'ధోనీ ఉండుంటే ఆ ఔట్‌ను ఈజీగా గుర్తించేవాడు'.. మాజీ కెప్టెన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

'ధోనీ ఉండుంటే ఆ ఔట్‌ను ఈజీగా గుర్తించేవాడు'.. మాజీ కెప్టెన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు పేలవ బౌలింగ్ ప్రదర్శనపై మాజీలు తీవ్రంగా మండిపడుతున్నారు. అటు ఫీల్డింగ్ తప్పిదాలు కూడా జట్టు కొంపముంచాయి. దీనికి తోడు ఓ ఎల్‌బీడబ్ల్యూ అవకాశాన్ని టీమిండియా గుర్తించకపోవడం జట్టు ఓటమికి ఓ కారణమైంది. దీనిపై మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. టీమ్ ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ అనుభవాన్ని ప్రస్తావించారు. అలాంటి వాటిల్లో ధోనీ చాలా ఉత్తమంగా నిర్ణయం తీసుకొనేవాడని గుర్తుచేశారు. అసలేం జరిగిందంటే..
Ravi shastri about Dhoni : మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 208 పరుగుల భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. అయితే, ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఆటగాళ్లకు పలుమార్లు జీవనదానాలు లభించాయి. ఓపెనర్‌గా దిగిన కామెరూన్ గ్రీన్ నిజానికి 5వ ఓవర్లోనే ఔట్ అయ్యేవాడు. ఆ ఓవర్లో చాహల్ వేసిన మూడో బంతి గ్రీన్ ప్యాడ్‌కు తాకింది. అయితే, భారత్‌వైపు ఎవరూ అప్పీల్ చేయలేదు. ఆ తర్వాత ఆరో ఓవర్ సమయంలో రిప్లై చూపించగా.. గ్రీన్ ఎల్‌బీడబ్ల్యూగా తేలింది. దీంతో చాహల్, రోహిత్, దినేశ్ కార్తిక్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొన్నారు. అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా గుర్తించలేకపోయింది. ఆ తర్వాత చెలరేగిన గ్రీన్ 30 బంతుల్లో 61 పరుగులు చేసి లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు బలమైన పునాది వేశాడు.
ఎల్‌బీడబ్ల్యూ అవకాశాన్ని టీమిండియా గుర్తించకపోవడంపై మ్యాచ్ కామెంటేటర్లుగా ఉన్న సునీల్ గావస్కర్, రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. "వికెట్ కీపర్లు పోషించాల్సిన అత్యంత ముఖ్యమైన పాత్ర ఇదే. ఈ విషయంలో ఎంఎస్ ధోనీ ఎంతో ఉత్తమంగా వ్యవహరించేవాడు" అని చెప్పుకొచ్చారు. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. ఆసీస్‌తో రెండో టీ20 శుక్రవారం (సెప్టెంబరు 23) నాగ్‌పుర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా టీమిండియా గెలిచి సిరీస్ అవకాశాలను నిలబెట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదీ చదవండి: టీమ్ ఇండియాలో కీలక మార్పులు.. ఆ ముగ్గురు ఇన్.. వీళ్లు ఔట్!
