స్మార్ట్​ఫోన్​లో ర్యామ్​, ప్రాసెసర్​ల పాత్ర ఏంటి?

author img

By

Published : Sep 12, 2021, 10:04 AM IST

RAM

స్మార్ట్​ఫోన్ కొనేముందు కెమెరా, ఫోన్​ సైజు వంటి బయటికి కనిపించే ఫీచర్లతో పాటు ర్యామ్​, ప్రాసెసర్, ఇంటర్నల్ మెమోరీ వంటి ఫీచర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంతకి ఫోన్​లో వీటి పాత్ర ఏమిటి? వీటికి అంత ప్రాధాన్యం ఎందుకు ఉంటుంది?

ఒకప్పుడు స్మార్ట్​ఫోన్ల ధరలు ఎక్కువ ఉండేవి. ఫీచర్లు మాత్రం చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఫీచర్లు బాగా పెరగటం సహా.. ధర తగ్గటం మొదలైంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో అనేక మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. రోజు రోజుకు సరికొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో కొనుగోలు చేసే సమయంలో కెమెరా, ఫోన్ సైజు లాంటి వాటితో పాటు ర్యామ్, ప్రాసెసర్, ఇంటర్నల్ మెమోరీ వంటి వాటి గురించి తెలుసుకోవటం సర్వ సాధారణమైంది. మరి ఇంతకీ ఫోన్​లో ర్యామ్​, ప్రాసెసర్​ల పాత్ర ఏమిటి? వాటిని ఎందుకు అంత కీలకంగా పరిగణిస్తుంటారు?

ఫోన్​లో ర్యామ్, ప్రాసెసర్, ఇంటర్నల్ మెమోరీ అనేవి చాలా కీలకమైనవి. ఇవి మొత్తంగా ఫోన్ పనితీరును ప్రభావితం చేస్తుంటాయి. మంచి ప్రాసెసర్, సరిపడా ర్యామ్, ఇంటర్నల్ మెమోరీ ఉన్నట్లయితే ఫోన్ పనితీరు​ మెరుగవుతుంది.

ర్యామ్

ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ. ఇది కూడా ఒక రకమైన మెమోరీనే. యాప్​లు సరిగ్గా పనిచేయటం సహా మల్టీ టాస్కింగ్​కు ఇది కీలకం. యాప్​లు నడిచే సమయంలో తాత్కాలిక ఫైల్స్ అన్ని ఈ మెమోరీలోనే ఉంటాయి. ర్యామ్​లో డేటాను యాప్​లు వేగంగా ఉపయోగించుకుంటాయి.

మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ యాప్​లు ఉపయోగించుకోవటం. ఒక్కో యాప్ రన్నింగ్​లో ఉన్నప్పుడు కొంత ర్యామ్​ను వాడుకుంటుంది. ర్యామ్ తక్కువున్నట్లయితే ఎక్కువ యాప్​లు ఉపయోగిస్తున్న సమయంలో అన్నింటి కంటే ముందున్న యాప్ క్లోజ్ అయిపోతుంది. దీని వల్ల మల్టీ టాస్కింగ్ కష్టం అవుతుంది.

కొన్ని యాప్​లకు ఎక్కువ ర్యామ్ అవసరం ఉంటుంది. గేమ్స్ లాంటి వాటికైతే మరీ ఎక్కువ ర్యామ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ర్యామ్ ఉన్న ఫోన్ల మంచి ప్రదర్శన కనబరుస్తాయి. మల్టీ టాస్కింగ్​ కూడా చేస్కోవచ్చు.

ఓఎస్, సిస్టమ్​లో ఉన్న ఇన్​బిల్ట్ యాప్​లు నడిచేందుకు కూడా ర్యామ్ కావాలి. అందుకే కొంత ర్యామ్ ఎప్పుడూ ఉపయోగంలోనే ఉంటుంది. ఫోన్ షట్​డౌన్ చేయగానే ఇందులోని మెమోరీ డిలీట్ అయిపోతుంది. అంతేకాకుండా ర్యామ్​లో కొంత మొత్తాన్ని ఓఎస్ ఉపయోగించుకుంటుంది.

