'ఆ ఒక్క ఓవరే మా అవకాశాలను దెబ్బతీసింది'

author img

By

Published : Oct 12, 2021, 9:32 AM IST

kohli

కోల్​కతా ఇన్నింగ్స్​లో సునీల్​ నరైన్ ఆడిన 12వ ఓవరే తమ అవకాశాలను దెబ్బతీసిందని రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB vs KKR) కెప్టెన్ విరాట్ కోహ్లీ(Kohli Captaincy) చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌తో ఆర్సీబీ సారథిగా ఇన్నింగ్స్‌ ముగించడంపై స్పందిస్తూ కోహ్లీ ఒకింత భావోద్వేగం చెందాడు. మరోవైపు.. కెప్టెన్​గా కోహ్లీ మొదటి, చివరి మ్యాచ్​ల్లో 39 పరుగులే చేయడం గమనార్హం.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB vs KKR) ఓటమిపాలైంది. దీంతో ఈసారి కూడా కప్పు గెలవకుండానే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. సోమవారం రాత్రి జరిగిన కీలక పోరులో కోహ్లీసేన(Kohli Captaincy) 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli News).. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో సునీల్‌ నరైన్‌ ఆడిన 12వ ఓవరే తమ అవకాశాలను దెబ్బ తీసిందని చెప్పాడు. క్రిస్టియన్‌ వేసిన ఆ ఓవర్‌లో నరైన్‌ మూడు సిక్సులు బాదగా మొత్తం 22 పరుగులొచ్చాయి. దీంతో మ్యాచ్‌ ఒక్కసారిగా మోర్గాన్‌ టీమ్‌కు అనుకూలంగా మారింది.

"ఈ మ్యాచ్‌లో మేం బ్యాటింగ్‌ చేసేటప్పుడు కోల్‌కతా స్పిన్నర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆధిపత్యం చెలాయించారు. వాళ్లు కట్టుదిట్టంగా బంతులేసి ముఖ్యమైన వికెట్లు తీశారు. మేం శుభారంభం చేసినా వాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ విజయానికి కోల్‌కతా అర్హమైన జట్టు. మేం చివరివరకూ బంతితో పోరాడిన తీరే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అంటే ఏంటో తెలియజేస్తుంది. అయితే, నరైన్‌ ఆడిన ఒక్క ఓవరే మా అవకాశాలను దెబ్బతీసింది. బ్యాటింగ్‌లో 15-20 పరుగులు తక్కువ చేయడం.. బౌలింగ్‌లో రెండు మూడు ఓవర్లు భారీగా పరుగులివ్వడమే మా ఓటమికి కారణమైంది. అలాగే నరైన్‌ నాణ్యమైన బౌలర్‌ కావడం వల్ల మాపై ఆధిపత్యం చెలాయించాడు. మధ్యలో మా బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వకుండా.. షకిబ్‌, వరుణ్‌తో కలిసి మాపై ఒత్తిడి తెచ్చాడు" అని విరాట్‌ చెప్పుకొచ్చాడు.

చివరివరకూ ఇక్కడే

ఈ మ్యాచ్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథిగా ఇన్నింగ్స్‌ ముగించడంపై స్పందిస్తూ కోహ్లీ ఒకింత భావోద్వేగం చెందాడు. జట్టును గెలిపించేందుకు తన శక్తి మేర కృషి చేశానన్నాడు. "జట్టు కోసం ఎంతగానో కృషి చేశా. యువకులు ఎలాంటి బెరుకులేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు జట్టులో కొత్త ఒరవడి సృష్టించా. టీమ్‌ఇండియాలోనూ నేనిలాగే చేశా. ప్రతిసారీ ఈ ఫ్రాంఛైజీ కోసం 120 శాతం కష్టపడ్డా. ఇకపై ఒక ఆటగాడిగా అదే పనిచేస్తా. చివరగా నేనెప్పటికీ ఆర్సీబీలోనే కొనసాగుతా. వేరే జట్టుతో నన్ను ఊహించుకోలేను. మాటల కన్నా నాకు విలువలే గొప్పవి. అందుకు కట్టుబడి ఉంటా. ఐపీఎల్‌లో నేను ఆడే చివరి రోజు వరకూ ఈ జట్టుతోనే కొనసాగుతా" అని కోహ్లీ స్పష్టంచేశాడు.

'39' పరుగులే..

2011లో విరాట్​ కోహ్లీ(Virat Kohli News).. ఆర్సీబీ జట్టుకు కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించాడు. రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన తొలి మ్యాచ్​లో కోహ్లీ 34 బంతుల్లో 39 పరుగులు చేశాడు. సోమవారం కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లోనూ 33 బంతుల్లో 39 పరుగులు చేశాడు కోహ్లీ. కెప్టెన్​గా తొలి మ్యాచ్​లోను, చివరి మ్యాచ్​లోనూ కోహ్లీ అనూహ్యంగా 39 పరుగులే చేయడం విశేషం.

ఇదీ చదవండి:

Kohli Captaincy RCB: కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ముగిసిందిలా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.