IPL 2022:  వార్నర్​ అదృష్టం.. రాజస్థాన్​కు ఎదురుదెబ్బ!

author img

By

Published : May 12, 2022, 10:07 AM IST

Updated : May 12, 2022, 10:42 AM IST

ipl 2022 chahal warner

IPL 2022 Warner Chahal: ఐపీఎల్‌ 2022లో భాగంగా బుధవారం జరిగిన దిల్లీ క్యాపిటల్స్‌-రాజస్థాన్​ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో చాహల్​, వార్నర్​ ఓ రికార్డును సాధించారు. కాగా, ఈ మ్యాచ్​లో విజయం సాధించిన దిల్లీ జట్టు ప్లేయర్​ వార్నర్​ అదృష్టమే రాజస్థాన్​ రాయల్స్‌ కొంపముంచినట్లయింది.

IPL 2022 Warner Chahal: ఐపీఎల్‌ 2022లో భాగంగా బుధవారం జరిగిన దిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్లతో రాజస్థాన్​ రాయల్స్‌పై నెగ్గింది. ఈ విజయంతో దిల్లీ తమ ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవం చేసుకుంది. అయితే వార్నర్‌ అదృష్టం రాజస్థాన్​ రాయల్స్‌ కొంపముంచినట్లయింది. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ చాహల్‌ బౌలింగ్ చేశాడు. అతడు వేసిన బంతి.. వార్నర్‌ బ్యాట్‌ను దాటి ఆఫ్‌స్టంప్‌ను తాకుతూ వెళ్లిపోయింది. దీంతో వికెట్‌ దక్కిందనుకున్న చాహల్‌ ఆనందం అంతలోనే ఆవిరైంది. బంతి నెమ్మదిగా తాకడంతో లైట్స్‌ వెలిగినా... బెయిల్‌ మాత్రం పడలేదు. దాంతో వార్నర్‌ నాటౌట్‌గా తేలాడు. ఒకవేళ ఆ బెయిల్‌ కిందపడి వార్నర్‌ ఔట్‌ అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేది. అప్పటికి వార్నర్‌ 22 పరుగులు మాత్రమే చేశాడు. మార్ష్‌ దాటిగా ఆడుతున్నప్పటికి.. మంచి భాగస్వామ్యం ఏర్పడిన దశలో వార్నర్‌ ఔట్‌ అయ్యుంటే రాజస్థాన్​కు కలిసొచ్చేదే. కానీ విజయం దిల్లీకే రాసిపెట్టినట్లైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చాహల్​ రికార్డు.. ఇక ఈ మ్యాచ్​లో రాజస్థాన్​ ఓడినప్పటికీ.. చాహల్​ ఓ ఫీట్​ను అందుకున్నాడు. ఒక సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో చాహల్‌ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 23 వికెట్ల తీశాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌ తరపున ఇదే అత్యుత్తమం. ఇక తొలి స్థానంలో జేమ్స్‌ ఫాల్కనర్‌ ఉన్నాడు. 2013లో ఫాల్కనర్‌ 28 వికెట్లతో దుమ్మురేపాడు. ఈ సీజన్​లో రాజస్థాన్‌కు మరో రెండు మ్యాచ్‌లు సహా ఆ తర్వాత ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. కాబట్టి చాహల్‌ ఫాల్కనర్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇక సోహైల్‌ తన్వీర్‌(2008, 22 వికెట్లు) మూడో స్థానంలో ఉండగా.. జోఫ్రా ఆర్చర్‌(2020, 20 వికెట్లు), శ్రేయస్‌ గోపాల్‌(2019, 20 వికెట్లు) సంయుక్తంగా నాలుగో​ స్థానంలో ఉన్నారు.

కోహ్లీ, ధావన్​ సరసన వార్నర్​.. ఈ సీజన్​లో దిల్లీ ఓపెనర్‌ వార్నర్‌ హాఫ్‌ సెంచరీలతో అదరగొడుతున్నాడు. తాజాగా రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్‌లో మరో అర్ధశతకం సాధించాడు. ఈ సీజన్‌లో వార్నర్‌కు ఇది ఐదో ఫిప్టీ కావడం విశేషం. మార్ష్‌(89)తో కలిసి వార్నర్‌(52*) కీలక సమయంలో దిల్లీని గెలిపించి ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉంచాడు. ఈ నేపథ్యంలోనే వార్నర్‌ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికసార్లు 400 పరుగుల మార్క్‌ను అందుకున్న జాబితాలో టీమ్ఇండియా ​ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధావన్‌లతో సమంగా నిలిచాడు. ఇప్పటివరకు వార్నర్‌ 8సార్లు 400 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. కోహ్లీ, ధావన్‌లు కూడా ఐపీఎల్‌లో ఎనిమిది సార్లు ఆ ఫీట్​ను అందుకున్నారు. కాగా ఈ జాబితాలో సురేశ్‌ రైనా తొలి స్థానంలో ఉన్నాడు. రైనా తొమ్మిదిసార్లు ఐపీఎల్‌లో 400 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.

ఇదీ చూడండి: అందుకే ఔట్ అయినప్పుడు నవ్వుతున్నా: కోహ్లీ

Last Updated :May 12, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.