టీ 20 ప్రపంచకప్ విజయానికి ఆరు మెట్లు!

author img

By

Published : Sep 18, 2022, 6:57 AM IST

Updated : Sep 18, 2022, 9:05 AM IST

T20 World Cup India Team

T20 World Cup India Team : ఆసియా కప్​లో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమ్ ఇండియా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​కు సిద్ధమైంది. మరో నెల రోజుల్లో టీ20 ప్రంపచకప్​ ఆరంభం కానున్న నేపథ్యంలో జట్టు పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఎంటో చూద్దాం.

T20 World Cup India Team : టీ20 ప్రపంచకప్‌కు ఇంకో నెల రోజులే సమయం ఉంది. ఈ మెగా టోర్నీలో తలపడే దేశాలన్నీ జట్లను ప్రకటించేశాయి. టీమ్‌ఇండియా కూడా కొన్ని రోజుల కిందటే జట్టును వెల్లడించింది. అయితే జట్టు కూర్పు, ఆటగాళ్ల ఫామ్‌పై సందేహాలు తొలగిపోలేదు. గత ఏడాది ప్రపంచకప్‌లో చేదు అనుభవం తర్వాత ప్రణాళిక బద్ధంగానే అడుగులేసినప్పటికీ.. ఈ ఏడాది కప్పు ముంగిట కొంత గందరగోళం, ఆందోళన తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో కలిపి ఆడబోయే ఆరు టీ20ల్లో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఆరు ఉన్నాయి. అవేంటంటే..

టాప్‌.. గాడిన పడాలి : కొంత కాలంగా టీమ్‌ఇండియాకు టాప్‌ ఆర్డర్‌ నిలకడ లేమి సమస్యగా మారింది. రోహిత్‌, రాహుల్‌, కోహ్లి ముగ్గురూ సమష్టిగా సత్తా చాటి చాలా కాలం అయింది. ఇటీవల ఆసియా కప్‌లో కోహ్లి ఫామ్‌ అందుకున్నప్పటికీ.. మిగతా ఇద్దరూ తడబాటు కొనసాగించారు. టాప్‌ ఆర్డర్‌ శుభారంభాలు అందించకపోవడం, జట్టుకు బలమైన పునాది వేయకపోవడం వల్ల మిడిల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచకప్‌ ముంగిట రోహిత్‌, రాహుల్‌ నిలకడ అందుకోవడం, కోహ్లి జోరు కొనసాగించడం.. మొత్తంగా టాప్‌ఆర్డర్‌ జట్టుకు భరోసానివ్వడం చాలా అవసరం.

ఆ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?: టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయంతో జట్టుకు దూరం కావడం భారత్‌కు పెద్ద దెబ్బే. ఇటీవల అతను చక్కగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. జడేజా జట్టులో ఉండడంతో అదనంగా ఒక బ్యాట్స్‌మన్‌ లేదా బౌలర్‌ను ఎంచుకునే సౌలభ్యం ఉండేది. అతడి స్థానాన్ని భర్తీ చేయడం ఇబ్బందిగా మారింది. అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ జడేజాకు సరితూగలేడు. దీపక్‌ హుడాను ఆడిద్దామంటే అతణ్ని నమ్మి బంతి ఇవ్వడం కష్టమే. మరి రాబోయే మ్యాచ్‌ల్లో జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి.

ఏది సరైన లెక్క?: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు స్పెషలిస్టు పేసర్లు నలుగురినే ఎంచుకోవడాన్ని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ మిచెల్‌ జాన్సన్‌ తప్పుబట్టాడు. పేస్‌కు అనుకూలించే పరిస్థితుల్లో అదనంగా మరో పేసర్‌ను తీసుకోవాల్సిందన్నది అతడి ఉద్దేశం. కానీ పేస్‌ కంటే స్పిన్‌నే ఎక్కువగా నమ్ముకునే భారత్‌.. చాన్నాళ్ల నుంచి తుది జట్టులో ఇద్దరు పేసర్లకు తోడు ఇద్దరు స్పిన్నర్లను ఆడిస్తోంది. హార్దిక్‌ పాండ్య రూపంలో పేస్‌ ఆల్‌రౌండర్‌ ఉండడంతో మరో పేసర్‌ అవసరం లేదని భావిస్తోంది. ఆస్ట్రేలియాలోనూ అదే కూర్పును అనుసరిస్తే కష్టమన్నది జాన్సన్‌ లాంటి వాళ్ల వాదన. మరి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను సొంతగడ్డపై ఢీకొనబోతున్న భారత్‌.. ఇక్కడి పిచ్‌లకు అనుగుణంగా బౌలింగ్‌లో పాత కూర్పును అనుసరిస్తుందా.. లేక ఆస్ట్రేలియా పిచ్‌లను అనుసరించి ఒక స్పిన్నర్‌ను తగ్గించి ఇంకో పేసర్‌ను ఆడిస్తుందా అన్నది ఆసక్తికరం.

