స్మార్ట్ ఫోన్​​ ఉంటే.. పక్కన మరో మనిషి ఉన్నట్లే!

author img

By

Published : Sep 8, 2021, 9:37 AM IST

Benefits of smartphone

ఫోన్లు వచ్చిన తొలిరోజుల్లో కేవలం మాట్లాడుకోవడానికే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు.. ఫోన్ ఉంటే మరో మనిషి మన పక్కన ఉన్నట్లే!. దైనందిన జీవితంలో మనిషికి అవసరమైన ఎన్నో పనులను స్మార్ట్​ ఫోన్లతో సులభంగా చేయొచ్చు. సాంకేతికత అభివృద్ధి చెందే కొద్ది వస్తున్న యాప్​ల​తో ఆ సౌలభ్యం మరింత పెరిగింది. మరి ఈ స్మార్ట్​ఫోన్ల వల్ల కలిగే మనకు తెలియని ఉపయోగాలేంటో చూద్దాం..

ఒకప్పుడు ఫోనంటే మాట్లాడుకోవటానికే. మరిప్పుడో సమస్త ప్రపంచమూ స్మార్ట్‌ఫోన్లలోనే నిక్షిప్తమైపోయింది. ఫొటోలు, వీడియోలు తీయటం దగ్గర్నుంచి సామాజిక మాధ్యమాల విహారం వరకూ అన్నీ ఫోన్లతోనే (uses of smartphone) సాగుతున్నాయి. కొత్త కొత్త యాప్‌ల వెల్లువతో సౌలభ్యమూ పెరిగింది. నిజానికి వీటి గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. యాప్‌లతోనే కాదు.. మొబైల్‌ ఫోన్‌తోనూ కొన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. అంటే చేదోడుగా (benefits of smartphones in healthcare) వాడుకోవచ్చన్నమాట. మన రోజువారీ వ్యవహారాల్లో (benefits of smartphone in our daily life) ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు.

ఎత్తు కొలవటం

పిల్లలను గోడకు నిలబెట్టి, తల మీద పెన్సిల్‌ను పెట్టి, గోడకు గీత గీసి, ఎత్తును కొలవటం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అంత తతంగం అవసరం లేదు. ఫోన్‌తోనే కానిచ్చేయొచ్చు. కాకపోతే అధునాతన ఐఫోన్‌ కావాలి. ఐఫోన్‌ 12 ప్రొ లేదా ఐఫోన్‌ 12 ప్రొ మ్యాక్స్‌ మీ చేతిలో ఉంటే మెజర్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి ఎవరి ఎత్తునైనా ఇట్టే కొలవచ్చు. ముందుగా ఎత్తు కొలవాలని అనుకున్నవారిని ఫ్రేమ్‌లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు వారి తల మీద ఒక తెల్లటి గీత, దాని కింద ఎత్తు కనిపిస్తుంది. తెల్ల వృత్తాన్ని నొక్కితే కొలత నమోదవుతుంది. ఫొటోను సేవ్‌ చేసుకోవాలనుకుంటే కింద కుడివైపు మూలన పాపప్‌ అయ్యే స్క్రీన్‌షాట్‌ను ట్యాప్‌ చేసి డన్‌ బటన్‌ను నొక్కాలి. ఇలా ఫొటోస్‌లో లేదా ఫైల్స్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. మరి ఆండ్రాయిడ్‌ ఫోన్ల సంగతేంటని అంటారా? వీటి కోసం థర్డ్‌ పార్టీ యాప్‌లు ఉన్నాయిగా. వీటిల్లో మంచి రేటింగ్‌ ఉన్నది స్మార్ట్‌ మెజర్‌. దీన్ని ఓపెన్‌ చేయగానే ఎదుటి వాళ్ల ఫొటో మీద ప్లస్‌ గుర్తు కనిపిస్తుంది. దీన్ని పాదాల నుంచి మొదలు పెట్టి తల మీదికి తీసుకొస్తే ఎత్తు తెలుస్తుంది. ఇందులో మన నుంచి వాళ్లు ఎంత దూరంలో ఉన్నారో కూడా కనుక్కోవచ్చు.

Benefits of smartphone
ఎత్తు కొలవటం

మెనూ స్కాన్‌

క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయటానికి ఒకప్పుడు థర్డ్‌ పార్టీ యాప్‌లను వాడేవారు. ఇవి మెమొరీలో ఎక్కువ స్పేస్‌ తీసుకునేవి. చేసే పని కన్నా ఎక్కువ సమాచారం సేకరించేవి. ఇప్పుడు వీటి అవసరమేమీ లేదు. ఫోన్‌ కెమెరా చాలు. ఐఫోన్‌ కెమెరా ఓపెన్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ను ఫోకస్‌ చేస్తే చాలు. దానంతటదే స్కాన్‌ చేసి పెడుతుంది. పాపప్‌ అయ్యే నోటిఫికేషన్‌ను ట్యాప్‌ చేస్తే ఆయా వెబ్‌సైట్లను చూడొచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనైతే మోడల్‌, కంపెనీలను బట్టి ఆధారపడి ఉంటుంది. కెమెరా యాప్‌ క్యూఆర్‌ కోడ్‌ను స్కానింగ్‌తో కూడుకున్నది ఎంచుకుంటే మంచిది. ఉదాహరణకు- సామ్‌సంగ్‌ గెలాక్సీలో హోంస్క్రీన్‌ ద్వారా క్విక్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘క్యూఆర్‌ స్కానర్‌’ను ఎంచుకొని ఓకే బటన్‌ నొక్కాలి. ఇది కెమెరా యాప్‌ను ఓపెన్‌ చేస్తుంది. ఇది పనిచేయకపోతే కెమెరా సెట్టింగ్స్​లో స్కాన్‌ క్యూఆర్‌ కోడ్‌ ఆప్షన్‌ ఉందేమో చూడొచ్చు.

