IND vs SA: పంత్​పై ప్రశంసలు.. మరి వాళ్ల పరిస్థితేంటి?

author img

By

Published : Jan 14, 2022, 10:44 AM IST

Updated : Jan 14, 2022, 11:52 AM IST

Pant

IND vs SA: పంత్‌ ఏంటి? ఇలా ఆడుతున్నాడు.. జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఎవరైనా అలా ఔటవుతారా?.. ఇవీ దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకోవడం వల్ల వెల్లువెత్తిన విమర్శలు! పంత్‌లా పోరాట పటిమ చూపి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.. అతనిలా ఆడి ఉంటే విజయంపై ధీమా ఉండేదేమో!.. ఇవీ చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ తర్వాత వినిపిస్తున్న మాటలు. అజేయ శతకంతో జట్టుకు పోరాడే స్కోరు అందించిన పంత్‌పై ప్రశంసలు కురుస్తుండగా.. వరుస వైఫల్యాలతో జట్టును ఇబ్బందుల్లోకి నెడుతున్న సీనియర్లు పుజారా, రహానేపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పంత్‌లా ఈ ఇద్దరూ రాణించి ఉంటే సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ కలను అందుకోవాలనే ఆశలు బహుశా క్లిష్టమయ్యేవి కాదేమో!

IND vs SA: దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకోవాలనే ఆశలు కొట్టుమిట్టాడుతున్న వేళ.. చివరి ఇన్నింగ్స్‌లో పంత్‌ పోరాటం.. సిరీస్‌ సాంతం పుజారా, రహానె వైఫల్యాలపై చర్చ జోరందుకుంది. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెబుతూ పంత్‌ సెంచరీ సాధించాడు.

మరోవైపు పుజారా, రహానె మాత్రం జట్టును మరింత కష్టాల్లో నెట్టి పెవిలియన్‌ చేరారు. గత రెండేళ్లుగా ఈ సీనియర్‌ ద్వయం బ్యాటింగ్‌లో విఫలమవుతూనే ఉంది. కానీ సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లో తొలి సిరీస్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఈ కీలక పర్యటనకు ఈ ఇద్దరిని కొనసాగించారు. కానీ వాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. విదేశీ పిచ్‌లపై మెరుగ్గా ఆడతాడనే పేరున్న రహానె, క్రీజులో గంటల పాటు పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెడతాడని చెప్పుకునే పుజారా.. ఆ అంచనాలు నిలబెట్టుకోలేకపోయారు.

ఈ సిరీస్‌లో రహానె కేవలం 22.66 సగటుతో 136 పరుగులు మాత్రమే చేశాడు. 20.66 సగటుతో 124 పరుగులే సాధించిన పుజారా పరిస్థితి ఇంకా దారుణం. ఎంతో అనుభవమున్న ఈ ఇద్దరూ.. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతులను వేటాడి, అధిక బౌన్స్‌ను అంచనా వేయలేక పెవిలియన్‌ చేరిన తీరు ఆందోళన కలిగిస్తోంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చెరో అర్ధశతకంతో పోరాడిన వీళ్లు.. ఫామ్‌ అందుకున్నారేమో అనిపించింది. కానీ చివరి టెస్టుకు వచ్చేసరికి షరా మామూలే. దీంతో వీళ్ల పనైపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీళ్లను ఉద్దేశించి చేస్తున్న 'పురానె (పాత)' అన్న హ్యాష్‌ట్యాగ్‌ చక్కర్లు కొడుతోంది.

తప్పులు తెలుసుకుని..

పంత్‌ కూడా తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా గత మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నపుడు భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌ చేరడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అతనికి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం ఇవ్వాలనే వ్యాఖ్యలూ వినిపించాయి. కానీ అతను తన తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకున్నాడు. అతనో మ్యాచ్‌ విన్నర్‌ అనడంలో సందేహం లేదు.

ఆస్ట్రేలియాతో గబ్బా టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. కానీ ఆ తర్వాత నిలకడ కోల్పోయాడు. దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తూ.. భారీ షాట్లతో బౌలర్లపై ఒత్తిడి పెంచడం అతని సహజ శైలి ఆట. కానీ ప్రతిసారి అది పని చేయదు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న అతను బాధ్యత తెలుసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో వచ్చీరాగానే షాట్లు ఆడలేదు. పిచ్‌ పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చాడు.

ఓ వైపు బౌండరీలు బాదుతూనే.. మరోవైపు సింగిల్స్‌తో స్ట్రైక్‌ రొటేట్‌ చేశాడు. ఓపికగా క్రీజులో నిలబడ్డాడు. తన దూకుడుకు నియంత్రణ జతచేశాడు. ఏ బంతికి ఎలాంటి షాట్‌ ఆడాలనే స్పష్టతతో కనిపించాడు. కానీ పుజారా, రహానె మాత్రం తమ వైఫల్యాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించలేదు. ఈ సిరీస్‌లో వైఫల్యం నేపథ్యంలో జట్టులో ఇక వాళ్లు ఉండకపోవచ్చు.

ముఖ్యంగా విహారి, శ్రేయస్‌, గిల్‌ లాంటి యువ ప్రతిభావంతులు అవకాశాల కోసం నిరీక్షిస్తుండడంతో రహానె (82 టెస్టులు), పుజారా (95 టెస్టులు)లకు ఉద్వాసన పలకడం ఖాయమనిపిస్తోంది.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డ్రాలో జకోవిచ్‌కు చోటు.. కానీ..

Last Updated :Jan 14, 2022, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.