సరికొత్తగా 'పాడుతా తీయగా'.. డిసెంబరు 5న ప్రారంభం

author img

By

Published : Nov 28, 2021, 6:26 PM IST

Updated : Nov 28, 2021, 7:09 PM IST

పాడుతా తీయగా షురూ, padutha theeyaga program starts

padutha theeyaga 2021: తెలుగు పాటకు పట్టాభిషేకం చేసి తెలుగు సినీ సంగీత ప్రపంచానికి ఎంతో మంది యువ గాయనీ గాయకులను అందించిన కార్యక్రమం 'పాడుతా తీయగా'. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగింటి ఛానల్ ఈటీవీలో సుదీర్ఘ కాలంగా కొనసాగిన ఈ పాటల పోటీకి ఆయన అకాల మరణంతో చిన్న విరామం వచ్చింది. ఒక తరానికో రెండు తరాలకో పాడుతా తీయగా ఆగిపోకూడదు. నిరంతరం జీవనదిలా సాగిపోవాలన్న ఎస్పీబీ ఆకాంక్షను గుర్తుచేసుకుంటూ డిసెంబర్‌ 5 నుంచి పాడుతా తీయగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

padutha theeyaga latest episode 2021: 'పాడుతా తీయగా' దక్షిణ భారతదేశంలోనే తొలి సంగీత ఆధారిత రియాల్టీ షో. సంగీత ప్రపంచానికి సరికొత్త గళాలను పరిచయం చేసిన వేదిక. దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సుమారు 18 ఏళ్లు నిర్విఘ్నంగా కొనసాగిన పాడుతా తీయగా.. సంగీతాభిమానులకు వరంగా దొరికింది. ఎంతోమంది గాయనీ గాయకులను తెలుగు సినీ పరిశ్రమకు అందించింది. ఈ క్రమంలో ఎస్పీబీ అకాల మరణంతో పాడుతా తీయగా కార్యక్రమం చిన్న విరామం తీసుకుంది.

ఎస్పీబీ కలను, ఆయన ఆకాంక్షను కొనసాగించాలన్న ఉద్దేశంతో పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఈటీవీ మళ్లీ మొదలుపెట్టింది. ఎస్పీబీ తనయుడు చరణ్ వ్యాఖ్యాతగా... 'పాడుతా తీయగా' సరికొత్తగా ముస్తాబై సంగీత అభిమానులను పలకరించబోతుంది. డిసెంబర్ 5 నుంచి ప్రతి ఆదివారం ఈటీవీలో మధ్యాహ్నాం 12 గంటల నుంచి 1 గంట వరకు పాడుతా తీయగా ప్రసారం కానుంది. హైదరాబాద్ సారథి స్టూడియోలో ఎస్పీబీ తనయుడు చరణ్, గాయనీ గాయకులు సునీత, విజయప్రకాశ్, గేయ రచయిత చంద్రబోస్ పాడుతా తీయగా కార్యక్రమంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎస్పీబీ ఆకాంక్షను నెరవేరుస్తున్న ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు పాట కమ్మదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన పాడుతా తీయగా కార్యక్రమంలో మళ్లీ భాగస్వాములు కావడం అదృష్టంగా ఉందన్నారు. ఎస్పీబీ కలను నెరవేర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. బాల సుబ్రహ్మణ్యం ఊపిరైన పాడుతా తీయగా నిరంతరంగా కొనసాగిస్తామన్నారు.

సరికొత్తగా 'పాడుతా తీయగా'.. డిసెంబరు 5న ప్రారంభం

4వేలకుపైగా యువతీ యువకులు

స్వరఝరిలో సరికొత్త హంగులు అద్దుకొని ప్రేక్షకుల ముందుకొస్తున్న పాడుతా తీయగా పోటీలో తమ గళాలను వినిపించేందుకు నలుమూలల నుంచి 4 వేలకుపైగా ఔత్సాహిక యువతీ యువకులు వచ్చారు. వారిలో నుంచి 16 మందిని ఎంపిక చేసిన పాడుతా తీయగా బృందం తుది విజేత కోసం ఇప్పటికే పోటీని ప్రారంభించింది.

ఇదీచూడండి: త్వరలో జనంలోకి బాలు మానస పుత్రిక 'పాడుతా తీయగా'

Last Updated :Nov 28, 2021, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.