UP election 2022: ఎన్నికల వేడి- ఊపందుకున్న విగ్రహ రాజకీయాలు

author img

By

Published : Nov 21, 2021, 7:19 AM IST

statues politics

ఎన్నికలు సమీపిస్తున్న ఉత్తర్​ప్రదేశ్​లో (UP election 2022) విగ్రహాల రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. మాయావతి ముఖ్యమంత్రిగా (mayawati cm tenure) ఉన్న సమయంలో కాన్షీరాం విగ్రహాలతో పాటు ఏనుగు బొమ్మలు, స్వయంగా తన నిలువెత్తు విగ్రహాలను ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. అయితే ఇప్పుడు అదే బాటలో ప్రధాన పార్టీలైన భాజపా, ఎస్​పీ పయనిస్తుండటం గమనార్హం.

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(uttar pradesh election 2022) దగ్గరపడుతున్నాయి. ముందస్తు సర్వేల ఫలితాలూ వస్తున్నాయి. దాంతో మళ్ళీ ఆ రాష్ట్రంలో విగ్రహ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. వివిధ సామాజికవర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు విగ్రహాలను నెలకొల్పడంపై పార్టీలు దృష్టిపెట్టాయి. ఇన్నాళ్లూ బ్రాహ్మణులను భాజపా నిర్లక్ష్యం చేసిందన్న వాదన ఉండటంతో, ఆ నష్టాన్ని పూరించుకోవడానికి బ్రాహ్మణుల ప్రతినిధిగా భావించే పరశురాముడి విగ్రహాలను ఇబ్బడి ముబ్బడిగా ఆ పార్టీ నెలకొల్పుతోంది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో 16 అడుగుల పరశురాముడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లోనూ ఈ విగ్రహాలు(uttar pradesh statue politics) ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు భాజపా నాయకుడు, బ్రాహ్మణ సమాజ్‌ ఉత్థాన్‌ సేవా సంస్థాన్‌ జాతీయాధ్యక్షుడు శ్యాంప్రకాష్‌ ద్వివేది పేర్కొన్నారు.

అఖిలేశ్‌ ధీమా..

యూపీలో విగ్రహాల సంస్కృతి గతంలోనూ కనిపించింది. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాన్షీరాం విగ్రహాలతో పాటు ఏనుగు బొమ్మలు, స్వయంగా తన నిలువెత్తు విగ్రహాలనూ(mayawati statue) ప్రజాధనంతో ఏర్పాటు చేయడం వివాదాలకు దారితీసింది. అది చివరకు సుప్రీంకోర్టుదాకా వెళ్ళింది. ప్రజాభిప్రాయం మేరకే వాటిని ఏర్పాటుచేశామని మాయావతి పేర్కొన్నారు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సర్దార్‌ పటేల్‌, ఎన్‌.టి.రామారావు, జయలలితల విగ్రహాలను ప్రజాధనంతోనే ఏర్పాటుచేయించారని, దళిత నాయకురాలైన తన విగ్రహాల విషయంలోనే ఎందుకు రాద్ధాంతం జరుగుతోందని ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో గళం వినిపించారు. ఏనుగుల బొమ్మలు కేవలం శిల్పశాస్త్రానికి సంబంధించినవే తప్ప తమ పార్టీ గుర్తుగా భావించలేమని వాదించారు.

భాజపాకు పోటీగా సమాజ్‌వాదీ పార్టీ(samajwadi party) సైతం లఖ్‌నవూలోని జనేశ్వర్‌ మిశ్రా పార్కులో 108 అడుగుల ఎత్తయిన పరశురాముడి విగ్రహం ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. సరిగ్గా 2022 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే యోచనలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఇక నిషాద్‌ పార్టీలు ఫూలన్‌దేవి విగ్రహాన్ని గోరఖ్‌పుర్‌లో పెట్టించాలని డిమాండు చేస్తున్నాయి. తాము ప్రతి నిషాద్‌ ఇంటికీ ఫూలన్‌దేవి విగ్రహాలను సరఫరా చేస్తామని తొలిసారిగా యూపీ ఎన్నికల బరిలోకి దిగుతున్న వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) చెబుతోంది. పేదలు, బడుగువర్గాల కోసమే ఫూలన్‌దేవి కృషిచేశారని, ఆమెకు తాము తగిన గౌరవాన్ని కల్పిస్తామని వీఐపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'మోదీ మళ్లీ పీఎం అవ్వాలంటే.. యోగి సీఎం కావాల్సిందే'

