మోదీపై ఆశలతో భాజపా.. అంతర్గత సమస్యలతో కాంగ్రెస్.. తుదిపోరు ముంగిట హోరాహోరీ

author img

By

Published : Jan 28, 2023, 9:41 AM IST

2024 election prediction india

గుజరాత్‌లో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న భాజపా- హిమాచల్‌ అసెంబ్లీ, దిల్లీ నగరపాలికల్లో అధికారం నిలబెట్టుకోలేకపోయింది. పదిహేనేళ్లుగా అధికారంలో కొనసాగిన దిల్లీ నగరపాలక సంస్థలో వ్యతిరేకతను తట్టుకుని వందకుపైగా సీట్లు సాధించడం విశేషమే. ఈ ఏడాది ఏకంగా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట జరిగే ఈ కీలక ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగనుంది.

ఏడాది మొదటి భాగంలో కొన్ని, రెండో భాగంలో మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు విడతల వారీగా ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌లోపు జరిగే కర్ణాటక ఎన్నికలతో కీలక రాష్ట్రంలో ప్రజల ఆలోచనా సరళి ఎలా ఉందో తెలియనుంది. దక్షిణాదిలో గట్టి ప్రాబల్యం కలిగిన ఈ రాష్ట్రంలో భాజపా అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అనేది ఆసక్తికరమే.

కమలనాథులు ప్రధాని మోదీపైనే గట్టి ఆశలు పెట్టుకున్నారు. పార్టీలోని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకురాలేక ముఖ్యమంత్రి బొమ్మై సతమతమవుతున్నారు. మాజీ సీఎం యడియూరప్ప మౌనముద్ర అధినాయకత్వాన్ని ఆందోళన పరుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్‌లోనూ అంతర్గత పరిస్థితులేమీ పూర్తిస్థాయిలో ప్రశాంతంగా లేవనే చెప్పాలి. రేపటి ఎన్నికల్లో భాజపాను అధికారం నుంచి గద్దె దించినా పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సుముఖత వ్యక్తం చేస్తారా అనేది తెలియడం లేదు.

మరోవైపు కాంగ్రెస్‌ విజయావకాశాలను జేడీఎస్‌ దెబ్బతీస్తుందని భాజపా విశ్వసిస్తోంది. ఇప్పటికే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బొమ్మై సర్కారు విద్య, ఉద్యోగాల్లో ఇతర సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా పావులు కదుపుతోంది. ఆర్థికంగా బలహీనంగా ఉండే మధ్యతరగతి వర్గాలను రిజర్వేషన్ల చట్రంలోకి తీసుకువచ్చే యత్నాలు సాగుతున్నాయి. వీటికి తోడు, ఎన్నికల వేళ భావోద్వేగాలను అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు హిజాబ్‌, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలు ఎలాగూ ఉన్నాయి.

అంతర్గత సమస్యలు
రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో పరిస్థితులు కొంతమేర సౌకర్యవంతంగానే ఉన్నట్లు భాజపా భావిస్తోంది. వర్గపోరుతో అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోలేక విఫలమవుతున్న పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉండటంతో భాజపా గెలుపుపై ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్‌కు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌ వంటి హేమాహేమీలు ఉన్నా వారు జట్టుగా పనిచేస్తున్న పరిస్థితులు కనిపించడం లేదు. అంతర్గత సమస్యలు మరీ ఎక్కువ స్థాయిలో లేకపోవడం కమలం పార్టీకి కలిసి వచ్చే అంశం. మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటామన్న పరిస్థితులు ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌లో కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌ తనకు పోటీగా వస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి టి.ఎస్‌.సింగ్‌దేవ్‌ను దాదాపుగా పక్కకు తప్పించినట్లుగానే కనిపిస్తోంది. వాస్తవానికి క్రితంసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రెండున్నరేళ్ల తరవాత ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఈసారి ఎన్నికల వేళ సింగ్‌దేవ్‌ ఎత్తుగడలు కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ స్థానంలో బలమైన నేతను ముందుకు తీసుకురావడంలో భాజపా విఫలమైంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో పోరు హోరాహోరీగా సాగనుంది. శాసనసభ ఎన్నికల ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడంపై ఆప్‌ దృష్టి సారించే అవకాశం ఉంది.

మోదీపైనే ఆశలు
రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీకి దీటుగా నిలబడే నేత ప్రతిపక్షం నుంచి కనిపించడం లేదు. కరోనా వేళ ఉచిత బియ్యం పంపిణీ మొదలు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌, నల్లానీరు, విద్యుత్తు, పీఎం ఆవాస్‌ యోజన గృహాలు, ఉచిత ఆరోగ్యం, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఎరువుల రాయితీ, కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు నగదు సహాయం తదితర పథకాలు మోదీకి ఉపకరించాయి. పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేశామనే అంశాన్ని భాజపా బాగా ప్రచారం చేసుకునే అవకాశాలున్నాయి.

మరోవైపు ఓటర్ల మనోభావాలపై ప్రభావం చూపే సాధారణ ఆర్థిక పరిస్థితులు మెరుగపడటం మొదలైంది. వినియోగదారుల ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లలో పెంపుదలను ఆపివేయవచ్చు. అమెరికా, ఐరోపాల్లో మాంద్యం, చైనాలో మందగమనంపై భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో- భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది సుమారు ఏడుశాతం మేర వృద్ధిబాటలో సాగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రాల స్థాయిలో ఓటర్లు భాజపాపై ఎలాంటి ఆదరణ కనబరచినా, ప్రధానమంత్రి పదవికి వచ్చేసరికి మోదీవైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయని భావించవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.