యాషెస్​ పిలుస్తోంది.. కదనోత్సాహంతో ఆసీస్-ఇంగ్లాండ్

author img

By

Published : Dec 7, 2021, 8:40 AM IST

Ashes

Ashes 2021 News: యాషెస్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య బుధవారం తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ సిరీస్​లో గెలుపు కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Ashes 2021 News: ప్రపంచంలోని రెండు అత్యుత్తమ టెస్టు జట్ల మధ్య.. సంప్రదాయ క్రికెట్‌ సమరానికి వేళైంది. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న టెస్టు పోరాటానికి మరోసారి రంగం సిద్ధమైంది. క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూసే యాషెస్‌ పోరు మొదలయ్యేది బుధవారమే. ఈ సారి బూడిద యుద్ధంలో బుల్లి కప్పును సొంతం చేసుకునేందుకు ఇరు జట్లు ఉరకలేస్తున్నాయి. ఇక సుదీర్ఘ ఫార్మాట్‌ను ఆస్వాదించే అభిమానులకు పండగే.

  • 1882-83లో మొదలైన ఈ యాషెస్‌ టెస్టు సిరీస్‌ సమరం ప్రతి రెండేళ్లకోసారి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతోంది. 2019లో ఇంగ్లాండ్‌ సిరీస్‌ నిర్వహించగా.. ఈ సారి ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం బ్రిస్బేన్‌, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీ, పెర్త్‌లో మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా కఠినమైన ఆంక్షలు విధించడం వల్ల చివరి టెస్టును పెర్త్‌లో నిర్వహించకూడదని నిర్ణయించారు. ఆ మ్యాచ్‌కు వేదికను ఇంకా ప్రకటించలేదు.
  • ఇప్పటి వరకూ యాషెస్‌ సిరీస్‌ల్లో భాగంగా రెండు జట్ల మధ్య 71 సిరీస్‌లు జరిగాయి. అందులో ఆస్ట్రేలియా 33, ఇంగ్లాండ్‌ 32 విజయాలు సాధించాయి. ఆరు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. ఈ సారి సిరీస్‌ నెగ్గి ఆస్ట్రేలియాను సమం చేయాలనే పట్టుదలతో రూట్‌ సేన ఉంది. మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే మొత్తం 335 టెస్టులు జరగ్గా.. కంగారూ జట్టు 136, ఇంగ్లాండ్‌ 108 చొప్పున గెలిచాయి. 91 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
  • ఈ సారి యాషెస్‌ను తిరిగి ఇంటికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇంగ్లాండ్‌ సిరీస్‌లో అడుగుపెడుతోంది. 2017-18లో సొంతగడ్డపై సిరీస్‌ నెగ్గిన ఆస్ట్రేలియానే డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా కొనసాగుతోంది. 2019లో ఇంగ్లీష్‌ గడ్డపై సిరీస్‌ డ్రా చేసుకోవడం వల్ల ట్రోఫీ ఆసీస్‌ దగ్గరే ఉంది. 2015 తర్వాత ఇంగ్లాండ్‌ ఈ సిరీస్‌ సొంతం చేసుకోలేదు. 2011 నుంచి ఆ జట్టు ఆసీస్‌లో విజయం సాధించలేదు.
  • కొత్త కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలో ఆస్ట్రేలియా బలంగానే కనిపిస్తోంది. ఈ సిరీస్‌కు ముందే సారథిగా ఉన్న పైన్‌.. గతంలో తన సహ మహిళా ఉద్యోగికి అసభ్యకర సందేశాలు పంపాడనే ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేశాడు. దీంతో కమిన్స్‌ పగ్గాలు అందుకున్నాడు. గబ్బాలో ఆరంభమయ్యే తొలి టెస్టులో వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌, స్టార్క్‌, కమిన్స్‌, లైయన్‌తో కూడిన ఆసీస్‌ పటిష్ఠంగా ఉంది. తొలి టెస్టులో ట్రేవిస్‌ హెడ్‌, స్టార్క్‌ ఆడతారని ఇప్పటికే కమిన్స్‌ స్పష్టం చేశాడు.
  • పేపర్‌ మీద ఇంగ్లాండ్‌ జట్టు బలంగానే కనిపిస్తున్నప్పటికీ ఆస్ట్రేలియాలో ఆ జట్టు రికార్డు ఏమంత గొప్పగా లేదు. పైగా కెప్టెన్‌ రూట్‌పైనే జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. అతని తర్వాత జట్టులో మరో నమ్మదగ్గ బ్యాటర్‌ కనిపించడం లేదు. బెయిర్‌ స్టో, బర్న్స్‌, బట్లర్‌, క్రాలీ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. కొంత కాలం విరామం తర్వాత అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ జట్టుతో చేరడం ఇంగ్లాండ్‌కు ఆనందాన్ని కలిగించే విషయమే. ఇక బౌలింగ్‌లో సీనియర్‌ పేస్‌ ద్వయం అండర్సన్‌, బ్రాడ్‌తో పాటు వోక్స్‌, మార్క్‌వుడ్‌ కీలకం కానున్నారు.

ఇవీ చూడండి: 'పేసర్​ అవ్వాలనుకున్నా.. కానీ స్పిన్నర్ అయ్యా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.