'మానవులు విశ్వవ్యాప్తం'.. అంతరిక్ష నివాసానికి నాసా ఏర్పాట్లు.. కీలక ప్రకటన

author img

By

Published : Sep 21, 2022, 6:25 PM IST

NASA sustained human blueprint

అంతరిక్షంలో మానవుల ఉనికిని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కీలక బ్లూప్రింట్​ను విడుదల చేసింది. అంతరిక్ష ప్రయాణాలు, నివాసం; చంద్రుడు, మార్స్​పై అవసరమయ్యే మౌలిక సదుపాయాల గురించిన వివరాలను అందులో పొందుపర్చింది.

అంతరిక్షంలో మానవులు సుస్థిరంగా జీవించేందుకు వీలు కల్పించే 63 లక్ష్యాలతో కూడిన బ్లూప్రింట్​ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. సౌరవ్యవస్థ వ్యాప్తంగా అన్వేషణ సాగించేందుకు ఉన్న అవకాశాలతో కూడిన జాబితాను ప్రకటించింది. 2024 నాటికి చంద్రుడిపై మానవులను దించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న నాసా.. ఈ మేరకు 'మూన్ టు మార్స్' పేరుతో ఈ నివేదికను బహిర్గతం చేసింది. బ్లూప్రింట్​లో ప్రధానంగా సైన్స్; ట్రాన్స్​పోర్టేషన్; నివాసం; ఆపరేషన్స్; చంద్రుడు, మార్స్​పై అవసరమయ్యే మౌలిక సదుపాయాల గురించిన వివరాలను పొందుపర్చింది.

"ఈ లక్ష్యాల్లో కొన్ని వాస్తవికంగా సాధ్యపడేవి, మరికొన్ని సాధ్యం చేయాలని అనుకుంటున్నవి ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాలు, అంతర్జాతీయ భాగస్వాములు, నిపుణులతో చర్చించి దీన్ని సిద్ధం చేశాం" అని నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్​రాయ్ వెల్లడించారు. మానవాళి ఉనికిని అంతరిక్షంలోని వివిధ దిశలకు వ్యాప్తి చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ జిమ్ ఫ్రీ తెలిపారు. ఈ లక్ష్యాలు దీర్ఘకాలంలో సౌరవ్యవస్థ అన్వేషణకు ఉపకరిస్తాయని చెప్పారు. కొత్త సాంకేతికతలు, అధునాతన వాహనాలను అభివృద్ధి చేయడానికి, వాస్తవికతను సాధించడానికి ఇవి ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.

ప్రస్తుతం నాసా ఆర్టెమిస్ 1 ప్రయోగంపై దృష్టిసారించింది. చంద్రుడి అన్వేషణ కోసం ఈ ప్రయోగాలు చేపట్టింది. మానవసహిత యాత్రను చేపట్టేందుకు సిద్ధమైన నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువాన్నీ పరిశీలించాలని భావిస్తోంది. అంగారక గ్రహం సహా అంతరిక్షంలో సుదూర ప్రయాణాలు చేసేందుకు వీలుగా చంద్రుడిపై దీర్ఘకాలం మానవులు ఉండేందుకు ప్రయోగాలు చేస్తోంది. 2024లో ఆర్టెమిస్ 2 ద్వారా మానవులను చంద్రుడి కక్ష్యలోకి పంపాలని యోచిస్తోంది. 2025కు ముందే చంద్రుడి ఉపరితలంపై మనుషులను దించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.