​ఇండియా 209 పరుగులు చేసి కూడా ఓటమిపాలు కావటం జట్టు బౌలింగ్‌, ఫీల్డింగ్ వైఫల్యాలను ఎత్తిచూపింది. అక్షర్‌ పటేల్‌ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడం రోహిత్‌ సేనకు సానుకూలాంశంగా ఉంది. సీనియర్ బౌలర్‌ భువనేశ్వర్‌ భారీగా పరుగులు సమర్పించుకోవడం వల్ల రెండో మ్యాచ్‌లో చోటు కోల్పోవాల్సి వచ్చింది. అటు డెత్‌ ఓవర్ స్పెషలిస్ట్‌ హర్షల్‌ పటేల్‌, స్పిన్నర్ చాహల్ బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతున్నారు. ఈ సిరీస్‌లో 6 ఓవర్లకు 81 పరుగులిచ్చి అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌ నిలిచాడు. బుమ్రా అందుబాటులోకి రావడం భారత్‌కు కొంతకలిసొచ్చే అంశంగా మారింది. బ్యాటింగ్‌లో రోహిత్‌, రాహుల్, కోహ్లీ రాణించాలని, చివరిమ్యాచ్‌లోనూ సూర్యకుమార్, హార్దిక్‌, దినేశ్‌ కార్తిక్‌ మెరుపులు మెరిపించాలని యాజమాన్యం భావిస్తోంది.

ప్రత్యర్థికి అదే సమస్య.. పర్యాటక జట్టు ఆసీస్‌ కూడా బౌలింగ్‌ లోపాలతో సతమతమవుతోంది. గాయాలతో దూరమైన నాథన్‌ ఎల్లీస్, కమ్మిన్స్‌ స్థానంలో వచ్చిన హేజిల్‌వుడ్, సామ్స్‌ టీమ్​ఇండియా బ్యాటర్లకు కళ్లెం వేయలేకపోతున్నారు. భారత బ్యాటర్ల బలహీనతలను చక్కగా ఉపయోగించుకున్న స్పిన్నర్ ఆడమ్ జంపా ఫలితం రాబట్టాడు. కెప్టెన్‌ ఫించ్, కీపర్ మాథ్యూ వేడ్‌....ఆసీస్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలుస్తున్నారు. 2 మ్యాచ్‌ల్లో కలిపి ఒకే పరుగు చేసిన హిట్టర్‌ మాక్స్‌వెల్‌ ఫామ్‌ అందుకోవాలని కంగారుల జట్టు ఆశిస్తోంది. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టీ20 ఆదివారం రాత్రి 7గంటలకు ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరగనుంది.

ఇదీ చూడండి: ఫెదరర్​-నాదల్​ మ్యాచ్​.. కోర్టులో నిప్పంటించుకుని ఫ్యాన్ హల్​చల్​

Last Updated :Sep 24, 2022, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.