Save nature for future: వనరుల పరిరక్షణ ప్రాణావసరం

author img

By

Published : Dec 26, 2021, 8:06 AM IST

save nature for future:

Save nature for future: భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి పాలన విధానాలు, ప్రజల జీవన శైలిలో- ప్రకృతిని పరిరక్షించే దృక్పథం కనిపిస్తుంది. స్వాతంత్య్రం తరవాత పెరిగిన సాంకేతికత, అభివృద్ధితోపాటు పర్యావరణ సవాళ్లూ పెచ్చుమీరాయి. ప్రకృతితో మమేకమై జీవించే గ్రామీణులు జీవనోపాధి కోసం నగరాలకు వలస బాటపట్టారు. దీంతోపాటు, పెరిగిన పారిశ్రామికీకరణతో ప్రకృతి వనరుల వాడకం పెరిగిపోయింది. రేపటి తరాల కోసం పర్యావరణాన్ని కాపాడే బాధ్యత పౌరులు, ప్రజాప్రభుత్వాలపైనే ఉందని నిపుణులు చెప్తున్నారు.

Save nature for future: ధరణిపై మనిషి మనుగడకు సహజ వనరులు, గాలి, నీరు, ఆహారం వంటివన్నీ కీలకావసరాలు. రేపటి తరాల కోసం పర్యావరణాన్ని కాపాడే బాధ్యత పౌరులు, ప్రజాప్రభుత్వాలపైనే ఉంది. భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి పాలన విధానాలు, ప్రజల జీవన శైలిలో- ప్రకృతిని పరిరక్షించే దృక్పథం కనిపిస్తుంది. స్వాతంత్య్రం తరవాత పెరిగిన సాంకేతికత, అభివృద్ధితోపాటు పర్యావరణ సవాళ్లూ పెచ్చుమీరాయి. ప్రకృతితో మమేకమై జీవించే గ్రామీణులు జీవనోపాధి కోసం నగరాలకు వలస బాటపట్టారు. దీంతోపాటు, పెరిగిన పారిశ్రామికీకరణతో ప్రకృతి వనరుల వాడకం పెరిగిపోయింది. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో సహజ వనరుల దుర్వినియోగాన్ని నియంత్రిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించే చట్టాలపై ఉదాసీనంగా వ్యవహరించారు. తదనంతర కాలంలో పరిస్థితులు కొంతమేర మెరుగయ్యాయి. స్వాతంత్య్ర కాలం నాటితో పోలిస్తే ప్రస్తుతం అనేక పర్యావరణ చట్టాలు పదునెక్కాయి. దేశంలో పెరుగుతున్న జనాభా, అభివృద్ధి అవసరాల కోసం వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రకృతి వనరుల వాడకంలో నియంత్రణ పాటించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం సవాలుగా మారింది.

గుణపాఠం నేర్పిన భోపాల్‌ దుర్ఘటన

మన దేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టాలు తెచ్చేందుకు ఏళ్ల తరబడి తాత్సారం చోటుచేసుకొంది. స్వాతంత్య్రం వచ్చాక- పేదరిక నిర్మూలన, అక్షరాస్యత పెంపు, వ్యవసాయం, పారిశ్రామికీకరణ, అభివృద్ధి వంటి అంశాలకే ప్రాధాన్యం దక్కింది. పర్యావరణ పరిరక్షణతో ముడివడ్డ అంశాలపై అంతగా దృష్టిపెట్టలేదు. 1972లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఐక్యరాజ్య సమితి స్టాక్‌హోం సదస్సుకు హాజరయ్యాక పరిస్థితుల్లో మార్పు మొదలైంది. పర్యావరణ అంశాలపై పరిపాలనపరంగా నిశితమైన దృష్టి సారించడం ఆరంభమైంది. అదే ఏడాది బి.పి.పాల్‌ నేతృత్వంలో జాతీయ పర్యావరణ ప్రణాళిక, సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తరవాత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు రాష్ట్రాల్లోనూ కాలుష్య నియంత్రణ మండళ్లు ఏర్పాటయ్యాయి. 1974లో జల కాలుష్య నియంత్రణ, 1981లో వాయు కాలుష్య నియంత్రణ చట్టాలను రూపొందించారు. 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ అంశాలను ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. అడవులు, నదులు, వన్యప్రాణులతో పాటు- పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, అభివృద్ధికి కృషి చేయడం పౌరుల ప్రాథమిక విధిగా నిర్వచించారు. 1980లో వ్యవసాయ శాఖకు అనుబంధంగా పర్యావరణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. భోపాల్‌ దుర్ఘటన మన దేశంలో పర్యావరణ పరిరక్షణలో లోపాలను, వ్యవస్థల నిద్రావస్థను బయటపెట్టింది. 1984లో భోపాల్‌ యూనియన్‌ కార్బైడ్‌ పరిశ్రమ నుంచి విషవాయువు విడుదలైన ప్రమాదంలో వేల మంది మృత్యువాత పడినట్లు అంచనా. పరోక్షంగా లక్షల మంది జీవనంపై పెను ప్రభావం పడింది. ఆ ప్రమాద బాధితుల కుటుంబాల వారసులు ఇప్పటికీ జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. అప్పట్లో పరిశ్రమలపై పర్యవేక్షణ, కాలుష్య నియంత్రణ, ఉల్లంఘన, నష్టపరిహారం వంటి విషయాల్లో చట్టపరంగా సరైన రక్షణలు కరవయ్యాయి. దాంతో భోపాల్‌ బాధితులను ఆదుకోవడం క్లిష్టతరంగా మారింది. 1985లో పరిశ్రమలు, అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులు, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని, నియమ నిబంధనలను అమలులోకి తెచ్చారు. పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) నిబంధనల ప్రక్రియను 1994 నుంచి తీసుకొచ్చారు. దీన్ని కొద్దిగా సరళీకరించి 2006లో మరో నోటిఫికేషన్‌ జారీ చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలకు ఇచ్చే అనుమతుల ప్రక్రియలో లోపాలను అధిగమించి బాధితులకు న్యాయం చేసేందుకు 1997లో జాతీయ పర్యావరణ అప్పిలేట్‌ అథారిటీ చట్టం వచ్చింది. 2010లో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ క్రమంలో దేశంలో అయిదు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. పర్యావరణ పరిరక్షణ చట్టానికి అనుబంధంగా 1991, 2011లలో తీర ప్రాంత పరిరక్షణ, నియంత్రణకు అవసరమైన నిబంధనలు రూపొందించారు. 2018లో ప్లాస్టిక్‌, తదితర వ్యర్థాల నిర్వహణ కోసం ఘన వ్యర్థాల యాజమాన్య నియమాలను అమలులోకి తీసుకొచ్చారు.