Benefits of smartphone
మెనూ స్కాన్​

గుండె వేగం కొలతకు

గుండె వేగాన్ని తెలుసుకోవటానికి స్మార్ట్‌వాచే అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌ అయినా చాలు. ఐఫోన్‌ యాప్‌ 'కార్డియో: హార్ట్‌ రేట్‌ మానిటర్‌' కెమెరాతోనే గుండె వేగాన్ని లెక్కిస్తుంది. కెమెరా వెనకాల చూపుడు వేలును ఆనిస్తే చాలు. మారుతున్న రంగులను బట్టి గుండె వేగాన్ని చూపిస్తుంది. ఫోన్‌ కదలకుండా గట్టిగా పట్టుకోవటం మరవద్దు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో హార్ట్‌ రేట్‌ మానిటర్‌ యాప్‌ సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. అయితే ఇవేవీ డాక్టర్లకు ప్రత్యామ్నాయం కావని తెలుసుకోవాలి. ఒక అంచనాకు మాత్రమే పనికొస్తాయి.

Benefits of smartphone
గుండె వేగం కొలతకు

రిమోట్‌ కంట్రోల్‌ తనిఖీ

రిమోట్‌ కంట్రోల్‌ అందరూ వాడేదే. ఇది సరిగా పనిచేయకపోవటానికి చాలావరకు బ్యాటరీల కాలం చెల్లటమే కారణమై ఉంటుంది. కొన్నిసార్లు రిమోట్‌ చెడిపోయి ఉండొచ్చు కూడా. దీన్ని తెలుసుకోవటానికీ ఫోన్‌ను వాడుకోవచ్చు. కెమెరా యాప్‌ను ఓపెన్‌ చేసి రిమోట్‌ వైపు ఫోకస్‌ చేసి, ఏదైనా బటన్‌ను నొక్కుతూ తెర వైపు చూడండి. రిమోట్‌ అంచు నుంచి ఏదైనా సన్నటి కాంతి రేఖ వస్తున్నట్టు కనిపిస్తే ఇన్‌ఫ్రారెడ్‌ సిగ్నల్‌ పనిచేస్తున్నట్టే. అంటే బ్యాటరీల కాలం చెల్లిందని, మార్చాల్సి ఉందనే అర్థం. కాంతి రేఖ కనిపించకపోతే కొత్త రిమోట్‌ను కొనుక్కోవాల్సిందే.

Benefits of smartphone
రిమోట్​ కంట్రోల్​ తనిఖీ

సెక్యూరిటీ కెమెరాగా..

ఇప్పుడు చాలామంది ఇంట్లో ఒకటో రెండో సెక్యూరిటీ కెమెరాలు ఉంటున్నాయి. ఒకవేళ లేకపోతే స్మార్ట్‌ఫోన్‌నే సెక్యూరిటీ కెమెరాగా వాడుకోవచ్చు. కాకపోతే ఆ ఫోన్‌తో ఇంకేమీ పనులు చేయలేం. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, ఇంటి మీద నిఘా పెట్టాల్సివస్తే దీన్ని తాత్కాలికంగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం https://critter.camera/ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫోన్‌, కంప్యూటర్‌, ట్యాబ్లెట్‌, ల్యాప్‌టాప్‌ వంటి వాటిని మోషన్‌ యాక్టివేటెడ్‌ కెమెరాగా మార్చేస్తుంది. పరికరంలోని కెమెరా ద్వారా కదలికలను పసిగడుతుంది. ఇందుకోసం కాసేపు క్యాలిబరేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సురక్షితం కూడా. ఇంటర్నెట్‌ ద్వారా ఎలాంటి సమాచారాన్ని పంపించదు. తీసిన దృశ్యాలన్నీ పరికరంలోనే సేవ్‌ అవుతాయి.

Benefits of smartphone
సెక్యూరిటీ కెమెరాగా..

వస్తువుల ఆచూకీ

సాక్స్‌ ఎక్కడెక్కడో పడేస్తుంటాం. అవసరానికి దొరక్క తెగ ఇబ్బంది పడుతుంటాం. కొన్నిసార్లు ఇవి మంచం కిందో, సోఫా వెనకాలో పడిపోవచ్చు. అవి అక్కడున్నాయో లేదో తెలుసుకోవటమెలా? నడుం వంచితే చాలంటారా. కొన్నిసార్లు నడుం వంచినా కనిపించకపోవచ్చు. ఇక్కడే ఫోన్‌ సాయం చేస్తుంది. కెమెరాతో ఫోన్‌ తీసి చూస్తే సరి. ఇది మనకు కనిపించని వాటినీ ఫొటో తీసి చూపిస్తుంది. కావాలంటే వీడియో తీసి కూడా చూసుకోవచ్చు. అటక మీద మన చేతికి అందని చోట ఉన్న వస్తువులనూ వీటితో గుర్తించొచ్చు.

Benefits of smartphone
వస్తువుల ఆచూకీ

ఇదీ చూడండి: వాట్సాప్​ సరికొత్త ఫీచర్​.. ఇకపై మరింత ప్రైవసీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.