8 లక్షల యాప్స్​పై నిషేధం.. ఇవేమైనా ఉపయోగిస్తున్నారా?

author img

By

Published : Sep 25, 2021, 1:56 PM IST

Google Play and Apple App Store Bans 8 Lakh Apps

మోసపూరిత, హానికరమైన దాదాపు 8 లక్షల యాప్స్​ను స్టోర్ నుంచి తొలగించారు. ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి, యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి సుమారు 8 లక్షల యాప్‌లపై నిషేధం విధించాయి. పిక్సలేట్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 'హెచ్‌1 2021 డీలిస్టెడ్‌ మొబైల్ యాప్స్‌ రిపోర్ట్‌' పేరుతో పిక్సలేట్‌ ఒక నివేదిక రూపొందించింది. ఇందులో మోసపూరితమైన, హానికరమైన 8,13,000 యాప్‌ల జాబితాను పొందుపరిచింది. ఈ యాప్‌లు కెమెరా, జీపీఎస్‌ వంటి వాటి ద్వారా యూజర్ డేటా సేకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు. వీటిలో 86 శాతం యాప్‌లు 12 ఏళ్లలోపు పిల్లలే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని నివేదికలో పేర్కొంది.

ఈ యాప్‌ల తొలగింపునకు ప్రధాన కారణం యాప్‌స్టోర్, ప్లేస్టోర్‌ భద్రతాపరమైన నిబంధనలను ఉల్లంఘిండమేనని పిక్సలేట్ తెలిపింది. నిషేధిత జాబితాను రూపొందించే ముందు ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్‌లలో సుమారు 5 మిలియన్ యాప్‌లను విశ్లేషించినట్లు పిక్సలేట్ తెలిపింది. నివేదికలో పేర్కొన్న యాప్‌లకు సుమారు 21 మిలియన్‌ యూజర్‌ రివ్యూలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం నిషేధిత యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యూజర్స్ ఉపయోగిస్తున్నట్లు పిక్సలేట్ తెలిపింది.

యాపిల్‌ యాప్‌స్టోర్‌, గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి యాప్‌లను నిషేధించినప్పటికీ ఈ యాప్‌లు యూజర్ల ఫోన్లలో ఉండొచ్చని పిక్సలేట్ అభిప్రాయపడింది. యూజర్స్ వెంటనే వాటిని తమ ఫోన్లలోంచి డిలీట్ చేయాలని సూచించింది. అయితే ఈ జాబితాలో ఉన్న యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ప్లేస్టోర్ లేదా యాప్‌స్టోర్‌లోని వెళ్లి మీ ఫోన్‌లోని యాప్‌ల వివరాలు సరిచూసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అంటే మీ ఫోన్‌లోని యాప్‌ పేరు ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్‌లో టైప్‌ చేయాలి. సదరు యాప్‌ను ఆయా స్టోర్‌లలో ఉంటే అది నిషేధిత యాప్‌ కాదు. ఒకవేళ లేకపోతే వెంటనే ఆ యాప్‌ను డిలీట్ చేయమని సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.