ప్రజాభాగస్వామ్యం అవసరం

పర్యావరణ పరిరక్షణ చట్టం-1986ను అభివృద్ధి ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియలో మార్పుల కోసం ఉద్దేశించారు. దీని పరిధిలోని పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్‌-2020 ముసాయిదాపై రెండేళ్లుగా వివాదాలు అలముకున్నాయి. ఈ ముసాయిదా నోటిఫికేషన్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణ పూర్తి చేయకుండానే పర్యావరణ అనుమతులు మంజూరు చేసే వీలు కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల నుంచి సూచనలు, వినతులను స్వీకరించే ప్రక్రియ గడువును కుదించారు. దానికి కేవలం ఇరవై రోజులకే పరిమితం చేశారు. సంబంధిత ప్రాజెక్టుల బాధితులతో సంప్రతింపుల ప్రక్రియను పూర్తిగా నిర్వీర్యపరచారు. దీనివల్ల సున్నితమైన అడవులు, సముద్ర తీరం వంటి సహజ వనరులు దెబ్బతింటాయి. వాటిపైనే ఎక్కువగా ఆధారపడి జీవించే ఆదివాసులు, మత్స్యకారులు, భూమి హక్కు లేని ఇతర రంగాలకు చెందిన వృత్తిపనివారిపై తీవ్ర దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. పర్యావరణ ప్రభావ మదింపు ముసాయిదా నోటిఫికేషన్‌ స్థానిక భాషల్లో అందుబాటులో లేదంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో దిగివచ్చిన కేంద్రం ముసాయిదాను 22 ప్రాంతీయ భాషల్లో ప్రచురించి ఇటీవలే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అభివృద్ధి చెందిన ఐరోపా, అమెరికా దేశాల్లో మాదిరిగా ఇక్కడా అభివృద్ధి ప్రాజెక్టుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. పర్యావరణానికి కలిగే నష్టాన్ని నియంత్రిస్తూ, జవాబుదారీతనాన్ని పెంచేలా జాతీయ హరిత ట్రైబ్యునళ్లను విస్తరించడం లేదు. ప్రస్తుతం దేశ రాజధానితో సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న అయిదు ట్రైబ్యునళ్లు చాలడం లేదు. అవి పూర్తిస్థాయిలో సమస్యల్ని పరిష్కరించలేకపోతున్నాయి. రాష్ట్రానికొక హరిత ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయాలి. పర్యావరణాన్ని రక్షించే చట్టాల పటిష్ఠ అమలుకు ప్రభుత్వాలు పూనుకోవాలి. అప్పుడే ప్రజలకు అధికార, పాలన వ్యవస్థలపై నమ్మకం ఏర్పడుతుంది.

పర్యావరణంపై నిర్లక్ష్యం

పర్యావరణ పరిరక్షణ, వనరుల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు అనేక వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. ఇంకోపక్క వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిణామాలు ఆందోళనకరం. సహజ వనరుల్ని అడ్డగోలుగా వాడేయకుండా అవసరమైన నియంత్రణ, పర్యవేక్షణ కరవయ్యాయి. నియమాలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకోవడంలో సర్కారీ యంత్రాంగాలు విఫలమవుతున్నాయి. పారిశ్రామిక సంస్థల ప్రయోజనాలు, వాటి ఒత్తిళ్ల ముందు ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాలు మరుగున పడుతున్నాయి. పరిశ్రమలు, ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను మంజూరు చేసే ప్రక్రియను సరళీకరించే యత్నాలు సాగుతున్నాయి. పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్‌లో మరిన్ని మార్పులకు ప్రయత్నాలు జరుగుతూ ఉండటమే ఇందుకు నిదర్శనం.

- గంజివరపు శ్రీనివాస్​, పర్యావరణ నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.