IPL 2022: ఆర్సీబీకి ప్లేఆఫ్స్‌ బెర్తు కష్టమేనా?

author img

By

Published : May 14, 2022, 2:24 PM IST

IPL 2022 RCB play offs

IPL 2022 RCB Playoffs: ఈ ఐపీఎల్ సీజన్​లో బెంగళూరు ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేసరికి ఏ స్థానంలో నిలుస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ సారి బెంగళూరు జట్టుతో సహా మిగతా టీమ్​ల పరిస్థితి ఇప్పుడెలా ఉంది తెలుసుకుందాం..

IPL 2022 RCB Playoffs: భారత టీ20 లీగ్‌లో బెంగళూరు ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే పరిస్థితులు ప్రతికూలంగా మారేటట్లు కనిపిస్తున్నాయి. గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోవడమే అందుకు ప్రధాన కారణం. ఫా డుప్లెసిస్‌ టీమ్‌ ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నా.. లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేసరికి ఏ స్థానంలో నిలుస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర జట్ల సమీకరణాలు పరిగణనలోకి తీసుకుంటే బెంగళూరు అవకాశాలకు గండిపడే ప్రమాదం పొంచి ఉంది.

బెంగళూరు ఇప్పుడెలా ఉంది.. డుప్లెసిస్‌ నాయకత్వంలో ఈ సీజన్‌ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన బెంగళూరు మధ్యలో పలు వైఫల్యాలు చవిచూసింది. తర్వాత కొన్ని విజయాలు సాధించి మళ్లీ టాప్‌-4లోకి దూసుకొచ్చింది. దీంతో ప్లేఆఫ్స్‌ రేసులో చోటు దక్కించుకునేలా కనిపించింది. కానీ, గతరాత్రి పంజాబ్‌ చేతిలో ఓటమిపాలవ్వడంతో పరిస్థితులు మారాయి. ప్రస్తుతానికి టాప్‌-4లో ఉన్నా.. ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 6 ఓటములతో నిలవడంతో 14 పాయింట్లతో కొనసాగుతోంది. అయితే, ఇక్కడ నెట్‌రన్‌రేట్‌(-0.323)లో చాలా వెనుకపడిపోయింది. అది ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై (-0.181) కన్నా మరీ తక్కువగా ఉండటం గమనార్హం. దీంతో లీగ్‌ దశ ముగిసేసరికి.. పరిస్థితులు కఠినంగా మారి నాలుగో స్థానం కోసం ఇతర జట్లతో పోటీపడాల్సి వస్తే రన్‌రేట్‌ విషయంలో బెంగళూరు కచ్చితంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అది తప్పించుకోవాలంటే మిగిలి ఉన్న ఒకే ఒక్క మ్యాచ్‌లో సంచలన విజయం సాధించాలి.

ఇతర జట్లు ఎలా ఉన్నాయి..

గుజరాత్‌: హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని గుజరాత్‌ ప్రస్తుతం 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఆ జట్టు ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో.. రెండూ గెలిచినా 22 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంటుంది. దీంతో అగ్రస్థానంతోనే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటుంది. ఒకవేళ ఒకటి ఓడి.. ఒకటి గెలిచినా 20 పాయింట్లతో నిలుస్తుంది. లేదా దురదృష్టంకొద్దీ రెండూ ఓడినా ఇప్పటికే 18 పాయింట్లు సాధించడంతో బెర్తు కచ్చితంగా ఉంటుంది.

లఖ్‌నవూ: కేఎల్‌ రాహుల్ సారథ్యంలోని లఖ్‌నవూ ప్రస్తుతం 8 విజయాలతో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు కూడా ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో.. రెండూ గెలిస్తే 20 పాయింట్లు సాధించనుంది. ఒకవేళ ఒక్కటి గెలిచినా 18 పాయింట్లతో నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. పరిస్థితులు ఎదురుతన్ని రెండూ ఓడినా 16 పాయింట్లతో ఉంటుంది. అలాంటప్పుడు లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేసరికి కచ్చితంగా మూడు లేదా నాలుగో స్థానమైనా ఎక్కడికీ పోదు.

