పాస్​వర్డ్​లకు ఇక గుడ్​బై! సరికొత్త 'లాగిన్' దిశగా గూగుల్, యాపిల్!!

author img

By

Published : May 9, 2022, 11:31 AM IST

passwordless login

ఆఫీస్​ మెయిల్, పర్సనల్ మెయిల్, గూగుల్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా అన్నింటికీ పాస్​వర్డ్స్​ గుర్తుంచుకోవడం కష్టం. అన్ని అకౌంట్స్​కు ఒకటే పాస్​వర్డ్​ వాడదామంటే హ్యాకింగ్ భయం. అసలు పాస్​వర్డ్​ లేకుండానే ఆయా అకౌంట్స్​లోకి లాగిన్​ అయ్యే వీలుంటే? అది కూడా సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా! బాగుంటుంది కదూ!! అందుకే గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్​ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

Passwordless login: "పాస్​వర్డ్స్​తో పెద్ద తలనొప్పి.. 81శాతం హ్యాకింగ్, డేటా చౌర్యం కేసులకు పాస్​వర్డ్​లు సరిగా లేకపోవడమే మూల కారణం. రిస్క్ అని తెలిసినా 65శాతం మంది ఒకే పాస్​వర్డ్​ను ఒకటికన్నా ఎక్కువ వెబ్​సైట్లకు ఉపయోగిస్తున్నారు"... సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఓ నివేదికలోని ముఖ్యాంశాలివి.

పాస్​వర్డ్​లను గుర్తు పెట్టుకోవడంలో సమస్యలు, అవి సరిగా లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలను తీవ్రంగా పరిగణించాయి దిగ్గజ టెక్ సంస్థలు. 'పాస్​వర్డ్​లెస్ అథెంటికేషన్​' విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్​లైన్(ఫిడో)​ అలయన్స్​ ఆధ్వర్యంలో గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్​ ఇందుకోసం కలిసి పనిచేస్తున్నాయి.

FIDO alliance: ఫిడో అనేది.. టెక్​ సంస్థలు కలిసి 2013లో ఏర్పాటు చేసుకున్న కూటమి. పాస్​వర్డ్​లపై ఆధారపడడాన్ని తగ్గించేలా సరికొత్త లాగిన్ విధానం అభివృద్ధి చేయడమే ఆ కూటమి లక్ష్యం. ఇప్పుడు రాబోతున్న పాస్​వర్డ్​లెస్​ అథెంటికేషన్​ పద్ధతిని ఫిడో పూర్తిస్థాయిలో పరిశీలించి, ఓకే చెప్పడం తప్పనిసరి.

పాస్​వర్డ్​ లేకుండా లాగిన్ ఎలా?:
ప్రస్తుతం ఏదైనా అకౌంట్​లోకి లాగిన్ కావాలంటే ఆల్ఫాన్యూమరిక్ పాస్​వర్డ్స్​ ఎంటర్ చేస్తున్నాం. కొందరు బాగా గుర్తుంటాయని పుట్టిన తేదీలు, పెంపుడు జంతువుల పేర్లనే ఎక్కువగా పాస్​వర్డ్స్​గా పెడుతున్నారు. ఇవే హ్యాకర్ల పనిని సులువుగా మార్చుతున్నాయి. అయితే.. కొత్త విధానంలో అసలు పాస్​వర్డ్ ఉండదు. 2-ఫ్యాక్టర్​ అథెంటికేషన్ ద్వారా స్మార్ట్​ఫోన్​ లేదా ఇతర డివైస్​తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని "పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ" అంటారు.

ఎలా పని చేస్తుంది?:
ఉదాహరణకు.. మీరు ఓ వెబ్​సైట్​లో ఖాతా తెరవాలని అనుకున్నారు. మీ పేరు, ఇతర వివరాలు ఇచ్చి రిజిస్టర్​ కాగానే.. రెండు 'కీ'స్​ జనరేట్​ అవుతాయి. ఒకటి ప్రైవేట్ కీ, మరొకటి పబ్లిక్ కీ. ప్రైవేట్​ కీ(రెండు సుదీర్ఘమైన ప్రైమ్​ నంబర్స్​ కలయిక) మీ స్మార్ట్​ఫోన్​లో ఉంటుంది. పబ్లిక్ కీ(పైన చెప్పిన రెండు సంఖ్యల్ని మల్టిప్లై చేస్తే వచ్చే నంబర్​) వెబ్​సైట్ దగ్గర ఉంటుంది.
అయితే.. మీకు ఆ నంబర్లేవీ కనిపించవు. వాటిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు. మీ స్మార్ట్​ఫోన్​లో అవి నిక్షిప్తం అయి ఉంటాయి. పిన్​ ఎంటర్ చేయడం లేదా ఫింగర్​ ప్రింట్ స్కానింగ్ ద్వారా మీ స్మార్ట్​ఫోన్​ మిమ్మల్ని గుర్తించి.. ఆ అకౌంట్​కు లాగిన్​ అయ్యేందుకు అనుమతిస్తుంది.

passwordless login
ఫిడో రిజిస్ట్రేషన్​ విధానం
passwordless login
ఫిడో లాగిన్ విధానం

మొబైల్​ను ఎవరైనా కొట్టేస్తే?:
అయినా వారు మీ అకౌంట్స్​లోకి లాగిన్ కాలేరు. ఎందుకంటే మీరు పిన్​ ఎంటర్ చేయడం, వేలి ముద్ర వేయడం తప్పనిసరి. ఆ పనులు వారు చేయలేరు. అదే సమయంలో.. మీ 'కీస్​' క్లౌడ్​లో బ్యాకప్​ అయి ఉంటాయి. ఒక మొబైల్​ పోయినా.. మరో డివైజ్​ ద్వారా వాటిని ఉపయోగించుకోవచ్చు.

ఫిడో అథెంటికేషన్​ విధానం.. ఫిషింగ్​ దాడులనూ అడ్డుకుంటుంది. తొలిసారి సైన్​అప్​ చేసేటప్పుడు కూడా పాస్​వర్డ్​ అవసరం లేదు. అయితే.. ఈ "పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ" విధానం అమల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పిన్​, ఫింగర్​ ప్రింట్ స్కానింగ్​తో లాగిన్ అయ్యేందుకు వీలు కల్పించే స్మార్ట్​ఫోన్​, డివైజ్​ అందరి దగ్గర లేకపోవడం వీటిలో ప్రధానమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.