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (up assembly election 2022 date) ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్‌, భాజపా స్పష్టం చేశాయి. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా సాగిన పరిపాలన, అభివృద్ధి తమను ముందుకు నడిపిస్తాయన్న విశ్వాసాన్ని భాజపా వ్యక్తం చేస్తోంది. రైతుల ఆందోళన తమకు సానుకూలంగా ఉంటుందని భావించి కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా కొంత చురుగ్గా కదిలినా- ఇప్పుడు రైతు చట్టాల రద్దు దరిమిలా వారి కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. గతంలో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసినా హస్తం పార్టీకి ప్రయోజనం దక్కలేదు. ప్రస్తుతం ముందునుంచే జనంలో కలిసిపోతూ, అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అధికారంలోకి రాగలమన్న నమ్మకం కాంగ్రెస్‌ అగ్రనేతలకు లేకపోయినా.. ఈసారి కొన్ని స్థానాలైనా సాధించి, తమ ఉనికిని చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'యూపీలో కాంగ్రెస్ తన స్థానాలు నిలబెట్టుకుంటే అదే గొప్ప'

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌(akhilesh yadav) ఈసారి కొత్త సాహసం చేస్తున్నారు. తాను ఎన్నికల బరిలోకి దిగకుండా కేవలం పార్టీని ముందుండి నడిపిస్తానని ప్రకటించారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌తో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌ కుమారుడైన అజిత్‌సింగ్‌ ఈ పార్టీని ఏర్పాటుచేశారు. మరికొన్ని చిన్నపక్షాలూ ఈ కూటమిలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని బహిరంగ సభలు నిర్వహిస్తున్న అఖిలేశ్‌, ప్రతిదానిలోనూ ఈ దఫా అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాదవులు, ముస్లిములతో పాటు వెనకబడిన తరగతుల ఓట్లూ తమకు కచ్చితంగా పడతాయని సమాజ్‌వాదీ నేతలు ఆశిస్తున్నారు. భాజపా నిర్లక్ష్యం పట్ల ఆగ్రహంతో ఉన్న బ్రాహ్మణులు సైతం తమవైపు మొగ్గుతారని భావిస్తున్నారు. పెట్రోలు, గ్యాస్‌తో పాటు నిత్యావసరాల ధరలూ విపరీతంగా పెరిగినందువల్ల ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అది తప్పకుండా ప్రతిఫలిస్తుందని పేర్కొంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే సమాజ్‌వాదీ ఈసారి మెరుగైన స్థితిలోనే ఉంటుందని ఎన్నికల పండితులు అంచనా వేస్తున్నారు. భాజపాను ఓడించి సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రావడం ఎంతవరకు సాధ్యమన్నది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

ప్రధాన పోటీ వాటి మీదే..

రైతుల ఆందోళన(farmers protest), లఖింపుర్‌ఖేరి(lakhimpur kheri violence) ఘటనకు ముందువరకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఢోకా లేదనే అందరూ భావించారు. ఆ ఘటన తరవాత నిర్వహించిన ఎన్నికల ముందస్తు సర్వేలూ ఈసారి భాజపాయే అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పాయి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఎస్‌పీలు నామమాత్రంగానే ఉంటాయని.. ప్రధాన పోటీ భాజపా, సమాజ్‌వాదీ మధ్యనే ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి 325 స్థానాలు సాధించడం తమకు సాధ్యం కాదన్న విషయాన్ని భాజపా నేతలు సైతం అంగీకరిస్తున్నారు. రైతుల ఆందోళనలతోపాటు సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కొన్ని స్థానాలు తగ్గుతాయని, తాము అధికారంలో కొనసాగడం మాత్రం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రైతు చట్టాల రద్దు భాజపాకు ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తుందన్నది వేచి చూడవలసిందే. గతంలో తమకు కొరకరాని కొయ్యలుగా ఉన్న ఆజంగఢ్‌ లాంటి ప్రాంతాలపైనా ఈసారి బీజేపీ దృష్టిసారిస్తోంది. బీఎస్​పీకి దాదాపు 20శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు మహా అయితే 5-10 శాతం మధ్య దక్కుతాయని, తాము 40శాతం ఓట్లను కైవసం చేసుకుంటామని కాషాయ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఎవరి ఆకాంక్షలు ఎంతవరకు ఫలిస్తాయో ఎన్నికల (UP election 2022) బరిలోనే తేలుతుంది.

--రఘురామ్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.