BCCI కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ ఎవరు?.. రేసులో ఇద్దరు మాజీలు!

author img

By

Published : Nov 20, 2022, 12:41 PM IST

bcci

కొత్తగా ఏర్పడబోయే బీసీసీఐ సెలక్షన్‌ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీసీసీఐ ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. చీఫ్‌ సెలెక్టర్‌ రేసులో ప్రముఖంగా ఇ‍ద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారు ఎవరంటే?

BCCI Chief Selector: టీ20 వరల్డ్‌కప్ 2022తోపాటు అంతకుముందు జరిగిన పలు మెగా టోర్నీల్లో టీమ్​ఇండియా వైఫల్యం చెందడంతో చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి ఛైర్మన్‌గా చేతన్‌ శర్మ ఉండగా, హర్విందర్‌ సింగ్‌ (సెంట్రల్‌ జోన్‌), సునీల్‌ జోషీ (సౌత్‌ జోన్‌), దేబశిష్ మొహంతి (ఈస్ట్‌ జోన్‌) సభ్యులుగా ఉన్నారు. వీరి పదవీ కాలం మరికొంత కాలం ఉన్నా.. బీసీసీఐ కమిటీని రద్దు చేసి, కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించింది.

ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే సెలక్షన్‌ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీసీసీఐ ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. చీఫ్‌ సెలక్టర్‌ పదవి రేసులో ప్రముఖంగా ఇ‍ద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. భారత మాజీ లెగ్‌ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌, మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ చీఫ్‌ సెలెక్టర్‌ పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

వీరిలో 2020లో దరఖాస్తు చేసుకున్న శివరామకృష్ణన్‌కు బీసీసీఐ బాస్‌ రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షాల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త చీఫ్‌ సెలెక్టర్‌గా శివరామకృష్ణన్‌ పేరు దాదాపుగా ఖరారైందని సమాచారం. రేసులో ఉన్న అజత్‌ అగార్కర్‌కు కూడా బోర్డులోని పలువురు ప్రముఖుల మద్దతు ఉండటంతో అతడి అభ్యర్ధిత్వాన్ని కూడా తీసివేయడానికి వీల్లేదని బీసీసీఐ వర్గాల సమాచారం.

సెలెక్షన్‌ కమిటీ సభ్యులకు ఉండాల్సిన అర్హతలు..

  • కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి
  • క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు ఐదేళ్లు పూర్తి అయ్యి ఉండాలి
  • ఐదుగురు సభ్యులకు వయసు పరిమితి 60 ఏళ్లులోపే ఉండాలి
  • 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.