Akhanda Producer: 'సినిమా 'అఖండ' విజయమని ముందే చెప్పేశా'

author img

By

Published : Dec 29, 2021, 7:31 AM IST

AKhanda

Akhanda Producer: దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ కాంబినేషన్​లో తెరకెక్కిన 'అఖండ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్​గా నిలిచింది. అయితే.. ఈ సినిమా విజయంపై తనకు ముందుగానే నమ్మకం ఉందని చెబుతున్నారు చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్​ రెడ్డి. మంగళవారం.. విలేకర్ల సమావేశంలో సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు.

Akhanda Producer: "అడ్వాన్స్‌లు ఇచ్చి ముందే హీరోల్ని బుక్‌ చేసుకోవడం నాకు తెలియదు. ఏదేమైనా సరే.. ముందు కథ వినాలి. నచ్చితే అదెవరికి సరిపోతుందో ఆ హీరోను ఒప్పించి సినిమా చేయాలనుకుంటా" అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి. ఇప్పుడాయన నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా రూపొందించిన చిత్రం 'అఖండ'. బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఇటీవలే విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. బుధవారం మిర్యాల రవీందర్‌ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

"అఖండ' ఫలితం సంతృప్తినిచ్చిందా? ఇంతటి విజయాన్ని ఊహించారా?

"2018లో నాకు తొలిసారి దర్శకుడు బోయపాటి ఈ కథ చెప్పారు. అది విన్నప్పుడే ఇదెంత మార్కెట్‌ చేస్తుందన్నది ముందే రాసిచ్చేశా. సినిమా విజయం పట్ల నాకంత నమ్మకం. ఆ నమ్మకం వల్లే విడుదల విషయంలో కాస్త ఆలస్యమైనా భయపడలేదు. సినిమా విడుదలకు ముందు హీరో, దర్శకుడు ఎక్కడా మాట్లాడలేదు. నేను విడుదలకు ముందు నుంచే దీనిపై నమ్మకంగా మాట్లాడుతూ వచ్చాను. ఎందుకంటే ఈ చిత్రంలో అన్ని ఎమోషన్స్‌ సమంగా కుదిరాయి. బాలకృష్ణ అభిమానులకు కావాల్సిన మాస్‌ పాట ఉంది. వీటన్నింటికీ తోడు శివుడి అంశగా ద్వితీయార్ధంలో వచ్చే బాలకృష్ణ అఘోరా పాత్ర మరో ఆకర్షణ. ఇవన్నీ మేమనుకున్నట్లుగానే ప్రేక్షకులకు బాగా ఎక్కేశాయి".

AKhanda producer
అఖండ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి

ఈ చిత్రానికి ముందు ఇటు బాలకృష్ణ, అటు బోయపాటి హిట్‌ ట్రాక్‌లో లేరు కదా. ఆ విషయంలో ఏమన్నా భయపడ్డారా?

"అసలెప్పుడూ ఆ ఆలోచన రాలేదు. పెద్ద దర్శకుడు, స్టార్‌ హీరో అన్నది రేర్‌ కాంబినేషన్‌. వాళ్లపై నమ్మకంతోనే ఈ చిత్రం చేశాను. నాకు తెలిసి స్టార్‌ హీరోలకు వరుసగా పది ప్లాప్‌లు వచ్చినా.. ఒక్క హిట్‌ పడితే చాలు ఆ పది చిత్రాలకు ముందున్న మార్కెట్‌ వచ్చేస్తుంది".

Akhanda Movie Collections:

ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ 'అఖండ' వందకోట్ల క్లబ్‌లోకి చేరింది. అన్ని చోట్లా బ్రేక్‌ ఈవెన్‌ దాటేశారా?

