ETV Bharat / opinion

తైవాన్​తో సన్నిహిత సంబంధం చారిత్రక అవసరం!

author img

By

Published : Oct 20, 2020, 8:05 AM IST

తైవాన్​ను తమ భూభాగంలో కలుపుకోవాలని చైనా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండాలని సేనలకు పిలుపునిచ్చిన జిన్‌పింగ్‌ ఆ దేశ సరిహద్దుల్లో అత్యాధునిక క్షిపణులు మోహరిస్తున్నారు. చైనా దూకుడు పెరుగుతున్న ఈ తరుణంలో- తైవాన్‌ విషయంలో భారత వైఖరి ఎలా ఉండాలన్న దానిపై చర్చ ఊపందుకొంది.

india -taiwan relations
చెలిమికి కొత్త చివుళ్లు!

‘ముమ్మాటికీ తైవాన్‌ మా దేశంలో అంతర్భాగమే. సంపూర్ణ విలీనానికి తైవాన్‌ అంగీకరించని పక్షంలో దానిపై సైనికదాడికీ వెనకాడం’ అంటూ ఈ ఏడాది మొదట్లో హుంకరించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తాజాగా అదే వాదనను మరోమారు పునరుద్ఘాటించారు. యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండాలని సేనలకు పిలుపునిచ్చిన జిన్‌పింగ్‌ తైవాన్‌ సరిహద్దుల్లో అత్యాధునిక క్షిపణులు మోహరిస్తున్నారు. చైనా దూకుడు పెరుగుతున్న ఈ తరుణంలో- తైవాన్‌ విషయంలో భారత వైఖరి ఎలా ఉండాలన్న దానిపై చర్చ ఊపందుకొంది.

నిష్ఠుర నిజం ఇదేనా!:

చైనాతో సంబంధాలు ఉద్రిక్తంగా మారినప్పుడు మాత్రమే తైవాన్‌ కార్డును భారత్‌ బయటికి తీస్తోందని, అలా కాకుండా ఆ దేశంతో దిల్లీ నాయకత్వం దీర్ఘకాల ప్రాతిపదికన మైత్రీబంధానికి శ్రీకారం చుట్టాలన్నది విదేశాంగ నిపుణుల మాట.చైనాను ఇబ్బందిపెట్టేందుకు అక్కరకొచ్చే ఒక పావులా మాత్రమే తైవాన్‌ను భారత్‌ పరిగణిస్తోందన్నది నిష్ఠుర నిజం! అలా కాకుండా ప్రాంతీయంగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, తైవాన్‌తో వివిధ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పుకొనేందుకు దిల్లీ నాయకత్వం ప్రయత్నిస్తే బాగుంటుంది.

కీలకమైన 5 అంశాలు :

పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన భారత్‌, తైవాన్‌ల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అయిదు కీలక అంశాలు అక్కరకొస్తాయి. కృత్రిమ మేధ, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వ్యూహాత్మక అవసరాలు, రక్షణ సంబంధాలు, మాండరిన్‌ నేర్చుకోవడం, ఐటీ వంటి రంగాల్లో ఇరు దేశాల అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి బోలెడన్ని అవకాశాలున్నాయి.బీజింగ్‌ దూకుడు దక్షిణ చైనా సముద్ర ప్రాంత సమీప దేశాలను కలవరానికి చేస్తోంది. ఆ దూకుడుకు విరుగుడుగానే జపాన్‌, తైవాన్‌ వంటి దేశాలు భారత్‌తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌ నిర్మాణాత్మకంగా స్పందించాల్సి ఉంది.

చైనా ఒత్తిడి :

తైవాన్‌ జాతీయ దినోత్సవాన్ని గుర్తించరాదని, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎలాంటి ఉత్సవాలూ నిర్వహించరాదని చైనా అన్ని దేశాలపైనా తెచ్చినట్లే- భారత్‌పైనా ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇటీవల ప్రయత్నించింది. తైవాన్‌ను ఒక దేశంగా సంబోధిస్తూ వార్తలు ప్రచురించరాదని భారతీయ మీడియాను ఉద్దేశించి న్యూదిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తైవాన్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తించాలని అనేక అంతర్జాతీయ సంస్థలపైనా బీజింగ్‌ నాయకత్వం ఒత్తిడి తెస్తోంది. అలా చేయని పక్షంలో తమ దేశంలో ఆయా సంస్థలు వ్యాపారం చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది. సొంత రాజ్యాంగంతోపాటు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకులున్న తైవాన్‌కు- మూడు లక్షల సైనిక బలగం ఉంది.

అమెరికా అండ :

మెజారిటీ తైవాన్‌ ప్రజలు చైనా వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నారు. కానీ, వాణిజ్యపరంగా తైవాన్‌ చాలావరకు చైనాపైనే ఆధారపడుతోంది. అమెరికా ఏదో స్థాయిలో తైవాన్‌కు అండదండలందిస్తూ... అది సొంతంగా నిలదొక్కుకొనేందుకు ఊతమిస్తోంది. మరోవంక భారత్‌ సైతం తైవాన్‌కు దన్నుగా నిలిస్తే- చైనాపై ఆధారపడటాన్ని ఆ దేశం నిలిపివేస్తుంది. ‘ఇండొ-పసిఫిక్‌ ప్రాంత దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు మేం గట్టిగా ప్రయత్నిస్తున్నాం’ అని ఇటీవల ఓ అంతర్జాతీయ సమావేశంలో తైవాన్‌ ఉప రాష్ట్రపతి చెన్‌ చియాన్‌ జెన్‌ వ్యాఖ్యానించారు.

బలోపేతం దిశగా :

తైవాన్‌ ప్రస్తుతం స్వయంపాలనలో ఉంది. కానీ, చైనా ఇప్పటికీ దాన్ని తమ రాష్ట్రాల్లో ఒకటిగానే పరిగణిస్తోంది. ఈ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. దక్షిణ చైనా సముద్రంలో భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉన్న ద్వీపం... తైవాన్‌! స్ప్రాట్లీ ద్వీప సముదాయంలో సహజంగా ఏర్పడిన అతిపెద్ద సహజ ద్వీపం తైపింగ్‌ (ఇటుఅబా) తైవాన్‌ అధీనంలోనే ఉంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును కట్టడి చేసేందుకు, ఆ దేశపు రాడార్లను నిలువరించేందుకు తైవాన్‌ అధీనంలోని ద్వీపాలు అద్భుతంగా అక్కరకొస్తాయి. తైవాన్‌ మాటకు బొత్తిగా చెల్లుబాటు లేకుండా దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్‌ నాయకత్వం ప్రదర్శిస్తున్న దూకుడు సైతం తైవాన్‌ నాయకత్వాన్ని కొత్త స్నేహాలకోసం చేతులు సాచేలా పురిగొల్పుతోంది. తైవాన్‌తో వాణిజ్య అనుబంధాన్ని నెలకొల్పుకోవడం ఉభయ పక్షాలకూ ఉపకరించే అంశం. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ఒక్క రోజు కూడా ‘లాక్‌డౌన్‌’ లేకుండా తైవాన్‌ మహమ్మారిని గెలిచిన తీరు యావత్‌ ప్రపంచాన్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆరోగ్య వ్యవస్థల నిర్వహణ విషయంలో తైవాన్‌ అనేక దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 1995 నుంచి తైవాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌- ఇకమీదట ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చారిత్రక అవసరం.

- చంద్రకళ చౌధురి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.