ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా బలగాలు.. యుద్ధం తప్పదా?

author img

By

Published : Jan 21, 2022, 6:44 AM IST

Updated : Jan 21, 2022, 7:04 AM IST

Russia Ukraine war

Russia Ukraine war: తూర్పు ఐరోపాలో ఆందోళనకర పరిణామాలు నెలకొన్నాయి. నల్లసముద్ర తీరాన మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుల వెంబడి రష్యా లక్ష మంది సైనికులను మోహరించింది. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం దక్కబోతోందన్న తరుణంలో పొరుగుదేశంపై దండెత్తడానికే రష్యా పూర్వరంగం సిద్ధం చేసుకుంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Russia Ukraine war: ఐరోపా తూర్పు ప్రాంతంలో నల్లసముద్ర తీరాన మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుల వెంబడి రష్యా లక్ష మంది సైనికులను మోహరించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సంప్రదాయ యుద్ధపద్ధతులకు స్వస్తి పలికిన రష్యా- ఊహించని రీతిలో ఉత్పాతాన్ని సృష్టించవచ్చని నాటో కూటమి అంచనా వేస్తోంది. అందుకు బలాన్నిచ్చేలా జనవరి రెండో వారంలో ఉక్రెయిన్‌ ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో డేటా తస్కరణకు గురైంది. ప్రజల వ్యక్తిగత సమాచారం సైబర్‌ దాడులకు లోనైనట్లు ఆ దేశం ప్రకటించింది. అంతకు కొద్దిరోజుల ముందే జెనీవా, బ్రస్సెల్స్‌, వియన్నా నగరాల్లో మాస్కో ప్రతినిధులు, అమెరికా నేతృత్వంలోని నాటో దౌత్యవేత్తల మధ్య వివిధ స్థాయుల్లో జరిగిన సమావేశాల్లో ఇదమిత్థంగా ఏమీ తేలలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోయ్‌ ఆ భేటీల్లోనే విస్పష్ట ప్రకటన జారీచేశారు. 'ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోకపోవడమే కాకుండా, కొత్తగా పూర్వ సోవియట్‌లోని ఏ భూభాగంలోకీ రానివ్వకూడదు, తూర్పు దిశగా విస్తరణవాద ఆలోచనను విరమించుకుంటున్నట్లు ఆ దేశం లిఖితపూర్వక హామీ ఇవ్వాలి' అన్నది ఆ హెచ్చరికల సారాంశం. మరోసారి సెర్గీతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్‌ చర్చలు జరపనున్నారు. ప్రస్తుత పరిణామాలు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Biden Putin meetings

జో బైడెన్‌ వైట్‌హౌస్‌ పగ్గాలు చేపట్టాక రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో గతేడాది జూన్‌లో జెనీవాలో తొలిసారి భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు వర్ధమాన వ్యవహారాలపై సానుకూల వాతావరణంలో చర్చించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తరవాత డిసెంబరు ఏడున వారిద్దరూ వీడియోకాల్‌లో పరస్పర వాదోపవాదాలకు దిగారని వార్తలు వచ్చాయి. ఆర్నెల్ల కాలంలో అగ్రరాజ్యాధినేతల మధ్య అంతటి అగాథానికి కారణం... ఉక్రెయిన్‌!

why russia wants ukraine

సుమారు 4.4కోట్ల జనాభాతో, అంతర్జాతీయ నౌకా వ్యాపారానికి అనువైన ఉక్రెయిన్‌ 1991వరకు పూర్వ సోవియట్‌లో అంతర్భాగం. దాన్ని తిరిగి తన గూటికి తెచ్చుకునేందుకు రష్యా వేసిన ఎత్తుగడలు కల్లోలం సృష్టిస్తున్నాయి. 1950వ దశకం నుంచి ఉక్రెయిన్‌కు అనుబంధంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పంపై 2014లో రష్యా దురాక్రమణ జరిపి తన అధీనంలోకి తెచ్చుకుంది. ఐక్యరాజ్యసమితి సహా ఏ అంతర్జాతీయ సంస్థా గుర్తించని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, 90శాతం రష్యాలో విలీనానికి అనుకూలంగా ఉన్నారని స్వీయధ్రువీకరణ చేసుకొంది. ఎనిమిదేళ్లుగా సాగుతున్న సంఘర్షణల్లో ఆ ప్రాంతంలో 14వేల మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచమంతా కొవిడ్‌తో పోరాడుతున్న వేళ, రెండు నెలలుగా సుమారు లక్ష మంది సైనికులు, యుద్ధట్యాంకులు, సాయుధ సామగ్రిని ఉక్రెయిన్‌ తూర్పు సరిహద్దుల్లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యా దింపింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ దాన్ని ధ్రువీకరిస్తూ, సైనికుల సంఖ్య అంతకు రెట్టింపు ఉండవచ్చని పేర్కొంది. తమ దేశ సరిహద్దుల వెంబడి రవాణా సౌకర్యాలను అంచనా వేయడానికి, అత్యవసర వేళల్లో సైనిక సామగ్రి తరలింపునకుగల అవరోధాలను అధిగమించడానికి అదొక డ్రిల్‌ అంటూ మాస్కో వింత వాదనకు దిగింది. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం దక్కబోతోందన్న తరుణంలో పొరుగుదేశంపై దండెత్తడానికే రష్యా పూర్వరంగం సిద్ధం చేసుకుంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర శక్తిమంతమైన దేశాలతో కూడిన నాటో కూటమిలో చేరితే ఉగ్రవాద, సైబర్‌ దాడులను ఎదుర్కొనేందుకు, సైనిక సహకారానికి, వాణిజ్యానికి ఉపయుక్తంగా ఉంటుందని ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. పుతిన్‌ వ్యవహార శైలితో ముప్పు పొంచి ఉందని భావిస్తున్న ఉక్రెయిన్‌ సైతం నాటోపై ఆసక్తి కనబరుస్తోంది. క్రిమియానుంచే వేర్పాటువాదులను క్రెమ్లిన్‌ ఎగదోస్తోందని ఆందోళన చెందుతోంది.

India on russia ukraine

ఈ పరిణామాల దరిమిలా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జిలెన్‌స్కీ ఇటీవల నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌తో సమావేశమయ్యారు. పాత సోవియట్‌ ప్రాంతంలోకి నాటో దళాలు ప్రవేశిస్తే, లాటిన్‌ అమెరికాలోని కమ్యూనిస్టు దేశాల్లో తమ సైనిక కార్యకలాపాలు పెరుగుతాయంటున్న రష్యా వైఖరి కయ్యానికి కాలుదువ్వడమే! బలమైన నాటో కూటమి, మిత్రదేశమైన రష్యాకు మధ్య వివాదంగా మారిన ఈ పరిణామాలపై భారత్‌ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. ఉక్రెయిన్‌తోనూ వాణిజ్య, వైద్య, పరిశోధన రంగాల్లో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొంది. ఇరుపక్షాల నడుమ సయోధ్య కుదిరి వివాదం సమసిపోవాలని ఇండియా ఆశిస్తోంది. ఏదిఏమైనా ప్రపంచ శాంతికి భంగం వాటిల్లకుండా రష్యా, నాటో కూటమి ప్రస్తుత వివాదాన్ని దౌత్యపరంగా పరిష్కరించుకోగలిగితే అది అందరికీ తీపి కబురు అవుతుంది.

- బి.అశోక్‌

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా?

Last Updated :Jan 21, 2022, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.