"ఈ చిత్ర విషయంలో అన్ని ఏరియాలు బ్రేక్‌ ఈవెన్‌ అయ్యాయి. సినిమా ఓ విజువల్‌ వండర్‌లా వచ్చింది కాబట్టి.. ఎలాంటి పరిస్థితుల్లో విడుదల చేసినా ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందని తెలుసు. నాలుగు రోజుల్లోనే బయ్యర్స్‌ అంతా బయటపడతారని ముందే ఊహించా. ఇప్పుడిందుకు తగ్గట్లుగానే మా అంచనాలు నిజమయ్యాయి".

ఏపీలోని టికెట్‌ ధరల వల్ల వసూళ్లు ఎంత శాతం తగ్గాయనుకుంటున్నారు?

"ఈ చిత్ర విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం మాకు కొంత సపోర్ట్‌ చేసింది. నిజానికి ఆ సమయంలో మాకు చాలా భయాలుండేవి. పెద్ద చిత్రాలకు ఈ రేట్లు వర్కవుటవుతాయా? అసలు ఈ కరోనా భయాల మధ్య ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనుకున్నాం. కానీ, టికెట్‌ రేట్ల విషయంలో మా చిత్రాన్ని చూసీ చూడనట్లు వదిలేశారు. ఫలితంగా మంచి వసూళ్లొచ్చాయి. ఒకవేళ పరిస్థితులు మునుపటిలా ఉండుంటే ఇంతకు రెట్టింపు వసూళ్లు వచ్చుండేవి. త్వరలోనే అన్ని సమస్యలు తొలగిపోతాయని ఆశిస్తున్నాం".

Akhanda Sequel News:

'అఖండ' సీక్వెల్‌? హిందీ రీమేక్‌ ఆలోచనలున్నాయా? కొత్తగా ప్రాజెక్టులేంటి?

"అఖండ'కు సీక్వెల్‌ తీయాలనే కోరిక నాకూ ఉంది. కానీ, కథ కుదరాలి కదా. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది విశ్వజనీనమైన కథ. పైగా వారణాసి నేపథ్యం ఉంది. కాబట్టి అక్కడి వాళ్లకు త్వరగా కనెక్ట్‌ అవుతుంది. ఇలాంటి పాత్రలకు హిందీలో అజయ్‌ దేవగణ్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి హీరోలు బాగుంటారు. ప్రస్తుతానికైతే హిందీ రీమేక్‌ రైట్స్‌ ఎవరికీ అమ్మలేదు. కొన్ని నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు నాకు తెలిసింది. వచ్చే ఏడాది మార్చిలో ఓ కొత్త చిత్రం ప్రారంభిస్తాం. ఆ సినిమాతో ఓ కొత్త హీరోను పరిచయం చేస్తాం. దర్శకుడెవరన్నది త్వరలో తెలియజేస్తాం. అలాగే ఓ పెద్ద చిత్రం చర్చల దశలో ఉంది. దాన్నీ త్వరలో ప్రకటిస్తా".

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థపై మీ అభిప్రాయమేంటి?

"ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం తీసుకురావాలని ఇండస్ట్రీలోని నిర్మాతలు, దర్శకులు, హీరోలే చెప్పారని ప్రభుత్వం చెబుతోంది. దానికి పరిశ్రమ మొత్తం సపోర్ట్‌ చేస్తోంది. నిజానికి దీని వల్ల మాకైతే ఏ ఇబ్బంది లేదు. వసూళ్ల విషయంలోనూ మరింత స్పష్టత వస్తుందని.. పారదర్శకత ఉంటుందని నిర్మాతలు ఒప్పుకొంటున్నారు".

ఇదీ చదవండి:

బోయపాటి ఏ సినిమాకూ పూర్తి కథ చెప్పలేదు: బాలకృష్ణ

బాక్సాఫీస్​పై బాలయ్య సింహగర్జన.. 'అఖండ' @రూ.100కోట్లు!

'ఇంటర్​స్టెల్లార్' కబుర్లు చెప్పకమ్మా.. సుకుమార్​తో బాలయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.