ఎస్పీ బాలు స్ఫూర్తితో సరికొత్తగా 'పాడుతా తీయగా'.. నేడే ప్రారంభం

author img

By

Published : Dec 5, 2021, 6:52 AM IST

Updated : Dec 5, 2021, 7:02 AM IST

పాడుతా తీయగా నేడే ప్రారంభం, Paadutha Theeyaga program starts from today

Padutha Theeyaga 2021: ఎందరో గాయనీగాయకుల్ని వెలుగులోకి తీసుకొచ్చిన 'పాడుతా తీయగా' ప్రేక్షకుల్ని అలరించేందుకు సరికొత్తగా సిద్ధమైంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఆధ్వర్యంలో నేడు ప్రారంభంకానుంది. ఇకపై ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

Padutha Theeyaga 2021:

బాలుగారంటే.. ఒట్టి పాటలేనా?
కాదు... ఆయన ఓ ఆదర్శమూర్తి.
బాలు గారంటే... ఒట్టి గానమేనా?
కాదు... ఆయన ఓ స్ఫూర్తి కెరటం.
బాలు గారంటే... ఒట్టి సంగీతమేనా?

కాదు... లక్షల మంది గాయకులకు మార్గదర్శి.

అందుకే ఆయన స్ఫూర్తిని, ఆదర్శాలను కొనసాగిస్తూ... కొత్త కోయిలలకు మార్గం చూపడానికి మీ ముందుకొస్తోంది 'పాడుతా తీయగా'. ఇప్పటికే ఎంతోమంది గాయనీగాయకులను తయారుచేసి తెలుగు ప్రేక్షక లోకానికి అందించిన ఈ కార్యక్రమం పునఃప్రారంభమవనుంది.

ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 'ఈటీవీ'లో 'పాడుతాతీయగా' కార్యక్రమం ప్రసారం కానుంది.

దీన్ని గానగంధర్వుడి కుమారుడు ఎస్పీ చరణ్‌ నిర్వహిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌, గాయని సునీత, గాయకుడు విజయ్‌ ప్రకాశ్‌ ఇందులో న్యాయనిర్ణేతలుగా ఉండి... కొత్త వారి ప్రతిభను ప్రోత్సహించనున్నారు.

మొదట ఆలోచించా..!

నాన్న(బాలు)గారు 'పాడుతాతీయగా' కార్యక్రమాన్ని ఎంత స్వచ్ఛంగా, బాధ్యతగా, హుందాగా నిర్వహించారో ప్రేక్షకులకు తెలుసు. మరి ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి నేను ఎంత వరకూ న్యాయం చేయగలను? అని తొలుత ఆలోచించా. పాటల గురించి, తన అనుభవాల గురించి వివరిస్తూ... ప్రేక్షకులను ఉత్సాహ పరిచడమే కాదు.. వారిలో చైతన్యం తీసుకొచ్చేవారు. ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలు చెప్పేవారు. అలా నేను చేయగలనా? అని ప్రశ్నించుకున్నా. ‘మీరే ఈ కార్యక్రమం చేయాలని’ ఈటీవీ వారు అన్నారు. అమ్మ ప్రోత్సహించారు. అలా మీముందుకు వస్తున్నా. ఆయనలా మేమే కాదు.. ఎవ్వరూ చేయలేరు. అయితే ఈ కార్యక్రమం ద్వారా వందలమంది గాయకులను తయారు చేయవచ్చు. నాన్నగారు అందించిన స్ఫూర్తి కొనసాగించవచ్చుననే ఉద్దేశంతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1గంట వరకూ ఈటీవీలో ‘పాడుతాతీయగా’ ప్రసారం కానుంది. నాతో పాటు, నూతన గాయనీ, గాయకులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.

- ఎస్పీ చరణ్‌

కా'పాడతా'తీయగా అని దీవిస్తున్నారు

నేను 'తాజ్‌మహల్‌' చిత్రంలో రాసిన తొలిపాట... 'మంచుకొండల్లోన చంద్రమా...' బాలు గాత్రంలోనే వినిపించింది. అప్పటి నుంచి నిన్నమొన్నటి వరకూ... పాటల విషయంలో ఆయన ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఆయనతో అనుబంధం ఒక అద్భుతం. అలాంటి మహాగాయకుడు నిర్వహించిన 'పాడుతా తీయగా' కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బృందంలో నాకు అవకాశం రావడం గర్వకారణం. ఈటీవీ వారికి మనసారా కృతజ్ఞతలు. బాలుగారు ఒక నదిలాంటి మనిషి.. ఆ నదీ ప్రవాహం ప్రేక్షక హృదయ సంద్రంలో పాటై కలిసేది. మేమంతా ఆయన ప్రోత్సాహంతో పుట్టుకొచ్చిన నదీపాయలం. మేం ప్రేక్షక మదిని చేరడానికి ప్రయత్నం చేస్తాం. నిజాయతీగా మేం ‘‘పాడుతాతీయగా’ కార్యక్రమం చేస్తుంటే..బాలుగారు మమ్మల్ని కాపాడతా తీయగా అని దీవిస్తున్నారనిపిస్తోంది. ఈ ప్రోగ్రాం మిమ్మల్ని మెప్పిస్తుంది.

- చంద్రబోస్‌, గీత రచయిత

ఆయన ఆశీస్సులతోనే..

బాలుగారితో కలిసి ఈ కార్యక్రమానికి అప్పుడప్పుడూ అతిథిగా వచ్చాను. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వారిలో నేను ఒకరిని కావడం.. అదృష్టంగా భావిస్తా. ఆయన ఇప్పటికే మా పక్కనే ఉండి నడిపిస్తున్నారని అనిపిస్తుంటుంది. ఎంతోమంది గాయకులను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ‘పాడుతాతీయగా’ కార్యక్రమానికిది. బాలు గారు ఎన్నో పాటలు పాడారు. అయినా ఎక్కడికైనా విదేశాలకు వెళ్లినప్పుడు.. ఆయనను ‘పాడుతాతీయగా’ బాలుగారు అని పిలిచేవారు. ఆయన జీవితంలో ఇది భాగమైపోయింది. అంతటి మంచి ప్రోగ్రాంను మళ్లీ మీముందుకు తెస్తున్నాం. ఎంతోమందిని కొత్త గాయకులను మీరు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాం.

- సునీత, గాయని

ఇదో వరం

స్పీబీ గారు నాకు ఇచ్చిన వరం ఇది. ఆయన ఆశీర్వాదంతోనే మేం దీన్ని కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమానికి 4000 దరఖాస్తులు వచ్చాయి. అందులో 300 మందిని పరిశీలనకు తీసుకున్నారు. వారిలో 50 మందికి పోటీలు పెట్టి... తుదిగా 16మందిని ఎంపిక చేసుకున్నాం. వారు ఆదివారం 12గంటల నుంచి మీ ముందు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. కార్యక్రమం ఎంతో బాగా వచ్చింది. మీ ఆశీస్సులు వారందరికీ ఉంటాయని ఆశిస్తున్నాం.

- విజయ్‌ ప్రకాశ్‌

ఇదీ చూడండి: బాలయ్య-మహేశ్​బాబు 'అన్​స్టాపబుల్​'.. ఫ్యాన్స్​కు పండగే!

Last Updated :Dec 5, 2021, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.