ఓపెనర్‌ మారతాడా?: ఓపెనింగ్‌ విషయంలో భారత్‌ కొంత గందరగోళానికి గురవుతోంది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఆ స్థానాల్లో చాలామందిని మార్చి మార్చి చూసింది. కానీ ఎవ్వరూ కుదురుకోలేదు. చివరికి పాత జోడీ అయిన రోహిత్‌, రాహుల్‌లనే ఇటీవల ఆసియా కప్‌లో ఆడించింది. కానీ వీరు జట్టుకు మంచి ఆరంభాలనివ్వలేదు. అయితే చివరి మ్యాచ్‌కు రోహిత్‌ దూరం కావడంతో కోహ్లి ఓపెనింగ్‌ చేశాడు. శతకంతో అదరగొట్టాడు. విరాట్‌ ఐపీఎల్‌లోనూ ఓపెనర్‌గా సత్తా చాటిన నేపథ్యంలో ప్రపంచకప్‌కు అతడితో ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశాన్ని పరిశీలించాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచేలా రిషబ్‌ పంత్‌ను ఓపెనర్‌గా పంపితే.. కుడి, ఎడమ చేతి వాటం కూర్పు కూడా బాగుంటుందన్న వాదనా ఉంది. మరి ఈ దిశగా రాబోయే సిరీస్‌ల్లో ప్రయోగాలేమైనా చేస్తారేమో చూడాలి.

ఇద్దరిలో ఎవరు?: టీ20 ప్రపంచకప్‌కు భారత్‌ తుది జట్టులో ఆడించే వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఎవరనే విషయంలో సందిగ్ధత నెలకొంది. సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి కుర్రాళ్లకు కూడా అవకాశం ఇచ్చి చూసిన భారత్‌.. చివరికి రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌లను ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేసింది. కానీ వీరిలో ఎవరిని ఆడించినా.. ఇంకొకరిని ఎందుకు ఎంచుకోలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇద్దరిలో ఎవ్వరూ నిలకడగా ఆడలేదు. ఆసియా కప్‌లో ఒక మ్యాచ్‌ తర్వాత కార్తీక్‌ను పక్కన పెట్టేయడం విమర్శలకు దారి తీసింది. అలా అని పంత్‌ను పక్కన పెట్టినా అన్యాయమే అంటున్నారు. మరి రాబోయే రెండు సిరీస్‌ల్లో జట్టు యాజమాన్యం ఇద్దరినీ పరీక్షించి.. ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలన్నదానిపై స్పష్టత తెచ్చుకుంటుందేమో చూడాలి.

ఎవరా 11 మంది?: ఇక ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌ల్లో భారత్‌ దృష్టిసారించాల్సిన అత్యంత కీలక అంశం.. తుది జట్టు కూర్పు. గత పది నెలల కాలంలో వేర్వేరు దేశాల్లో, రకరకాల ఆటగాళ్లతో మ్యాచ్‌లు ఆడింది భారత్‌. చాలామంది కుర్రాళ్లకు అవకాశమిచ్చి చూసింది. అయితే ప్రయోగాలు, మార్పులు చేర్పులు మరీ శ్రుతి మించిపోవడంతో తుది జట్టు విషయంలో గందరగోళం నెలకొంది. జట్టు యాజమాన్యం కూడా ఈ విషయంలో అయోమయంలో ఉన్నట్లే కనిపిస్తోంది. మరి రాబోయే సిరీస్‌ల్లోనూ ప్రయోగాలు కొనసాగిస్తారా.. లేక స్థిరమైన జట్టుతో మ్యాచ్‌లు ఆడి ప్రపంచకప్‌లో ఆడబోయే తుది 11 మందిపై ముందే ఒక అంచనాకు వస్తారా అన్నది చూడాలి.

ఇవీ చదవండి: భారత్​- ఆస్ట్రేలియా సిరీస్.. ఈ ఆరుగురి మీదే అందరి గురి..

ఐపీఎల్​, దేశవాళీ క్రికెట్​లో కొత్త రూల్​.. ఇకపై మ్యాచ్ మధ్యలో..

Last Updated :Sep 18, 2022, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.