టీమ్ఇండియాకు కలిసిరాని కేప్​టౌన్.. మరి ఈసారైనా?

author img

By

Published : Jan 10, 2022, 1:19 PM IST

IND VS SA TEst, India cap town recrd, భారత్ దక్షిణాఫ్రికా టెస్టు, టీమ్ఇండియా కేప్​టౌన్ రికార్డు

Team India Cape Town Record: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం నుంచి చివరిదైన మూడో టెస్టు జరగనుంది. ఇప్పటికే సిరీస్​ను 1-1 సమయం చేసిన సౌతాఫ్రికా ఈ మ్యాచ్​లోనూ గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఇక ఈ మ్యాచ్​లో విజయం సాధించి సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్​ గెలవాలన్న పట్టుదలతో ఉంది టీమ్ఇండియా. అయితే ఈ మ్యాచ్​ జరగబోయే కేప్​టౌన్​ మైదానంలో భారత్​కు అంత మంచి రికార్డు లేకపోవడం గమనార్హం.

Team India Cape Town Record: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టుకు రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి ఇరుజట్ల మధ్య కేప్​టౌన్​ వేదికగా ఈ చివరి టెస్టు జరగనుంది. ఈ సిరీస్​లో ఇప్పటికే చెరో మ్యాచ్​ గెలిచిన ఇరుజట్లు.. ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. విరాట్ కోహ్లీ రాకతో బలంగా మారిన భారత జట్టును సఫారీసేన ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి. అలాగే ఈ మ్యాచ్ జరగబోయే కేప్​టౌన్​లో ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్ గెలవలేదు టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ జరగబోయే ఈ మైదానంలో భారత జట్టు రికార్డు ఎలా ఉందో చూద్దాం.

IND vs SA Test
IND vs SA Test

ఇప్పటివరకు కేప్​టౌన్ మైదానంలో భారత్ ఐదు టెస్టు మ్యాచ్​లు ఆడగా.. ఇందులో రెండు డ్రాగా ముగియగా.. మూడు మ్యాచ్​ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1992-93 డ్రా

భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలిసారి కేప్​టౌన్ వేదికగా టెస్టు మ్యాచ్ జరిగింది. 1992-93 సీజన్​లో జరిగిన ఈ సిరీస్​ను 1-0 తేడాతో చేజిక్కించుకుంది సౌతాఫ్రికా. ఈ టూర్​లో చివరిదైన నాలుగో టెస్టు కేప్​టౌన్ వేదికగా జరిగింది. అయితే ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసింది.

1997 - దక్షిణాఫ్రికా విజయం

1997లో జరిగిన మూడు టెస్టు మ్యాచ్​ల సిరీస్​లో రెండో టెస్టు కేప్​టౌన్ వేదికగా జరిగింది. అప్పటికే మొదటి టెస్టును 328 పరుగుల తేడాతో గెలుచుకుని జోరుమీదున్న సఫారీసేన.. రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించింది. 282 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్​లో సచిన్, అజారుద్దీన్ నెలకొల్పిన 222 పరుగుల భాగస్వామ్యం అందరినీ ఆకట్టుకుంది. తెందూల్కర్​ 169 పరుగులతో సత్తాచాటగా, అజారుద్దీన్ 115 పరుగులు సాధించాడు.

2007 - దక్షిణాఫ్రికా విజయం

2006-07 పర్యటన భారత్​కు మధుర జ్ఞాపకాల్ని అందించిందని చెప్పవచ్చు. ఈ టూర్​లో భాగంగా జరిగిన తొలి టెస్టులో సఫారీసేనపై గెలిచిన టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి ఓ టెస్టు మ్యాచ్​ విజయం సాధించింది. కానీ ఆ తర్వాత బలంగా పుంజుకున్న సౌతాఫ్రికా.. డర్బన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో విజయంతో సిరీస్​ను సమం చేసింది. ఇక చివరిదైన మూడో టెస్టు కేప్​టౌన్ వేదికగా జరగగా.. ఈ మ్యాచ్​లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. ఈ టెస్టులో సెంచరీ బాదిన వసీం జాఫర్​.. సౌతాఫ్రికా గడ్డపై శతకం చేసిన తొలి భారత ఓపెనర్​గా రికార్డు సృష్టించాడు.

2011 - డ్రా

ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్​ గెలిచే అవకాశాన్ని టీమ్ఇండియా తృటిలో చేజార్చుకుంది. మూడు టెస్టుల సిరీస్​లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్​ను గెలిచిన ధోనీసేన.. కేప్​టౌన్​లో జరిగిన మూడో టెస్టులో విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ రెండో ఇన్నింగ్స్​లో వీరోచిత శతకంతో మ్యాచ్​ను డ్రాగా ముగించాడు సౌతాఫ్రికా స్టార్ ఆల్​రౌండర్ జాక్వెస్ కలిస్. ఇదే టెస్టులో సెంచరీ (146) బాదిన సచిన్​కు ఈ ఫార్మాట్​లో ఇదే చివరి శతకం కావడం విశేషం. స్టెయిన్, మోర్నే మోర్కెల్ లాంటి పేసర్లను ఎదుర్కొంటూ సచిన్ చేసిన శతకం విమర్శకుల చేత చప్పట్లు కొట్టించింది.

2018 - దక్షిణాఫ్రికా విజయం

IND VS SA TEst, India cap town recrd, భారత్ దక్షిణాఫ్రికా టెస్టు, టీమ్ఇండియా కేప్​టౌన్ రికార్డు
టీమ్ఇండియా

ఈ పర్యటనలో తొలి టెస్టును కేప్​టౌన్ వేదికగా ఆడింది టీమ్ఇండియా. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్ ద్వారానే టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికాను 286 పరుగులకే కట్టడి చేసిన భారత్​.. తన మొదటి ఇన్నింగ్స్​లో 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఆల్​రౌండర్ బుమ్రా 95 బంతుల్లో 93 పరుగులతో భారత్​ను గట్టెక్కించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్​లో సఫారీసేనను 130 పరుగులకే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా.. ఈ మ్యాచ్​లో విజయం సాధించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కానీ భారత బ్యాటర్లు విఫలమవడం వల్ల 135 పరుగులకే ఆలౌటై 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇవీ చూడండి: ధోనీకి కేకేెఆర్​ పంచ్.. జడేజా దిమ్మతిరిగే కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.