IPL 2022: చెలరేగిన హసరంగ.. హైదరాబాద్​పై బెంగళూరు ఘన విజయం

author img

By

Published : May 8, 2022, 7:45 PM IST

sunrisers hyderabad vs royal challengers bangalore

IPL 2022: సన్​రైజర్స్​ హైదరాబాద్​పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్​ఆర్​హెచ్​ను హసరంగ (5 వికెట్లు) దెబ్బ తీశాడు. దీంతో వరుసగా నాలుగో మ్యాచ్​లోనూ ఓటమిపాలైంది ఆరెంజ్​ ఆర్మీ.

IPL 2022: బెంగళూరు అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్‌కు మరోసారి ఓటమి తప్పలేదు. 67 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై బెంగళూరు ఘన విజయం సాధించి రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 192/6 స్కోరు చేసింది. అనంతరం బెంగళూరు బౌలర్‌ హసరంగ (5/18) విజృంభించడం వల్ల హైదరాబాద్‌ 125 పరుగులకే పరిమితమైంది. రాహుల్ త్రిపాఠి (58), మార్‌క్రమ్‌ (21), పూరన్ (19) మినహా ఎవరూ రెండంకెల స్కోరును నమోదు చేయలేదు. హసరంగతోపాటు హేజిల్‌వుడ్ 2.. హర్షల్‌ పటేల్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ తీశారు. హైదరాబాద్‌కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. ఈ విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్ ఛాన్స్‌లను మరింత మెరుగుపర్చుకోగా.. ఓటమిబాటలో కొనసాగుతున్న హైదరాబాద్‌ అవకాశాలను తగ్గించుకుంటోంది.

కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్‌కు బెంగళూరు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు సారథి డుప్లెసిస్‌ (73*), రాజత్‌ పాటిదార్‌ (48), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (33), దినేశ్‌ కార్తిక్‌ (30*) ధాటిగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (0) హైదరాబాద్‌పై మరోసారి గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఫరూఖి వేసిన చివరి ఓవర్‌లో దినేశ్ కార్తిక్‌ 25 పరుగులను రాబట్టాడు. ఇందులో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ ఉన్నాయి. బౌండరీ లైన్‌ వద్ద త్రిపాఠి క్యాచ్‌ మిస్‌ చేయడంతో వరుస బంతుల్లో కార్తిక్‌ మూడు సిక్సర్లతోపాటు ఫోర్ బాదడం విశేషం. హైదరాబాద్‌ బౌలర్లలో సుచిత్ 2, త్యాగి ఒక వికెట్ తీశారు. ఆఖరి ఐదు ఓవర్లలో బెంగళూరు బ్యాటర్లు 67 పరుగులను జోడించారు.

ఇదీ చూడండి: దిల్లీ ప్లేయర్​కు కరోనా.. టోర్నీ మధ్యలో వెస్టిండీస్​కు హెట్మెయర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.