ఆసీస్​కు బిగ్​ షాక్​.. రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్​ ఓపెనర్​!

author img

By

Published : Mar 10, 2023, 7:01 PM IST

australia opener shaun marsh announces his first class cricket retirement

ఆస్ట్రేలియా బ్యాటర్​ షాన్​ మార్ష్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్​ ప్రకటించాడు. కేవలం టీ20 క్రికెట్‌లో మాత్రమే కొనసాగనున్నాడు.

ఆస్ట్రేలియా వెటరన్‌ బ్యాటర్‌ షాన్‌ మార్ష్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌, అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇకపై అతడు కేవలం టీ20 క్రికెట్‌లో మాత్రమే కొనసాగనున్నాడు.
39 ఏళ్ల మార్ష్‌ 2001లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్​ అరంగేట్రం చేశాడు. 2022లో ప్రతిష్ఠాత్మక షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీని సారథిగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాకు మార్ష్‌ అందించాడు. లిస్ట్‌-ఎ కెరీర్‌లో 177 మ్యాచ్‌లు ఆడిన మార్ష్‌.. 44.45 సగటుతో 7158 పరుగులు చేశాడు. 26 ఏళ్ల ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ఎన్నో అద్భుత విజయాలను షాన్‌ అందించాడు.

మార్ష్‌ అంతర్జాతీయ కెరీర్‌ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తరఫున 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2019లోనే టెస్టు క్రికెట్‌కు మార్ష్‌ గుడ్‌బై చెప్పాడు. టెస్టుల్లో అతడు 32.32 సగటుతో 2265 పరుగులు సాధించాడు. అతడి టెస్టు కెరీర్‌లో 6 సెంచరీలు, 10 అర్ధ శతకాలు ఉన్నాయి. అదే విధంగా వన్డేల్లో 2773 పరుగులు, టీ20ల్లో కేవలం 255 పరుగులు మాత్రమే మార్ష్‌ చేశాడు. కాగా షాన్‌ మార్ష్‌ సోదరుడు మిచెల్‌ మార్ష్‌ ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు.

కొన్ని రోజుల క్రితం, ఆస్టేలియా స్టార్​ ప్లేయర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2020లో ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్ ముద్దాడటంలో ఫించ్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించాడు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు తాను ఆడలేనని గ్రహించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు.

"నేను 2024 టీ20 ప్రపంచకప్​లో ఆడలేనని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో రిటైర్ కావడానికంటే ఇప్పుడే రిటైరవ్వడం సరైన సమయమని భావించాను. తద్వారా జట్టుకు భవిష్యత్ నాయకుడిని తయారుచేసుకోవడానికి సమయం లభిస్తుంది. నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచినందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు, సహచరులకు, సహాయ సిబ్బందికి, నా కుటుంబానికి కృతజ్ఞతలు. అలాగే అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2020లో టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్ గెలవడం నా కెరీర్ లో అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి" అని ఫించ్ అన్నాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా.. భారత్​లో బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్​ ఆడుతోంది. తొలి రెండు టెస్టుల్లో టీమ్​ఇండియా విజయం సాధించగా.. ఆసీస్​ మూడో టెస్ట్​లో గెలుపొందింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య కీలకమైన నాలుగో టెస్టు గురువారం ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా ఆలౌట్​ అయ్యి 480 పరుగులు సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.