ప్రాసెసర్

ప్రాసెసర్, ర్యామ్, మెమోరీని కలిపి మానవుని మెదడుతో పోల్చవచ్చు. అన్నింటికంటే ఫోన్​లో ప్రాసెసర్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఫోన్ స్పీడ్​కు సంబంధించినది. ఎంత వేగంగా ఒక యాప్ ఓపెన్ అవుతుంది, ఎంత త్వరగా ఒక ప్రక్రియ పూర్తవుతుందన్నది ప్రాసెసర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రాసెసర్ వేగాన్ని గిగాహెర్ట్జ్​​లలో కొలుస్తారు. ఇది ఎక్కువగా ఉన్న ఫోన్లలో మంచి ప్రదర్శన ఉంటుంది.

గిగాహెర్ట్జ్​ ఎక్కువగా ఉన్న ప్రాసెసర్లతో పాటు వాటిలోని కోర్​ల సంఖ్య కూడా చాలా ముఖ్యమైనది. కోర్ అంటే ఒక ప్రాసెసర్ అనుకోవచ్చు. ఒక్కో ప్రాసెసర్​పైన ఇంకో ప్రాసెసర్ అమర్చటమే కోర్ వ్యవస్థ. ఒక్క ప్రక్రియ ప్రాసెసర్​కు అందినప్పుడు.. అది మల్టీపుల్ కోర్​ల మధ్య విభజన జరిగిన త్వరగా పూర్తవుతుంది. దీనివల్ల ప్రాసెసింగ్ వేగం పెరుగుతుంది.

ఉదాహరణకు 4 కోర్ ప్రాసెసర్ అంటే.. ఒక ప్రాసెసర్​లోనే నాలుగు లేయర్ల ప్రాసెసర్లు ఉంటాయన్నట్లు. 3 గిగాహెర్ట్జ్​ సింగిల్ కోర్ ప్రాసెసర్ కంటే 3 కోర్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ వేగం ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ కోర్​లతో ఎక్కువ స్పీడ్ ఉన్న ప్రాసెసర్​ను ఎంచుకోవటం వల్ల ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మంచి అనుభూతి పొందవచ్చు. కొన్ని యాప్​లకు ఎక్కువ వేగం ఉన్న ప్రాసెసర్ అవసరం ఉంటుందనేది కూడా గుర్తుంచుకోవాలి.

సాధారణంగా ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఫోన్లలో సింగిల్ కోర్ ప్రాసెసర్లు అసలు లేవు. స్మార్ట్​ఫోన్ల విషయంలో ప్రధానంగా స్నాప్ డ్రాగన్, మీడియా టెక్​లు ఎక్కువ కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. శాంసంగ్​ కంపెనీ సొంతంగా ప్రాసెసర్లను అభివృద్ధి చేసుకుంది.

ఇంటర్నల్ మెమోరీ

ఫోన్​యాప్​లు ఇంటర్నల్ మెమోరీలోనే ఇన్​స్టాల్ అవుతాయి కాబట్టి ఇది ఎంత ఎక్కువగా ఉంటే అన్ని ఎక్కువ యాప్స్​ను ఇన్​స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని యాప్​లు ఎక్స్​టర్నల్ మెమోరీలో కూడా ఇన్​స్టాల్ అయినప్పటికీ అన్ని యాప్​లు దీన్ని సపోర్ట్ చేయవు. యాప్​లు నడిచే సమయంలో క్యాషే కూడా స్టోర్​ అవుతుంది. ఇది కూడా ఇంటర్నల్ మెమోరీపైనే ఆధారపడి ఉంటుంది.

ఇంటర్నల్ మెమోరీ ఎక్కువగా ఉన్న ఫోన్​ను ఎలాంటి సమస్య లేకుండా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం 64 జీబీ, 128 జీబీ ఇంటర్నల్ మెమోరీతో కూడిన ఫోన్లు ఎక్కువగా మార్కెట్లో ఉన్నాయి. కొన్ని ఫోన్లలో 256జీబీ అంతకంటే ఎక్కువ మెమోరీ కూడా ఉంటుంది.

కేవలం యాప్​లకు సంబంధించి మాత్రమే కాకుండా.. ఫోన్​లో ఫోటోలు, వీడియోలు, ఆడియోల దాచుకునేందుకు కూడా ఇంటర్నల్ మెమోరీ అవసరం. ప్రస్తుతం ఫోన్ కెమెరాలు ఎక్కువ పిక్సల్ వస్తుండటంతో ఎక్కువ మెమోరీ ఉన్న ఫోన్లు అవసరం అవుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.