క్రీడా ప్రపంచానికి మోదీ ఆశాకిరణం.. యువతకు స్ఫూర్తి: పీవీ సింధు

author img

By

Published : Sep 17, 2022, 6:47 AM IST

Updated : Sep 17, 2022, 7:10 AM IST

prime minister narendra and  pv sindhu

భారత క్రీడాభివృధ్దికి ప్రభుత్వం తోడ్పాటు మీద బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధు కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడాకారుల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించాలనుకునే వారికి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని చెప్పారు. కావాల్సిందల్లా మనలో గెలవాలనే పట్టుదల మాత్రమే అని తెలిపారు. క్రీడాకారుల్లో ప్రధాని స్ఫూర్తి నింపుతున్నారని కొనియాడారు. ఇంకా ఏమన్నారంటే..

క్రీడాకారుల అవసరాలు ఏమిటో ప్రధాని మోదీకి బాగా తెలుసు. క్రీడాభివృద్ధికి ప్రత్యేక పథకాలు, ప్రణాళికలు చేపట్టారు. మౌలిక వసతులు కల్పించారు. అంతర్జాతీయ క్రీడల్లో ఇండియా రాణించడానికి ఇవి ఎంతో దోహదం చేశాయి, చేస్తున్నాయి. గతంతో పోలిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ గణనీయమైన విజయాలు సాధించింది. వాటిలో దేశం తరఫున నేనూ పతకం గెలిచాను. టోక్యోకు బయలుదేరే ముందు భారత క్రీడా బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది.

ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున జయకేతనం ఎగరవేయడానికి సర్వశక్తులూ ఒడ్డాలని ఆయన మమ్మల్ని కోరారు. ఆ క్రీడోత్సవం నుంచి మేము పతకాలతో తిరిగి రాగానే మళ్ళీ ప్రధానితో సమావేశమయ్యేందుకు ఉత్సాహంగా ఎదురు చూశాం. మేము ఆశించినట్లుగానే కొద్ది రోజుల్లోనే పిలుపు వచ్చింది. ప్రధాని అధికార నివాసంలో ఆయనతో సమావేశం చాలా ఆసక్తికరంగా సాగింది. టోక్యోలో మా అనుభవాలను ప్రధానితో పంచుకున్నాం. ఒలింపిక్స్‌లో సాధించిన విజయాలకు మమ్మల్ని అభినందించి భవిష్యత్తులోనూ మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు.

పెద్ద మార్పు
క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోందని, క్రీడల్లో భారత్‌ను అగ్ర శక్తిగా నిలపడానికి సహకరించాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. యువతకు, వర్ధమాన క్రీడాకారులకు చేయూత ఇవ్వాలని, మా అనుభవాలను, నైపుణ్యాన్ని వారితో పంచుకోవాలని సూచించారు. అది మాకు మరపురాని సమావేశంగా మిగిలిపోయింది. అదే సమావేశంలో నాకు విస్మయానందకర అనుభవం కలిగింది.

ప్రధానితో సమావేశం అనంతరం అల్పాహారం తీసుకుంటుండగా ఆయన నా వద్దకు వచ్చి నాకు ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను అందించారు. ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే ఐస్‌క్రీమ్‌ తినిపిస్తానని టోక్యో వెళ్ళేముందు ఆయన మాట ఇచ్చారు. నేను పతకం సాధించగానే ఆ మాట నిలబెట్టుకున్నారు! టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కొద్దిలో తప్పిపోయినందుకు ఆవేదన చెందుతున్న భారత మహిళా హాకీ బృందాన్ని ప్రధాని మోదీ ఓదార్చడం హృదయాన్ని కదిలించింది. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడోత్సవాల్లో స్వర్ణ పతకం సాధించే అవకాశం కోల్పోయిన భారత మహిళా క్రికెట్‌ జట్టుకూ కలత చెందవద్దంటూ ధైర్యం చెప్పారు.

ప్రస్తుతం మన అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏఐ) అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. శిక్షణ కోసం నిధులెలా వస్తాయని మధనపడకుండా పూర్తిగా ఆటలో రాణించడంపైనే దృష్టిపెట్టే వాతావరణం కల్పిస్తున్నాయి. ఇవాళ నాలాంటి క్రీడాకారులు స్వదేశంలో, విదేశాల్లో అత్యుత్తమ శిక్షణ పొందగలుగుతున్నారు. మంచి శిక్షణ లభిస్తుందా, ఉత్తమ కోచ్‌లు దొరుకుతారా, ప్రత్యేక క్రీడా పరికరాలు అందుబాటులో ఉంటాయా తదితర అంశాల గురించి కలవరపడకుండా ఆటల్లో గెలవడం మీదే పూర్తి శ్రద్ధాసక్తులు పెట్టగలుగుతున్నాం.

