ధోనీ చేస్తున్న ఈ వ్యాపారాల గురించి తెలుసా?

author img

By

Published : May 15, 2022, 10:51 AM IST

Dhoni Farming Bussiness

Dhoni Farming Bussiness: క్రికెట్‌ మైదానంలో ఇన్నాళ్లు మెరుపులు మెరిపించిన ధోనీ.. రిటైర్మంట్‌ తర్వాత రైతుగా మారాడు. బ్యాటు పట్టిన చేత్తో విత్తనాలు నాటుతున్నాడు. నిజానికి ఇదంతా ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు చేస్తున్న పనే అయినా మన మిస్టర్‌ కూల్‌ మాత్రం వైవిధ్యంగా అడుగులేస్తున్నాడు. అదేంటో తెలుసుకుందామా!

Dhoni Farming Bussiness: అంతర్జాతీయ క్రికెటర్‌గా, టీమిండియా కెప్టెన్‌గా... తనని తాను నిరూపించుకున్న మహేంద్ర సింగ్‌ ధోనీ ఇప్పుడు కర్షకుడిగానూ విజయం సాధించాలనుకుంటున్నాడు. ఇందుకోసమే రాంచీ శివార్లలోని చంబో గ్రామంలో 43 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. దానికి 'ఇజా ఫామ్‌హౌస్‌' అని పేరు కూడా పెట్టాడు. ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నా... తీరిక చేసుకుని మరీ అక్కడ వాలిపోతున్నాడు. దుక్కిదున్నడం దగ్గర నుంచి విత్తునాటడం వరకూ అన్నింట్లోనూ పాలు పంచుకుంటున్నాడు. నిజానికి ధోనీకి వ్యవసాయం చేయడంలో ఏ మాత్రం అనుభవం లేదు. ఈ కారణంతోనే ముందు కొంత అవగాహన పెంచుకోవాలనుకున్నాడు. సేంద్రియ సాగుపై ప్రయోగాలు చేయాలనుకున్నాడు. అందుకే వ్యవసాయ డిగ్రీలో పట్టా పుచ్చుకున్న రోషన్‌ కుమార్‌కి తన ఫామ్‌ బాధ్యతలు అప్పగించాడు. పశువైద్యంలో అనుభవం ఉన్న అక్షయ్‌నీ అక్కడ నియమించాడు. ఈ ఫామ్‌హౌస్‌ నిర్వహణ చూసుకునేందుకు కునాల్‌ గౌతమ్‌తో పాటు మరికొందరితో కలిపి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. తన ఆలోచనల్ని వారికి చెబుతూ తన కలల క్షేత్రాన్ని నిర్మించుకున్నాడు ధోనీ.

Dhoni Farming Bussiness
ధోనీ

చేపలూ కోళ్లూ కూడా ఉన్నాయ్‌!.. కేవలం ఏదో ఒక పంట పండించాలన్నది ధోనీ ఉద్దేశం కాదు. తన క్షేత్రంలో ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ చేయాలనుకున్నాడు. చుట్టు పక్కల గ్రామాల రైతులను కూడా ఈ దిశగా నడిపించాలనుకున్నాడు. మాటల్లో చెబితే కంటే... చేతల్లో చూపిస్తేనే ఎక్కువమంది స్ఫూర్తి పొందుతారన్నది ధోనీ మాట. అందుకే వారికి తానే ఆదర్శంగా నిలబడాలనుకున్నాడు. ముందుగా తన భూమిని రసాయన రహితంగా మార్చే పనులు చేపట్టారు ధోనీ, అతడి బృందం. సేంద్రియ సాగుకి భూమి సిద్ధమయ్యాక పండ్లూ, కూరగాయలతో పాటు ఆవాలు, మినుములు, కందులు వంటి వాటిని అంతర పంటలుగానూ వేశారు. సొంతంగా ఎరువు తయారు చేసుకుంటున్నారు. త్వరలోనే దీన్ని నియో గ్లోబల్‌ పేరుతో మార్కెట్‌లోకి తేనున్నారు. ఎరువు తయారీకి అవసరమయ్యే పేడ కోసం సుమారు 70 ఆవులతో ఓ డెయిరీని ఏర్పాటు చేశారు. వాటికి కూడా రసాయనరహిత దాణాను అందిస్తూ 500 లీటర్ల వరకూ పాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు మరో 300 ఆవుల పోషణ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞాన సదుపాయాలతో ఓ మోడర్న్‌ క్యాటిల్‌ఫామ్‌ని కూడా సిద్ధం చేశారు. ఇవే కాదు, నాటు కోళ్లు, కడక్‌నాథ్‌ కోళ్లు, బాతుల వంటివి పెంచడానికి పౌల్ట్రీని నిర్మించారు. చేపల పెంపకానికి ఓ చెరువునీ తవ్వారు.

Dhoni Farming Bussiness
ధోనీ

ఇతర రైతులకోసం... ఈ ఇజా ఫామ్స్‌లో సుమారు వంద మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. అది మాత్రమే కాదు... వారికి సుస్థిర వ్యవసాయ పద్ధతులూ నేర్పాలన్నది ధోనీ అభిలాష. అందుకే ఈ క్షేత్రానికి సంబంధించిన నిపుణులు వీరందరికీ సేంద్రియ సాగులో మెలకువలు నేర్పుతున్నారు. వారు తమ సొంత భూముల్లో ప్రకృతిహిత వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు సమీప గ్రామాల రైతులకు చెందిన పశువుల సంరక్షణ, చికిత్సల బాధ్యతలూ తీసుకున్నారు. ఇక, ధోనీ సేంద్రియ సాగు ఉత్పత్తులకు చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు ఉంది. ముఖ్యంగా రాంచీ మార్కెట్‌లో వీటికి భారీ డిమాండ్‌ ఉంది. ఇవన్నీ గుర్తించే ఝార్ఖండ్‌ వ్యవసాయ శాఖ వీటిని విదేశాలకు ఎగుమతి చేయాలనే నిర్ణయమూ తీసుకుంది. ఎందుకంటే ధోనీ బ్రాండ్‌ ఇమేజ్‌ ఝార్ఖండ్‌ రైతులకే కాదు, దేశానికీ ఓ గుర్తింపు తెస్తుందనేది అక్కడి ప్రభుత్వం ఆలోచన. ధోనీనా మజాకానా మరి!

ఇదీ చూడండి: IPL: ధోనీ తర్వాత సీఎస్కే నెక్ట్స్​ కెప్టెన్​ అతడేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.