బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 కెప్టెన్​గా హార్దిక్‌ ఫిక్స్!​.. వన్డే, టెస్ట్‌లకు?

author img

By

Published : Nov 19, 2022, 11:01 AM IST

hardik pandya

జాతీయ సెలెక్షన్‌ కమిటీపైనే వేటు వేసిన బీసీసీఐ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్​ జట్టులో మూడు ఫార్మట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. హార్దిక్​ పాం‍డ్యను టీ20 సారధిగా నియమించేందుకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం.

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2022లో భారత జట్టు ఘోర వైఫల్యం చెందిందన్న కారణంతో ఏకంగా జాతీయ సెలెక్షన్‌ కమిటీపైనే వేటు వేసిన బీసీసీఐ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్​ జట్టులో SPLIT CAPTAINCY (వేర్వేరు కెప్టెన్లు) అమలు చేయాలని నిర్ణయించినట్లు బీసీసీఐలోని కీలక అధికారి జాతీయ మీడియాకు వెల్లడించినట్లు సమాచారం.

ఇటీవల కాలంలో టీ20 ఫార్మాట్‌లో ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేక, వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మను టెస్ట్‌, వన్డేలకు మాత్రమే పరిమితం చేసి, హార్దిక్​ పాం‍డ్యను టీ20 సారధిగా నియమించేందుకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. కొత్త సెలెక్షన్‌ కమిటీ బాధ్యతలు తీసుకోగానే ఈ విషయంపై చర్చించి అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం​ ఉంది.

రోహిత్‌పై భారం తగ్గించేందుకు టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో కూడా ఏదో దానిపై కోత పెట్టే అంశాన్ని కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉంటే టీమ్ఇండియా సత్ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్న బీసీసీఐ.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లలో రోహిత్‌ను ఏదో ఒక దానిని నుంచి తప్పించాలని (కెప్టెన్సీ) బీసీసీఐ భావిస్తే మున్ముందు హిట్‌మ్యాన్‌ వన్డేలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికిప్పుడే టీ20 కెప్టెన్సీ మార్పు అవసరం లేదని కొందరు సూచిస్తున్నారు. ఇంకొందరైతే.. టీ20 ప్రపంచకప్‌ 2024ను దృష్టిలో పెట్టుకుని హార్దిక్​ను ఇప్పటినుంచే టీ20 కెప్టెన్‌గా ప్రమోట్‌ చేయడం మంచిదేనని అభిప్రాయపడుతున్నారు. కాగా పాండ్య నేతృత్వంలోనే ప్రస్తుతం టీమ్​ఇండియా.. న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. వర్షం కారణంగా శుక్రవారం (నవంబర్‌ 18) జరగాల్సిన తొలి మ్యాచ్‌ పూర్తిగా రద్దైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.