ఆ రోజులు గుర్తొచ్చాయి: శ్రీకాంత్

author img

By

Published : Oct 1, 2021, 6:38 AM IST

Actor srikanth

నటుడు శ్రీకాంత్ తన కొత్త సినిమా విశేషాలు చెప్పారు. తనయుడు రోషన్(srikanth son), రాఘవేంద్రరావు చేతుల మీదుగా పరిచయమవుతుండటం ఆనందంగా ఉందని అన్నారు. బాలయ్య, రామ్​చరణ్​ సినిమాల్లో విలన్​గా నటిస్తున్నానని చెప్పారు.

"జీవితం అంటే ఏంటి? మన కలలను సాకారం చేసుకునేందుకు ఏం చేయాలి? లక్ష్యాలను సాధించేందుకు ఎంతలా కష్టపడాలి? అన్నదే 'ఇదే మా కథ'లోని(idhe maa katha review) సందేశం" అని అన్నారు నటుడు శ్రీకాంత్‌. ఆయన సుమంత్‌ అశ్విన్‌, తాన్య హోప్‌, భూమికలతో కలిసి నటించిన చిత్రమిది. గురు పవన్‌ దర్శకుడు. మహేష్‌ గొల్లా నిర్మాత. ఈ సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

Actor srikanth
శ్రీకాంత్

"దర్శకుడు గురు ఓ రోజు వచ్చి నాకు ఈ కథ చెప్పాడు. ఇందులో ఆయన నిజ జీవితంలో చూసిన కొన్ని సంఘటనలూ ఉన్నాయి. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన నలుగురు బైక్‌ ట్రావెలర్స్‌ కలిసి.. హైదరాబాద్‌ నుంచి లద్దాఖ్‌ వరకు చేసే ప్రయాణమే ఈ కథాంశం. ఇలా సుదీర్ఘ రోడ్డు ప్రయాణ నేపథ్యమే నన్ను చాలా ఆకర్షించింది. నేనిందులో మహేంద్ర అనే పాత్రలో కనిపిస్తా. 24ఏళ్ల క్రితం మిస్‌ అయిన ప్రేమించిన అమ్మాయిని కలుసుకునేందుకు బైక్‌పై లద్దాఖ్‌కు బయల్దేరుతా. నేనలా వెళ్లడానికి వెనక మరో ఆసక్తికరమైన కారణమూ ఉంటుంది. అదేంటన్నది తెరపైనే చూడాలి".

అదే సవాల్‌గా అనిపించింది...

"భూమిక ఓ గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తుంది. సుమంత్‌ అశ్విన్‌ బైక్‌ రేసింగ్‌లంటే ఇష్టపడే కుర్రాడిగా కనిపిస్తాడు. తనకూ ఓ లక్ష్యం ఉంటుంది. దానికోసమే బయల్దేరుతాడు. ఇలా విభిన్న లక్ష్యాలతో మొదలైన మా ప్రయాణాలు ఎలా కలిశాయి? ఆ తర్వాత మాతో తాన్య ఎందుకు కలిసింది? అందరం కలిసి మా లక్ష్యాలను ఎలా చేరుకున్నామన్నది ఆసక్తికరంగా ఉంటుంది".

idhe maa katha movie
ఇదే మా కథ మూవీలో శ్రీకాంత్

అది రోషన్‌ అదృష్టం..

"రాఘవేంద్రరావు(raghavendra rao new movie) చేతుల మీదుగా 'పెళ్లి సందడి' చిత్రంతో నా తనయుడు రోషన్‌(srikanth son) హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా ఎంతో మంది పెద్ద హీరోలు పరిచయమయ్యారు. ఇప్పుడా అవకాశం రోషన్‌కు రావడం వాడి అదృష్టం. ఇప్పుడొస్తున్న జానర్లకంటే కొత్తగా ఉంటుందీ చిత్రం. పెళ్లిలో ఉండే గోల, ఆ సందడి, అన్నీ ఉంటాయి. 'ఎఫ్‌2' ఎంత ఫ్రెష్‌గా అనిపించిందో.. 'పెళ్లి సందడి’' అంతేఫ్రెష్‌గా ఉంటుంది".

'అఖండ'లో ఇలా...

"ప్రస్తుతం బాలకృష్ణ 'అఖండ'(balakrishna akhanda), రామ్‌చరణ్‌, శంకర్‌ కలయికలో వస్తోన్న చిత్రంలో విలన్‌గా నటిస్తున్నా. 'అఖండ'లో నా లుక్‌ కోసం బోయపాటి ముంబయి నుంచి ప్రత్యేకంగా డిజైనర్లను తీసుకొచ్చారు. అత్యంత క్రూరంగా కనిపిస్తా. ఆ లుక్‌ చూసుకున్నాక.. మహిళా ప్రేక్షకులు నన్ను తిడతారేమో అనుకునేవాణ్ని. చిత్ర బృందం నా లుక్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందనేది నాకూ తెలియదు. నిజానికి ఈ సినిమాలో విలన్‌గా చేయడానికి ముందు చాలా ఆలోచించా. ఎందుకంటే 'శ్రీరామరాజ్యం'లో లక్ష్మణుడిగా బాలకృష్ణ పక్కన చేశాను. ఇప్పుడాయన పక్కన ఇంత క్రూరమైన పాత్రలో కనిపిస్తే బాగుంటుందా? అనుకున్నా. ఇదే విషయాన్ని బాలయ్య బాబుతో చెప్తే.. 'ఇలాంటి పాత్రలే చెయ్యాలి' అన్నారు. దీని తర్వాత చాలా పాత్రలొస్తాయి.. ఏది పడితే అది చేయకని సలహా ఇచ్చారు".

RAM CHARAN SRIKANTH
రామ్​చరణ్-శంకర్ సినిమా

మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పైనే..

"నేను బైక్‌ రైడింగ్‌లను చాలా ఇష్టపడతా. చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో ఎక్కువగా బైక్‌ పైనే తిరుగుతుండే వాణ్ని. షూటింగ్‌ల కోసం మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వచ్చిన రోజులూ ఉన్నాయి. ఇక బాధ్యతలు పెరుగుతున్న సమయంలో నా భద్రతను దృష్టిలో పెట్టుకుని బండి వాడకాన్ని తగ్గించేశా. అయితే ఈ సినిమాతో మళ్లీ ఇలా బైక్‌ రైడింగ్‌ చేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. పాత రోజులన్నీ కళ్ల ముందు మెదిలాయి. దర్శకుడు కొత్త వాడైనా.. మంచి అనుభవజ్ఞుడిలా సినిమా తెరకెక్కించాడు"

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.