రాజస్థాన్‌: సంజూ శాంసన్‌ కెప్టెన్సీలో రాజస్థాన్‌ ఈ సీజన్‌లో ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 5 ఓటములతో 14 పాయింట్లు సాధించి బెంగళూరుతో సమానంగా ఉంది. అయితే, రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో మూడులో నిలిచింది. ఈ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో తనకన్నా తక్కువ పాయింట్లు, రన్‌రేట్‌లో వెనుకపడిపోయిన దిగువ స్థానాల్లో నిలిచిన జట్లకన్నా రాజస్థాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే 18 పాయింట్లతో నిలుస్తుంది. ఒకవేళ ఒకటి ఓడినా 16 పాయింట్లు కచ్చితంగా ఉంటాయి. ఎలాగూ రన్‌రేట్‌ పరంగా బాగుండటంతో మంచి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

దిల్లీ: రిషభ్‌పంత్‌ ఈసారి దిల్లీని అంత మెరుగ్గా నడిపించలేకపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌ రేసులో నిలవడానికి కష్టపడుతోంది. ఒక గెలుపు, ఒక ఓటమి లెక్కన కొనసాగుతూ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములతో నిలిచింది. దీంతో 12 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే, రన్‌రేట్‌లో దిల్లీ (0.210).. బెంగళూరు (-0.323) కన్నా మెరుగ్గా.. రాజస్థాన్‌ (0.228) కాస్త తక్కువగా ఉండటంతో మిగిలిన రెండు మ్యాచ్‌లు కష్టపడి గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఒకటి గెలిచి, ఒకటి ఓడితే పరిస్థితి ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.

పంజాబ్‌: మయాంక్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని పంజాబ్‌ గతరాత్రి బెంగళూరుపై విజయం సాధించడంతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీంతో ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 12 మ్యాచ్‌ల్లో దిల్లీ లాగే 6 గెలిచి, 6 ఓటములపాలై 12 పాయింట్లతోనే ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇది కూడా ఫర్వాలేదనిపించే రన్‌రేట్‌ (0.023) కలిగి ఉండటంతో మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 3 లేదా 4 స్థానాల్లో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. అది కూడా ఇతర జట్లతో సమానంగా నిలవకుండా ఉంటేనే. ఒకవేళ నిలిచినా రన్‌రేట్‌ మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌: కేన్‌ విలియమ్సన్‌ టీమ్‌ హైదరాబాద్‌ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు, 6 ఓటములతో 10 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. అయితే, ఆడాల్సినవి ఇంకా మూడు మ్యాచ్‌లు ఉండటంతో అన్నీ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. కానీ, హైదరాబాద్‌ ఇటీవల వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓటమిపాలవ్వడంతో ఇకపై వరుసగా మూడు గెలవడం అత్యంత కష్టమనే చెప్పాలి. విలియమ్సన్‌ టీమ్‌ ఏదైనా అద్భుతం చేసి విశేషంగా రాణిస్తే కనీసం నాలుగో స్థానంలోనైనా చోటు దక్కే వీలుంది.

కోల్‌కతా: శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని కోల్‌కతా ఈసారి అంత ప్రభావవంతంగా లేదు. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 7 ఓటములతో 10 పాయింట్లు సాధించి 8 స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఆ జట్టుకు ఇంకా టెక్నికల్‌గా పోటీలో అవకాశం ఉంది. అయితే, కోల్‌కతా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించినా 14 పాయింట్లతోనే నిలుస్తుంది. మరోవైపు ఇప్పటికే రాజస్థాన్‌, బెంగళూరు జట్లు14 పాయింట్లతో కొనసాగుతుండటంతో ఈ జట్టు అవకాశాలు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలా కాకపోయినా రన్‌రేట్‌ పరంగా దిల్లీ, పంజాబ్‌, హైదరాబాద్‌లతో పోటీపడి మరీ నెగ్గాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే బెంగళూరుకు.. దిల్లీ, పంజాబ్‌ జట్ల నుంచే ప్రధానంగా పోటీ ఉంది. హైదరాబాద్‌, కోల్‌కతాలతోనూ పోటీ ఉన్న ప్రస్తుతం ఆ జట్ల పరిస్థితులు చూస్తుంటే టాప్‌-4లో చోటు దక్కించుకోవడం అంత తేలిక కాదు. మరోవైపు బెంగళూరు తేలిగ్గా ప్లేఆఫ్స్‌ చేరాలన్నా ఇంకో సులువైన మార్గం ఉంది. అదేంటంటే.. ఇప్పుడు టాప్‌-3లో ఉన్న గుజరాత్‌, లఖ్‌నవూ, రాజస్థాన్‌ తలా ఒక్కో మ్యాచ్‌ గెలిచినా.. అవి వరుసగా 20, 18, 16 పాయింట్లు సాధిస్తాయి. దీంతో మూడు స్థానాలు భర్తీ అయిపోతాయి. అలాగే బెంగళూరు కన్నా తక్కువ స్థానాల్లో ఉన్న దిల్లీ, పంజాబ్‌, హైదరాబాద్‌, కోల్‌కతా ఒక్కో మ్యాచ్‌ ఓడిపోయినా బెంగళూరుకే కలిసివస్తుంది. అప్పుడు ఆ జట్టు మిగిలిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించాలి. ఒకవేళ భారీ విజయం సాధిస్తే ఇంకా మంచిది.

ఇదీ చూడండి: ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్​గా కోహ్లీ.. మూడో బౌలర్​గా రబాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.