క్రీడాకారులకు ఇలాంటి తోడ్పాటు అన్ని దేశాల్లో లభించదు. ప్రాథమిక స్థాయిలో 'ఖేలో ఇండియా' పోటీల ద్వారా, ఉన్నత స్థాయిలో 'టాప్స్‌' పథకం ద్వారా ఆటగాళ్లకు ప్రభుత్వం అండదండలందిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో నేను గమనించిన అతి పెద్ద మార్పు ఇది. ఈ బృహత్తర కృషి భారత్‌కు క్రీడావిజయాలను సాధించి పెడుతోంది. ప్రధాని మోదీ తీసుకుంటున్న అద్వితీయ చొరవ, ప్రత్యేక పథకాలు రానున్న సంవత్సరాల్లో భారత్‌ను ఆటల్లో మేటిగా నిలబెడతాయనడంలో సందేహం లేదు. ప్రధాన అంతర్జాతీయ ఆటల పోటీల్లో భారత్‌ అగ్రశక్తిగా ఆవిర్భవించడానికి ఇవి తోడ్పడతాయి.

ప్రధాని మోదీ, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఖేల్‌ మహాకుంభ్‌ పోటీలను నిర్వహించేవారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లోని మెరికల్లాంటి యువతను కనిపెట్టి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం ఆ కార్యక్రమ లక్ష్యం. ఇప్పుడు ప్రధాని హోదాలో భావి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు దేశమంతటా అనేక ఖేలో ఇండియా కేంద్రాలను స్థాపించారు. 2020లో ప్రత్యేకంగా క్రీడా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి క్రీడల పట్ల తన ప్రగాఢాభిమానాన్ని, భారత్‌ను అగ్ర క్రీడాశక్తిగా నిలపాలన్న దీక్షనూ చాటుకున్నారు.

యువతకు స్ఫూర్తి
క్రీడలంటే కేవలం టోర్నమెంట్లు కావని, యువత సర్వతోముఖ వికాసానికి అవి దోహదపడతాయని ప్రధాని మోదీ నమ్మకం. రూ.800 కోట్ల వ్యయంతో మణిపుర్‌లో దేశంలోనే ప్రథమ జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనం. క్రీడల్లో ఉన్నత కోర్సుల కోసం ఉత్తర్‌ ప్రదేశ్‌లో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ క్రీడా విశ్వవిద్యాలయం నిర్మితమవుతోంది. 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలోనూ ప్రధాని చాలా తరచుగా క్రీడలు, క్రీడా ప్రముఖుల గురించి మాట్లాడుతుంటారు. యువతకు స్ఫూర్తి కలిగిస్తారు. విజయానికి దగ్గరి దారులు లేవని హితబోధ చేస్తారు. ఓటమిలో ఆశ వీడవద్దని, విజయంలో అతి ధీమా ప్రదర్శించవద్దని ప్రబోధిస్తారు. ప్రధాని చేస్తున్న కృషి, చేపట్టిన విధానాలు, భారతీయ క్రీడా నిర్వహణ యంత్రాంగంలో ప్రస్ఫుటమవుతున్న పారదర్శకత మన క్రీడా రంగానికి గొప్ప విజయావకాశాలు ఉన్నాయనే భరోసా కలిగిస్తున్నాయి. ఉజ్జ్వల క్రీడా భవితవైపు మన ప్రస్థానం ఇప్పుడే మొదలైంది!

ప్రణాళికాబద్ధ కృషి
మోదీ ప్రభుత్వం 2015లో ప్రారంభించిన టాప్స్‌ (టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌) కింద అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అత్యుత్తమ శిక్షణ, ఇతర వసతులను అందిస్తోంది. ప్రత్యేక కోచ్‌లను నియమించడం, అవసరమైతే విదేశాల్లో శిక్షణ, పోటీల్లో పాల్గొనే అవకాశాలు కల్పించడం టాప్స్‌ పథకం విశిష్టతలు.

పథకం- కోర్‌ గ్రూప్‌ కింద నాలాంటి క్రీడాకారులను, అథ్లెట్లను ఎంపిక చేసి సకల వసతులు కల్పిస్తూ అంతర్జాతీయ పోటీల్లో భారత్‌కు విజయాలు సాధించిపెట్టేలా ప్రోత్సహిస్తోంది. 2024, 2028 ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలవగల యువ క్రీడాకారులను డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ కింద ఎంపిక చేసి శిక్షణ ఇస్తోంది. ఇలాంటి ప్రణాళికాబద్ధ కృషి వల్లే 2020 ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ పోటీల్లో భారతీయ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. 73 ఏళ్ల తరవాత థామస్‌ కప్‌ను గెలిచారు.

--పీవీ సింధు (రచయిత్రి- ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి)

ఇవీ చదవండి : ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే

ఫెదరర్​​ ఆటలోనే కాదు సంపాదనలోనూ ముందే.. మొత్తం ఎన్ని వేల కోట్లంటే?

Last Updated :Sep 17, 2022, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.